9 మంది మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
జోహన్స్‌బర్గ్ : దక్షిణాఫ్రికా సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్ షిప్‌లో ఆదివారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని దుండగులు సామూహికంగా కాల్పులు జరిపారని, క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు ప్రకటించారు. అయితే కాల్పులకు కారణం తెలియరాలేదని, నిందితుల కోసం గాలిస్తున్నామని, వేగంగా దర్యాప్తు చేస్తున్నామని వారు మీడియాకు తెలిపారు. బంగారు గనులకు సమీపంలో ఉన్న ప్రాంతం బెకర్స్‌డాల్. ఈ ప్రాంతంలో పేద ప్రజలు నివసిస్తున్నారు.
బంగారం తవ్వకాలు తగ్గిపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. అయితే కాల్పుల సమయంలో అక్కడి వారు ప్రాణ భయంతో పరుగులు తీశారు. కాల్పులు జరిపిన అగంతుకులు 12 మంది ఉన్నారని, వారు తెల్లటి మినీ బస్సులో పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో అత్యంత నేరాల రేటు ఉన్న దేశంగా దక్షిణాఫ్రికా నమోదైంది. రోజుకు సగటున 60 హత్యలు జరుగుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. గత వారం ప్రిటోరియాలోని హాస్టల్‌పై జరిపిన కాల్పుల్లో మూడేళ్ల బాలుడుతో సహా 12 మంది మృతిచెందిన తరువాత తాజాగా బెకర్స్‌డాల్ టౌన్ షిప్ కాల్పుల్లో 9 మంది మరణించారు. అయితే ఈ ఘటనలో ఎవ్వరినీ అరెస్టు చేయకపోవడం గమనార్హం.
దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



