నలుగురు మృతి … మరో ఎనిమిది మందికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాలో ఆదివారం కాల్పులు కలకలం సృష్టించాయి. మిషిగన్‌లోని ఓ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మిషిగన్ రాష్ట్రంలోని గ్రాండ్ బ్లాంక్‌లోగల మోర్మాన్ చర్చిని కారుతో ఢీకొీట్టిన ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం నిప్పు పెట్టాడు. చర్చి మంటల్లో చిక్కుకుపోవడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో చర్చిలో వందల మంది ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఎనిమిది మంది గాయపడ్డారని, నిందితుడు హతమయ్యాడని పోలీసులు చెప్పారు.నిందితుడిని థామస్ జాకబ్ స్యాన్‌ఫోర్డ్ (40)గా గుర్తించామని, అతడు గతంలో యూఎస్ మెరైన్‌లో పనిచేశాడని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయమై పోలీసులు స్పష్టత నివ్వడం లేదు. కాగా, ఈ ఘటనను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దేశంలోని క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు వెంటనే ఆగిపోవాలన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నట్టు తెలిపారు.