– వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒక స్థల వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడంపై హైకోర్టు శుక్రవారం విచారించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని హౌంశాఖ ముఖ్యకార్యదర్శి, నగర పోలీసు కమిషనర్, శామీర్‌పేట ఎస్‌హెచ్‌ఓ, ఎస్సై, ప్రయివేటు వ్యక్తి వెంకటరెడ్డిలకు నోటీసులిచ్చింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ జస్టిస్ శ్రవణ్‌కుమార్ ఆదేశాలను జారీ చేశారు. సివిల్ వివాదంలో పోలీసులు ఏ విధంగా జోక్యం చేసుకుంటారో చెప్పాలని ఆదేశించారు. శామీర్‌పేట ఎస్‌హెచ్‌ఓ, ఎస్సైలు సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారని పేర్కొంటూ శామీర్‌పేట మండలం తూంకుంటకు చెందిన అనిల్‌కుమార్ పిటిషన్ వేశారు. తూంకుంటలో 133 చదరపు గజాలను పిటిషనర్ 2018 మార్చిలో కొన్నారనీ, ప్రహారీ, గది నిర్మించి పన్ను చెల్లిస్తున్నారనీ, ఆ గదిలోని వాచ్‌మెన్‌ను వెంకటరెడ్డి అనే వ్యక్తి బయటకు పంపేసి నోటరీ పేపర్‌తో స్థలాన్ని కాజేశారనీ, ఇందకు పోలీసులు కూడా సహకరించారని చెప్పారు.
అఖండ-2 నిర్మాతకు ఊరట టిక్కెట్ల ధరల పెంపునకు బెంచ్ అనుమతి
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 టికెట్ల ధరలు పెంపు జీవో అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ స్టే విధించింది. టిక్కెట్ ధరల పెంపునకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన మెమోను నిలిపేస్తూ సింగిల్ జడ్జి గురువారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సినిమా నిర్మాత అత్యవసర అప్పీల్ పిటిషన్ వేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్ డివిజన్ బెంచ్ విచారించి స్టే విధించింది. పెరిగిన టిక్కెట్ ధర ప్రకారం కావాల్సిన వాళ్లు సినిమా చూస్తారని, అవసరం లేని వాళ్లు సినిమా చూడరని అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు వేసిన ముగ్గురు వ్యక్తుల కోసం నిర్మాత, డిస్టిబ్యూటర్లు ఇబ్బందిపడటం సరికాదని తెలిపింది. ఈ నెల 15 వరకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా, టిక్కెట్ ధరలపై జారీ చేసిన మెమో అమలును నిలిపివేసినప్పటికీ బుక్ మై షో పెంచిన ధరల ప్రకారమే టిక్కెట్‌లను విక్రయించిదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ జస్టిస్ శ్రవణ్‌కుమార్ విచారించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో నోటీసులు జారీ చేశారు.
భూసేకరణ తుది తీర్పుకు లోబడి ఉండాలి
రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఇంటర్ ఛేంజ్ నుంచి ఆమన్‌గల్ రీజినల్ రింగ్ రోడ్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణం కోసం సేకరించే భూసేకరణ తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు షరతు విధించింది. పిటిషనర్లను తమ భూముల నుంచి తరలించొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల భూములకు సంబంధించి గతంలో జారీ చేసిన స్టేటస్‌కో ఉత్తర్వులను శుక్రవారం మరోసారి పొడిగించింది. భూసేకరణకు అధికారులు ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం బండ్లగూడకు చెందిన నీరటి రవీందర్, ఇతరులు సవాల్ చేసిన పిటిషన్‌ను జస్టిస్ శ్రవణ్‌కుమార్ శుక్రవారం విచారించారు. పిటిషనర్‌కు నోటీసు కూడా ఇవ్వలేదనీ, భూసేకరణ నిలిపేయాలని పిటిషనర్ న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, కొందరు పిటిషనర్లు పరిహారం తీసుకున్నారనీ, భూసేకరణకు అవరోధం లేకుండా చేయాలని కోరారు. వాదనలపై న్యాయమూర్తి, తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్లను తొలగించరాదని ఆదేశించారు. విచారణ ఈ నెల 29కి వాయిదా వేశారు.
సివిల్ వివాదంలో పోలీసుల జోక్యమా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



