68 జీవోతో మూడు పెద్ద హోర్డింగ్ ఏజెన్సీలకే లాభం
ఆ ఉత్తర్వులను తక్షణమే రద్దుచేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీహెచ్‌ఎంసీ పరిధిలో చిన్న ఏజెన్సీలకు అనుమతి లేకుండా 2020లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవోనెంబర్ 68ని తెచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ఆ జీవో వల్ల కేవలం మూడు హోర్డింగ్ ఏజెన్సీలకే లాభం కలుగుతున్నదని తెలిపారు. హైదరాబాద్‌లో చిన్న ఏజెన్సీలు బతకొద్దా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 68 జీవోను తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ మేరకు జాన్‌వెస్లీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 208 హోర్డింగ్ ఏజెన్సీలున్నాయని వివరించారు. ఈ ఏజెన్సీలు సరిగ్గా పనిచేయడం లేదనే నెపంతో 2020 లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 68 జీవోని తెచ్చి ఈ ఏజెన్సీలను రద్దు చేసిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చిన్న ఏజెన్సీలను లేకుండా చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో కేవలం మూడు పెద్ద ఏజెన్సీలకే లాభం చేకూర్చేలా కట్టబెడుతున్న దని విమర్శించారు. ఇతర మున్సి పల్ కార్పొరేషన్లలో చిన్న హోర్డింగ్ ఏజెన్సీలు తమ కార్యక్రమాలు కొన సాగిస్తుంటే, వాటిని కూడా అడ్డు కుని, హోర్డింగ్‌లు తొలగించే పనులకు ప్రభుత్వం పూనుకుంటున్న దని వివరించారు. 68 జీవోను రద్దు చేయకుంటే ఆ న్యాయమైన సమస్య పరిష్కారానికి సీపీఐ(ఎం) అండగా ఉండి, ఉద్యమాలను తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. చదు కుని, ఉద్యోగాలు రాక జీవనోపాధి నిమిత్తం నిరుద్యోగులు ఏజెన్సీలు పెట్టుకుని ఈ రంగంలో పనిచేస్తు న్నారని తెలిపారు. 68 జీవో వల్ల సుమారు 50 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ స్పందించి మ్యానిఫెస్టోలో ’68 జీవోని రద్దు చేస్తాం. హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాధిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాల వారిని రక్షిస్తాం, చేయూతనిస్తాం’ అని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా, వారి సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తక్షణమే 68 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని చిన్న, పెద్ద ఏజెన్సీలకు తోడ్పాటునివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
లోకల్ కోటా కౌన్సిలింగ్‌లో పాల్గొనేలా అర్హత కల్పించాలి : సీఎంకు సీపీఐ(ఎం) లేఖ
తెలంగాణలో ఒకటి నుండి పదో తరగతి వరకు చదివి, ఇంటర్మీడియట్ ఆంధప్రదేశ్‌లో చదివిన విద్యార్థులను తెలంగాణ లోకల్ విద్యార్థులుగా పరిగణిస్తూ, నీట్-2024 అడ్మిషన్‌లో లోకల్‌కోటా కౌన్సిలింగ్‌లో పాల్గొనేలా అర్హత కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం లేఖ రాశారు. ‘రాష్ట్ర సరిహద్దు జిల్లాలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఒకటి నుండి పదో తరగతి వరకు రాష్ట్రంలో చదివి, ఇంటర్మీడియట్ విద్యను ఆంధ్రప్రదేశ్‌లో చదివారు. జీవో 114, జూలై 5,2017 ప్రకారం ఏడు సంవత్సరాల్లో నాలుగేండ్లు చదివిన వారికి లోకల్ కోటాలో అవకాశమిచ్చే వారు. కానీ ఈ విద్యార్ధులను స్థానిక కోటాలో పరిగణించ బోమని 2024 జూలై 19న జీవో నెం.33ను ప్రభుత్వం తెచ్చింది. కానీ ఈ విద్యార్థులు మార్చి 2024లోనే ఇంటర్ మీడియట్ పూర్తిచేసే నాటికి ఈ జీవో నిబంధనలు రాలేదు. ప్రస్తుతం తెచ్చిన జీవో నంబర్ 33 ద్వారా ఈ విద్యార్థులు స్థానికత కోల్పోవడంతో వీరి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ర్యాంక్ సాధించినా, మెడికల్ సీటు రాని పరిస్థితి ఏర్పడిరది. దీంతో నిరాశ, నిస్పృహ, మానసిక క్షోభకు విద్యార్థులు గురవుతున్నారు’. ఈ సమస్యను పరిశీలించి, వారిని లోకల్ విద్యార్థులుగా పరిగణించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
హోర్డింగ్ పరిశ్రమ కోసం కొత్త విధానాన్ని తేవాలి
హోర్డింగ్ పరిశ్రమను బలోపేతం చేయాలనీ, ఆదాయ ఉత్పత్తి మాడ్యుళ్లు, ప్రజల భద్రత కోసం కొత్త విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఆయన్ను గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఔట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. సమస్యలను వివరించింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజాసంఘాలు, సంస్థలు, పార్టీలను కలుపుకుని ఏజెన్సీలు ఉద్యమించాలని కోరారు. వారి న్యాయమైన సమస్య పరిష్కారానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ ఔట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, సీనియర్ నాయకులు డిజి నరసింహారావు, అసోసియేషన్ నాయకులు రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.