Friday, November 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవైట్‌హౌస్‌ వద్ద కాల్పులు

వైట్‌హౌస్‌ వద్ద కాల్పులు

- Advertisement -

ఇద్దరు నేషనల్‌గార్డ్స్‌ మృతి.. ట్రంప్‌ ఆగ్రహం

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో వైట్‌హౌస్‌కు అతి సమీపంలో జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. శ్వేత సౌధానికి కొన్ని అడుగుల దూరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వెస్ట్‌ వర్జీనియా నేషనల్‌ గార్ట్స్‌ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. గాయడిపన గార్డ్స్‌ మొదట మరణించినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌, వాషింగ్టన్‌ మేయర్‌ మురియల్‌ బౌజర్‌ తెలిపారు. ఈ దాడి ఒక పక్కా ప్రణాళికతో కూడిన దాడిగా మేయర్‌ అభివర్ణించారు. ఇది పక్కాగా నేషనల్‌ గార్డ్‌ను లక్ష్యంగా చేసుకున్న దాడిగా స్పష్టం చేశారు.

దాడిచేసిన వ్యక్తి శ్వేత సౌధానికి సమీపంలోని మూల మలుపు తిరగగానే గార్డ్స్‌పై కాల్పులు జరపడం ప్రారంభించాడని పోలీస్‌ చీఫ్‌ జెఫ్రీ కారోల్‌ వెల్లడించారు. కాల్పులు జరిగిన వెంటనే సమీపంలో ఉన్న ఇతర నేషనల్‌ గార్డ్‌ సభ్యులు అలర్ట్‌ అయ్యారు. వెంటనే కాల్పులు జరిగిన ప్రదేశంలోకి పరుగెత్తుకు వచ్చి, కాల్పులు జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి కూడా కాల్పుల్లో గాయాలయ్యాయని, అయితే అవి ప్రాణాపాయం కలిగించేవి కావని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ దాడిలో ఒకరు పాల్గొన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రంప్‌ ఆగ్రహం
నేషనల్‌ గార్డ్‌ సభ్యులపై కాల్పులు జరిపిన ఘటనపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రం గా విమర్శించారు. గాయపడిన గార్డ్‌ సభ్యులు త్వరగా కోలుకోవాలని, కాల్పులు జరిపిన వ్యక్తికి కఠిన శిక్ష పడుతుందని హామీ ఇస్తూ, సైనిక దళాలకు, పోలీసులకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ”ఇద్దరు నేషనల్‌ గార్ట్స్‌పై కాల్పులు జరిపి, వారిద్దరినీ తీవ్రంగా గాయపరిచిన ఆ జంతువు కూడా తీవ్రంగా గాయపడింది. అయినప్పటికీ అతను భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దేవుడు మన గొప్ప నేషనల్‌ గార్డ్‌ను, మన సైన్యాన్ని, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మొత్తాన్ని ఆశీర్వ దించుగాక. వీరు నిజంగా గొప్ప వ్యక్తులు. అమెరికా అధ్యక్షుడిగా నాతో పాటు, అధ్యక్ష కార్యాలయంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ, మీతోనే ఉన్నాం” అని ట్రంప్‌ అన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు ఆఫ్గన్‌ దేశానికి చెందిన వాడిగా గుర్తించగా, ఆ దేశ పౌరులకు వీసాలు నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు.

500 మంది గార్డ్స్‌ మోహరింపు
గార్ట్స్‌పై కాల్పుల జరిగిన నేపథ్యంలో శ్వేత సౌధానికి భద్రత పెంచారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు వాషింగ్టన్‌ డీసీకి అదనంగా 500 మంది నేషనల్‌ గార్డ్‌ దళాలను మోహరించనున్నట్టు రక్షణ కార్యదర్శి పీట్‌ హెగ్‌సెత్‌ ప్రకటించారు. ప్రస్తుతం నగరంలో 2,200 మందికి పైగా సైనికులు విధులు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. గార్ట్స్‌పై జరిగిన దాడిపై హెగ్‌సెత్‌ తీవ్రంగా స్పందించారు. ఇదొక పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది సైనికుల లక్ష్యంగా జరిగిన దాడిగా చెప్పారు. తమ రాజధానిని నగరాలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఈ దాడి వైట్‌హౌస్‌కు కేవలం అడుగుల దూరంలో జరిగిందని, ఇది సహించరానిది అని ఆయన ఉద్ఘాటించారు.

డీసీలో గార్డ్స్‌ మోహరింపుపై వివాదం
వాషింగ్టన్‌ డీసీలో నేషనల్‌ గార్డ్‌ దళాల మోహరింపు అంశం కొన్ని నెలలుగా వివాదాస్పదంగా ఉంది. నేరాలను అదుపు చేయడంలో భాగంగా ట్రంప్‌ ప్రభుత్వం సైన్యాన్ని ఉపయోగించడంపై కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. గత ఆగస్టులో ట్రంప్‌ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసి, స్థానిక పోలీసు దళాన్ని సమాఖ్య ఆధీనంలోకి తీసుకుని, ఎనిమిది రాష్ట్రాల నుంచి నేషనల్‌ గార్డ్‌ దళాలను తరలించారు. గత వారం, ఒక ఫెడరల్‌ న్యాయమూర్తి ఈ మోహరింపును ఆపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రభుత్వానికి అప్పీల్‌ చేసుకునేందుకు లేదా దళాలను తొలగించడానికి 21 రోజుల సమయం ఇచ్చారు. తాజా పరిణామం నేపథ్యంలో నేషనల్‌ గార్డ్‌ దళాల మోహరింపు విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -