దేశానికి ఏమీ చేయనోడు మున్సిపాలిటీల్లో ఏం చేస్తాడు?
బీఆర్‌ఎస్, బీజేపీది చీకటి ఒప్పందం
కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తుండ్రు
కేసీఆర్ చరిత్ర నేను మారిస్తే మారేది కాదు
చేవెళ్ల రోడ్డు ప్రమాదాల పాపం కేసీఆర్, సబితాఇంద్రారెడ్డిదే..
గోదావరి జలాలతో రంగారెడ్డి బీడ్లను తడుపుతాం
వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కాబోతుంది : పరిగి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘మోడీని చూసి స్థానిక ఎన్నికల్లో ఓటు వేయాలని బీజేపీ నాయకులు చెబుతుండ్రు.. 12 ఏండ్లుగా దేశానికే ఏమీ చేయనోడు.. ఇక మున్సిపాలిటీలకు వచ్చి ఏమీ చేస్తాడు.. బీఆర్‌ఎస్, బీజేపీది చీకటి ఒప్పందం.. ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తుండ్రు..” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘పెండ్లి పెద్దను చూసి పిల్లనిస్తే.. పిల్లగాడు పనికి రాకపోతే ఏం చేయాలి’ అంటూ ఎద్దేవా చేశారు. మోడీని చూసి ఓటేస్తే, గల్లీ బీజేపీ నేతలు పని చేయకపోతే, మోడీని అడగలేం కదా అని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో శనివారం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రూ.38 వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి పూనుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడని చెప్పుకునే కేసీఆర్, రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లా నాయకురాలు అని చెప్పుకుంటున్న సబితమ్మ కేసీఆర్‌ను ఎందుకు అడగలేదని అన్నారు. లక్ష్మిదేవిపల్లిలో రిజర్వాయర్‌కు సంబంధించి భూసేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని, నిర్మాణానికి ప్రణాళికలు పూర్తి చేస్తామని తెలిపారు. గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవేళ్లను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. తాండూర్‌కు అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, పరిగి, వికారాబాద్ మున్సిపాలీటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. త్వరలో ‘రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు రాబోతున్నాయి. కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉండి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ రోడ్డు వేయలేకపోయారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోయారు. ఈ పాపం కేసీఆర్, సబితాఇంద్రారెడ్డిలదే..’ అని సీఎం ఆరోపించారు. వికారాబాద్ ప్రపంచ స్థాయిలో పర్యాటక కేంద్రంగా మారబోతుందన్నారు.
‘రాబోయే ఎనిమిదేండ్లు ఇందిరమ్మ రాజ్యమే కొనసాగుతుంది.. రాసిపెట్టుకొండ్రి..’ అని అన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని, ట్యాంపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వకపోతే ఏమి చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్ర తాను మార్చితే మారేది కాదన్నారు. ‘దొంగ పాస్ పోర్టు, దొంగనోట్లు, దళితులను దగా చేసిన చరిత్ర ఆయనదని, తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం పాపాల భైరవుడి చరిత్ర చెరిగిపోదని’ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి ప్రజాధనం వృథా చేశారని, గోదావరి జలాల ముసుగులో వేల కోట్లు కొల్లగొట్టి ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు.
కేసీఆర్ దళితులను మోసం చేస్తే.. దళితుడైన గడ్డం ప్రసాద్‌ను కాంగ్రెస్ స్పీకర్‌ను చేసిందన్నారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే బీఆర్‌ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయన్నారు. వరదలు వచ్చినప్పుడు మూసీ సమీపంలోని ఇండ్లకు వెళ్లాలని బీజేపీ నేతలను కోరానని, వరదలు వచ్చినప్పుడు బీజేపీ నేతలు వెళ్లి ఉంటే మూసీలో కొట్టుకుపోయి కృష్ణానదిలో తేలేవాళ్లని అన్నారు. అనంతరం మహిళలకు రూ.567,69,00,000 స్త్రీ నిధి రుణాలను సీఎం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసన మండలి చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్ రెడ్డి, బుయ్యని మనోహర్‌రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్ట్
వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్, జిల్లా కమిటీ సభ్యులు, సీఐటీయూ నాయకులు, ఆశ, అంగన్‌వాడీ నాయకులను శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇండ్ల వద్ద పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. అరెస్టు అయిన వారిలో జిల్లా కమిటీ సభ్యులు సుదర్శన్, సతీష్, కుమార్, పార్టీ అభ్యర్థి శోభారాణి తదితరులు ఉన్నారు.



