రెండు హైకోర్టులు మినహా దేశమంతట ఇదే పరిస్థితి
కోర్టుల్లో అధిక పనిభారంతో అవస్థలు..పెండింగ్‌లో లక్షల సంఖ్యలో కేసులు
కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి ప్రభుత్వం లైట్ తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలున్నాయని పార్లమెంట్ సాక్షిగా ప్రకటిస్తున్నా.. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఎక్స్‌టెన్షన్ ఇస్తూ నెట్టుకోస్తోంది. తాజాగా న్యాయశాఖలోనూ అదే ఇబ్బందులతో సిబ్బంది అవస్థలు పడుతున్నదని కేంద్ర న్యాయశాఖ నివేదికలో వెల్లడైంది.
న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ డేటా ప్రకారం..దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులలో.. మొత్తం 1,122 న్యాయమూర్తుల పోస్టులకు గాను 330 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. న్యాయమూర్తుల ఖాళీలతో సిబ్బందిపై పనిభారం అధికమవుతోంది. దీనితో కేసుల పరిష్కారంలో జాప్యం పెరుగుతోంది. ఫలితంగా లక్షలాది మంది న్యాయమూర్తులపై ప్రభావం చూపుతోంది. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 76 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 35 శాశ్వత పోస్టులతో పాటు 41 అదనపు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీలు అధికంగా ఉన్న ఇతర ప్రధాన హైకోర్టులలో బాంబే హైకోర్టు (26), పంజాబ్ , హర్యానా హైకోర్టు (25), కలకత్తా హైకోర్టు (24), మద్రాస్ హైకోర్టు (19), పాట్నా హైకోర్టు (18), ఢిల్లీ హైకోర్టు (16), రాజస్తాన్ హైకోర్టు (7) ఉన్నాయి. ఉత్తరాఖండ్ హైకోర్టులో రెండు, త్రిపురలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలలో సిక్కిం, మేఘాలయ హైకోర్టులు మాత్రమే పూర్తి సంఖ్యతో పనిచేస్తున్నాయి.
నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజీ) డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా పలు హైకోర్టులలో 67 లక్షలకు పైగా కేసులు, సుప్రీంకోర్టులో 60,000 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. భారత సుప్రీంకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తో సహా 34 మంది న్యాయమూర్తులతో పూర్తి స్థాయిలో పనిచేస్తుండగా, హైకోర్టులు మాత్రం అధిక పనిభారాలతో ఇబ్బంది పడుతున్నాయి. కొలీజియం, ప్రభుత్వ స్థాయిలో నియామక ప్రక్రియలో జాప్యం కారణంగా కొరత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. పదే పదే సిఫారసులు చేసినా కొలీజయం, ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించటం, పంతాలకు పోవటం వంటి కారణాలతో ప్రస్తుత సమస్యలు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. హైకోర్టులలో ఖాళీల రేటు పెరగడం న్యాయవ్యవస్థకు పెద్ద అడ్డంకి అని, దీనితో జాప్యాలు సంభవిస్తున్నాయ ని మాజీ న్యాయమూర్తులు, న్యాయ నిఫుణులు చెప్తున్నారు. కేసుల పెండింగ్ అధికమవుతూ.. దాని ప్రభావం దేశంలోని సాధారణ ప్రజల మీదా పడుతున్నదని వివరిస్తున్నారు.
కేసుల పరిష్కారంపై ప్రభావం : పాట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జి అంజనా ప్రకాశ్
పాట్నా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, న్యాయ నిపుణులు జస్టిస్ అంజనా ప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులలో న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. ఫలితంగా కేసుల పరిష్కారం సమస్యగా మారుతోందని చెప్పారు. దీంతో అటు కక్షిదారులు, ఇటు న్యాయవాదులూ తీవ్ర ఒత్తిడికి గురికావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ”హైకోర్టు లలో న్యాయమూర్తుల పోస్టుల భర్తీని త్వరగా పరిష్కరించాలి. న్యాయవ్యవస్థ, కేంద్రం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమున్నది. లేకపోతే కేసుల పరిష్కారం రేటు పెరగదు. చివరికి రాష్ట్ర స్థాయిలోని న్యాయవాదులను ప్రభావితం చేస్తుంది” అని ఆమె అన్నారు.
న్యాయమూర్తుల ఖాళీలు చాలా ఆందోళనకరం : జస్టిస్ ఎస్.ఆర్ సింగ్
హైకోర్టులలో న్యాయమూర్తుల ఖాళీలు చాలా ఆందోళనకరమనీ, న్యాయవాదులు ఇబ్బందులు పడుతున్నారని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఆర్ సింగ్ చెప్పారు. ”జడ్జి పోస్టుల ఖాళీలు ప్రస్తుత న్యాయమూర్తులపై అనవసరమైన పనిభారాన్ని పెంచుతాయి. ఇది తీర్పుల నాణ్యతను దెబ్బతీస్తుంది. మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. కాబట్టి హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తుల నియామకానికి చర్యలు తీసుకోవాలి” అని ఆయన అన్నారు.