Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయందిగ్భ్రాంతికరం

దిగ్భ్రాంతికరం

- Advertisement -

న్యాయవాదిపై తక్షణం చర్యలు తీసుకోవాలి : సీజేఐ గవారుపై దాడికి సీపీఐ(ఎం) ఖండన
న్యూఢిల్లీ : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ బీఆర్‌ గవారుపైకి ఓ న్యాయవాది బూటు విసిరేం దుకు యత్నించిన ఘటనను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆ న్యాయ వాదిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. కోర్టు గదిలో సీజేఐపై ఇలా బూటు విసరడం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించేలా ఉందని పేర్కొన్నది. అదే సమయంలో న్యాయవాది సనాతన ధర్మానికి మద్దతుగా నినాదాలు కూడా చేశారనీ, ఇది తీవ్ర విచారకరమైన అంశమని పొలిట్‌ బ్యూరో వివరించింది. ఈ మేరకు సోమవారం నాడొక పత్రికా ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ముఖ్య మంత్రులు, మంత్రులు, నేతలు ఇటీవల కులతత్వాన్ని పెంచి పోషిస్తూ, మనువాద, మతోన్మాద వ్యాఖ్యలు చేయడమే ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి ధైర్యాన్ని ఇచ్చిందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. హిందూత్వ మతోన్మాద శక్తులు సమాజంలోకి చొప్పిస్తున్న మతోన్మాద విషానికి ఈ సంఘటన మరొక ఉదాహరణ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తమ సిద్ధాంతానికి అనుగుణంగా లేని ఏ అభిప్రాయాన్ని అయినా ఆమోదించేందుకు సంఘ్‌పరివార్‌ సుముఖంగా లేదనీ, వారి అసహనం ఈ చర్య ద్వారా ప్రతిబిం బిస్తోందని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. సీజేఐ గవారుకు తగిన రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. అసహనాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలతో ప్రభుత్వం ధృఢంగా వ్యవహరించాలని కోరింది.

ఇది చీకటి రోజు : సీఎం ఖండన
సీజేఐ బీఆర్‌ గవారుపై దాడి చేయడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఖండించారు. న్యాయ వ్యవస్థలోనే అత్యంత కీలకస్థానంలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం సరైంది కాదని అన్నారు. ఈ ఘటనను ఖండిం చడానికి మాటలు రావడం లేదన్నారు. దేశ చరిత్రలో ఇది చీకటి రోజని సీఎం వ్యాఖ్యానించారు. సీజేఐ బీఆర్‌ గవారుపై పూర్తి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో భారత ప్రజల వెంటే ఉంటానని అభిప్రాయపడ్డారు. ఈ తరహా దాడులతో భయపడేది లేదని సీజేఐ ధైర్యంగా చెప్పడం అభినందనీయమన్నారు.

అలాంటి చర్యలకు చోటు లేదు
సీజేఐ గవారుతో మాట్లాడాను. ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడినీ ఆగ్రహానికి గురి చేసింది. మన సమాజంలో ఇలాంటి చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది. ఈ ఘటన సమయంలో సీజేఐ ప్రశాంతతను ప్రదర్శించటాన్ని నేను అభినందిస్తున్నా. ఇది న్యాయ విలువలు, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన నిబద్ధతను తెలియజేస్తుంది
– ప్రధాని మోడీ


సంఘ్‌ విద్వేషం
సుప్రీంకోర్టులో సీజేఐ గవారుపై దాడికి యత్నించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటన సంఫ్‌ుపరివార్‌ వ్యాప్తి చేస్తున్న ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నది. దీనిని వ్యక్తిగత చర్యగా తోసిపుచ్చటం అంటే పెరుగుతున్న అసహన వాతావరణాన్ని విస్మరించటమే. మతతత్వ శక్తులు సీజేఐనే లక్ష్యంగా చేసే ధైర్యం చేసినపుడు, ఇది విభజన, విషపూరిత రాజకీయాల తీవ్రమైన ప్రమాదాన్ని బహిర్గతం చేస్తుంది. దీనిని సంకోచం లేకుండా ఎదుర్కోవాలి
కేరళ సీఎం పినరయి విజయన్‌

రాజ్యాంగంపై దాడి
సుప్రీంకోర్టులోనే ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండించటానికి మాటలు సరిపోవు. ఇది ఆయన పైనే కాదు.. మన రాజ్యాంగంపై జరిగిన దాడి కూడా. దేశం ఆయనకు సంఘీభావంతో ఐక్యంగా నిలవాలి.
సోనియా గాంధీ

ద్వేషానికి స్థానం లేదు
ఇది మన న్యాయ వ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిపై జరిగిన దాడి. ఇలాంటి ద్వేషానికి స్థానం లేదు. ఇలాంటి ఘటనలను ఖండించాలి.
రాహుల్‌ గాంధీ

సిగ్గుచేటు
సీజేఐపై దాడి ఘటన సిగ్గు చేటు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యున్నత న్యాయ కార్యాలయంపై జరిగిన దాడి. ఈ ఘటన తీవ్ర ఖండనార్హం. ప్రధాన న్యాయమూర్తి దయ, ప్రశాంతత, ఉదారతతో స్పందించిన విధానం సంస్థ బలాన్ని చూపిస్తున్నది. అయితే ఈ ఘటనను తేలికగా తీసుకోవాలని కోరుకోవటం లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -