Saturday, May 3, 2025
Homeరాష్ట్రీయంఇందిరమ్మ ఇండ్లు 600 చదరపు అడుగులకు మించొద్దు

ఇందిరమ్మ ఇండ్లు 600 చదరపు అడుగులకు మించొద్దు

– పట్టణ ప్రాంతపు నియోజకవర్గాల్లో 500 ఇండ్లు
– ఈనెల 5 నుంచి 28 మండలాల్లో భూభారతి అమలు
– నీట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు : వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి పొంగులేటి ఆదేశం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇండ్లకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. లబ్దిదారుల ఎంపిక ఎంత వరకు పూర్తయితే అంతవరకు ఏ రోజుకారోజు ఇన్‌చార్జి మంత్రుల నుంచి లబ్దిదారుల జాబితాకు ఆమోదం తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇండ్లను కేటాయించి లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, నీట్‌ పరీక్ష ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి మంత్రి కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనర్హులని తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా కూడా రద్దు చేస్తామన్నారు. ఏప్రిల్‌ 17 నుంచి 30 వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈనెల 5 నుంచి 20 వరకు జిల్లాకొక మండలం చొప్పున 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. అసైన్డ్‌ ల్యాండ్‌లకు సంబంధించి పొజిషన్‌ మీద ఉండి పట్టా లేనివారు, పట్టా ఉండి పొజిషన్‌ మీద లేనివారి వివరాలను సేకరించాలని సూచించారు.
నీట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈనెల 4న జరగనున్న నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరవుతున్నారనీ, అందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటితోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్‌లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, గృహనిర్మాణ శాఖ సెక్రెటరీ జ్యోతి బుద్ద ప్రకాష్‌, సీసీఎల్‌ఏ డైరెక్టర్‌ మకరంద్‌, గృహనిర్మాణ కార్పొరేషన్‌ ఎమ్‌డీ వీపీ గౌతమ్‌, లా అండ్‌ ఆర్డర్‌ డీఐజీ మహేష్‌ భగవత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img