Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయంవదిలించుకుందామా..?

వదిలించుకుందామా..?

- Advertisement -

– సంక్షేమ పథకాలను గుదిబండలా భావిస్తున్న కేంద్రం
– ఓట్లు రాల్చలేకపోతున్న సంక్షేమ కార్యక్రమాలు
– నత్తనడక నడుస్తున్న పనులు… నిధుల కొరతతో ఇబ్బందులు

ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ కార్యక్రమాలు, ఫ్లాగ్‌షిప్‌ పథకాలు గత దశాబ్ద కాలంగా అధికార బీజేపీకి ఎన్నికల ప్రచారాస్త్రాలుగా కొనసాగుతున్నాయి. అయితే వాటిని ఇప్పుడు ఎలా వదిలించుకోవాలా అని బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో మోడీ పలు సంక్షేమ పథకాలు ప్రకటించారు. అయితే ఇవి ఇప్పుడు రాజకీయంగా ఎందుకూ కొరగాకుండా పోయాయని ఆయన సన్నిహితులే అభిప్రాయపడుతున్నారు. ఈ పథకాలు ‘పేదవాడి హీరో’గా మోడీ ఇమేజ్‌ని పెంచుతాయని తొలుత అందరూ భావించారు కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఈ పథకాలను వదిలేయాలని అర్థిక మంత్రిత్వ శాఖ నుంచి, ఫైనాన్స్‌ కమిషన్‌ (ఎఫ్‌సీ) నుంచి ఒత్తిడి వస్తోంది.
న్యూఢిల్లీ : ప్రస్తుత ఎఫ్‌సీ చైర్మెన్‌ అరవింద్‌ పనగారియా జనబాహుళ్య పథకాలను గతంలో విమర్శించేవారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కొన్ని పథకాలు ఆశించిన ప్రయోజనాలను ఇవ్వడం లేదని పార్టీ విశ్లేషకులు సైతం తేల్చేశారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నికలకు ముందు ప్రకటించే ‘బొనాంజా’లు ఓటర్లను ఆకర్షించే మాట అటుంచి ఆయా రాష్ట్రాల ఖజానాలను ఖాళీ చేయిస్తున్నాయి.


నిధులు ఆపేస్తారా?
పథకాలు ‘సంతృప్త’ స్థాయికి చేరుకుంటున్నాయని రెండేండ్ల క్రితం ముఖ్యమంత్రుల సమావేశంలో మోడీ చెప్పారు. దీంతో జనాకర్షక పథకాలను వదులుకుంటున్నారన్న తొలి సంకేతం వెలువడింది. అప్పటి నుంచి ఆయన తరచూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. పథకాలు సంతృప్త స్థాయికి చేరడం నిజమైన లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన గతేడాది చెప్పుకొచ్చారు. తన సంక్షేమ పథకాలు 100 శాతం కవరేజీ లేదా సంతృప్త స్థాయికి చేరుకున్నప్పుడు ‘బుజ్జగింపు రాజకీయాలు’ ముగుస్తాయని మోడీ తెలిపారు. తాజాగా మే నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ విభాగాల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తూ థర్డ్‌ పార్టీ మదింపు జరగని పక్షంలో 2026 నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్‌ఎస్‌), కేంద్ర రంగ పథకాలకు (సీఎస్‌) నిధులు నిరాకరించాలని స్పష్టం చేసింది.


డేటా లేదు.. స్వోత్కర్షలే
మోడీ చెబుతున్నట్టు సంక్షేమ పథకాల అమలు సంతృప్త స్థాయికి చేరుకున్నదా? దీనిపై కూడా కచ్చితత్వంతో కూడిన సమాచారం అందుబాటులో లేదు. ‘దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ లభిస్తోంది’, ’50 కోట్ల మంది పౌరులు బ్యాంకింగ్‌ వ్యవస్థలో చేరారు’, ‘డీబీటీ ద్వారా 34 కోట్ల మందికి సాధికారత చేకూరింది’, ‘నాలుగు కోట్ల మందికి పక్కా ఇండ్లు లభించాయి’ వంటి వాదనలు (ఇవన్నీ 2024లో బీజేపీ మ్యానిఫెస్టోలో ఉన్నవే) మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి.


ఈ పథకాలు ఎప్పటికి పూర్తవుతాయో?
ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు 2014లోనే ఆమోదం లభించినా నేటికీ అమలుకు నోచుకోలేదు. ఇప్పుడీ ప్రాజెక్టు ఖజానాకు పెద్ద గుదిబండలా మారింది. గంగానదిని ఐదేండ్లలో పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న లక్ష్యంతో 2014లో చేపట్టిన ‘నమామి గంగ’ పథకం పదకొండేండ్లు గడిచినా నత్తనడక నడుస్తూనే ఉంది. కేటాయించిన సొమ్ములో కేవలం 69 శాతమే ఖర్చయింది. గంగలోకి శుద్ధి చేయని మురుగు నీరు నేటికీ ప్రవహిస్తూనే ఉంది. 2024 నాటికి ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా 2019లో ప్రారంభించిన ‘నల్‌ సే జల్‌’ సైతం ముందుకు సాగడం లేదు. కేవలం ఆరు రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నాయి. సుమారు నాలుగు కోట్ల గృహాలకు ఇప్పటికీ తాగునీరు అందడం లేదు. పథకానికి నిధులు కేటాయింపులో కూడా కోత పెట్టారు. వెనకపట్టు పట్టిన మరో పథకం ‘పీయం కుసుమ్‌’. పది వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను వికేంద్రీక రించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఐదేండ్ల కాలంలో అందులో కేవలం 2.56 శాతం పనులు మాత్రమే జరిగాయి. సంఘటిత రంగంలో మాత్రం లక్ష్యంగా నిర్దేశించుకున్న 14 లక్షల సోలార్‌ పంపుల్లో 7.12 లక్షల పంపులు బిగించారు. దిగుమతి చేసుకుంటున్న ప్యానల్స్‌ ఖరీదు అధికంగా ఉండడం, దేశీయంగా ఉత్పత్తి తక్కువగా ఉండడంతో సౌర విద్యుత్‌ రంగం సమస్యలు ఎదుర్కొంటోంది. దేశీయ పెట్టుబడిదారుల నిరాసక్తత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడంతో మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలు కూడా ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి.


