విధి నిర్వహణలో న్యాయవ్యవస్థ
విఫలమైతే ప్రజాస్వామ్యంపై ప్రభావం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి
గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు కోరవచ్చు : జస్టిస్ సూర్యకాంత్
పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ల నిర్ణయంపై తీర్పు రిజర్వ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘ప్రజాస్వామ్యంలోని ఒక విభాగం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైతే, రాజ్యాంగ సంరక్షకులుగా సుప్రీంకోర్టు శక్తిహీనమై పనిలేకుండా కూర్చోవాలా?’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి చేసిన సూచనపై సుదీర్ఘంగా పది రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఎఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును గురువారం రిజర్వు చేసింది. ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఒక అధికారం ఎంత ఉన్నతంగా ఉన్నా… నేను అధికారాల విభజన సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా. న్యాయ కార్యకలాపాలు న్యాయ ఉగ్రవాదంగా మారకూడదని కూడా నమ్ముతున్నాను. అదే సమయంలో, ప్రజాస్వామ్యంలోని ఒక విభాగం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైతే, రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న కోర్టు శక్తిహీనమై పనిలేకుండా కూర్చోవాలా?” అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలు గవర్నర్ల అంశాన్ని పరిశీలించడంతో అది సామరస్యంతో ఉనికిలో ఉంటుందని తెలిపారు. గవర్నర్లను నియమించేటప్పుడు, సాధారణంగా ప్రాంతీయ ప్రభుత్వాలు (ఇప్పుడు రాష్ట్రాలు) బోర్డులో పరిగణనలోకి తీసుకుంటాయని పేర్కొన్నారు.
గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు కోరవచ్చు: జస్టిస్ సూర్యకాంత్
ఆర్టికల్ 200 కింద గవర్నర్‌ను ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు కోరలేదని, కానీ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు కోరవచ్చని జస్టిస్ జె. సూర్యకాంత్ పేర్కొన్నారు. తరువాత సందర్భాల్లో మాండమస్ జారీ చేయవచ్చని అన్నారు. విచారణ సందర్భంగా గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయగలరా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గవర్నర్లు బిల్లులను అసెంబ్లీకి తిరిగి పంపకపోతే, అది ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ ఇష్టానుసారం చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదించకపోవడం సరికాదని ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపించడమో చేయాలని పేర్కొంది. బిల్లులను వెనక్కి పంపితే, ఎందుకు అలా చేశారనే కారణాలు కూడా చెప్పాలని పేర్కొంది.
గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే, రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. గవర్నర్ల అంశం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142తో అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని పేర్కొంది. అయితే దీనిపై తనను న్యాయస్థానం అలా ఆదేశించవచ్చా? అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును వివరణ కోరారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్143(1) కింద 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించి, న్యాయ సలహా కోరారు. దీంతో ఈ విషయంపై తమ అభిప్రాయాలను తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు కోరింది. బీజేపీపాలిత ప్రాంతాలు గవర్నర్లు, రాష్ట్రపతికి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశాయి. బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువు ఉండాలని తమిళనాడు, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు పేర్కొన్నాయి. చివరిగా దేశంలోని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
రాజ్యాంగ సంరక్షకులుగా బలహీనమై ఉండాలా?
- Advertisement -
- Advertisement -