‘గ్యారంటీ’ ఎక్కడీ
సంక్షేమ పథకాలు ప్రభావం చూపలేకపోవడంతో మోడీ, షా ద్వయం మరో మార్కెటింగ్‌ వ్యూహాన్ని ప్రయత్నించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ‘మోడీ గ్యారంటీ’ అనే మాట బాగా వినిపించింది. ప్రతి ఎన్నికల ర్యాలీలోనూ ‘వంద శాతం గ్యారంటీ’ అనే పదాన్నే మోడీ ఉపయోగించారు. బీజేపీ మ్యానిఫెస్టో కూడా మోడీ హామీ కార్డేనని ఆయన స్పష్టం చేశారు. మోడీ పథకాలు వేర్వేరు ఓటు బ్యాంకులను ఆకర్షించడం ప్రారంభించాయి. కొన్ని పథకాలను ఆయన ఎర్రకోట నుంచే ఆవిష్కరించారు. కొన్నింటిని హడావిడిగా ప్రకటించారు. గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌, జల్‌ జీవన్‌ మిషన్‌, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి వంటి పథకాలు ఈ కోవలోనివే. మోడీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకు… అంటే గత ఆగస్టులో జన్‌ధన్‌ యోజన, స్కిల్‌ ఇండియా అభియాన్‌, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాలను ప్రకటించారు. ఇవి కాక అనేక బీమా పథకాలు, పెన్షన్‌ పథకాలు, మంచి నీటి పథకాలను కూడా ప్రకటించారు. అయితే నిధుల కొరత, ప్రభుత్వ ఉదాశీనత కారణంగా వీటిలో చాలా వరకూ సరిగా అమలు కావడం లేదు. దీంతో వాటిని వదిలించుకోవాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు.

మోడీ పథకాలు ఎన్ని?

ఫ్లాగ్‌షిప్స్‌ సహా మోడీ పథకాల్లో అనేకం సీఎస్‌ఎస్‌ లేదా సీఎస్‌ కిందికే వస్తాయి. వీటిలో కొన్నింటి పైన అయినా వేటు పడకుండా మోడీ చివరి క్షణంలో అడ్డుకుంటారా? ఎందుకంటే అవి ఇప్పటికీ ఎన్నికల్లో కొంతమేర ఓట్లు రాలుస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి మోడీ పథకాలకు విస్తృత ప్రచారం లభించింది. అయితే సీఎస్‌ఎస్‌, సీఎస్‌ సహా అలాంటి పథకాలు ఎన్ని ఉన్నాయో తెలియడం లేదు. వాటి సంఖ్యపై కొంత గందరగోళం కూడా నెలకొంది. 131 కేంద్ర ప్రయోజిత పథకాలున్నాయని వ్యయ విభాగం లెక్క కట్టింది. అయితే ప్రతి మంత్రిత్వ శాఖ సొంత గణాంకాల చిట్టా విప్పుతోంది. ఐఏఎస్‌ కోచింగ్‌ కేంద్రాలు వివిధ వనరుల నుంచి సేకరించిన డేటాను ఉద్యోగార్థులకు అందజేస్తున్నాయి. పార్లమెంటులో అప్పుడప్పుడు వెల్లడించే పథకాలు కూడా వీటిలో ఉంటాయి. కొన్ని ప్రయివేటు అధ్యయనాలు కూడా పథకాలను ఏకరువు పెడుతుంటాయి. అయితే అవి కూడా అదనపు సమాచారాన్ని అందించడం లేదు. మొత్తమ్మీద మోడీకి ప్రీతిపాత్రమైన పథకాలు ఎన్ని అమలులో ఉన్నాయన్న దానిపై స్పష్టత లేదు.

ఉపాధి హామీ పథకంలో అవినీతి
ఈ నేపథ్యంలో ‘న్యూస్‌క్లిక్‌’ పోర్టల్‌ కోసం సీనియర్‌ పాత్రికేయుడు పి.రామన్‌ కొంత సమాచారాన్ని సేకరించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని గ్రామీణాభివృద్ధి శాఖ కోరినప్పటికీ ఆర్థిక శాఖ బడ్జెట్‌లో 60 శాతం నిధుల పరిమితి విధించింది. ఇది మోడీ చెబుతున్న సంతృప్త స్థాయి ఎలా అవుతుంది? అది ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌నే సూచిస్తోంది. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ సహా డజను రాష్ట్రాల్లో ఉపాధి పథకం అవినీతిలో కూరుకుపోయింది. గుజరాత్‌లో జరిగిన 71 కోట్ల భారీ కుంభకోణానికి సంబంధించి బీజేపీ మంత్రిని, ఆయన కుమారుడిని అరెస్ట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -