Monday, March 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదళితులు పరిపాలన చేయొద్దా?

దళితులు పరిపాలన చేయొద్దా?

- Advertisement -

వారి పట్ల ఇదేనా మీ వైఖరి
అప్పుడు ఎస్సీని సీఎం చేస్తామన్నారు..మాట తప్పారు
ఇప్పుడేమో దళితుడు స్పీకర్‌గా ఉన్నారు కాబట్టి సభకు రావటం లేదు : అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్‌రెడ్డి
గులాబీ పార్టీ మంత్రాలకు చింతకాయలు రాలవంటూ ఎద్దేవా
పొంగులేటి రాజీనామా కుదరదంటూ వ్యాఖ్య
ఇక్కడ ఉన్నది రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క అంటూ హెచ్చరిక

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌
‘దళితులు పరిపాలనలో భాగస్వాములు కాకూడదా? వారు పెద్ద పదవులు చేపట్టొద్దా? ఇదేనా వారి పట్ల మీ పార్టీ వైఖరి…’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి… ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే దళితుడినే మొట్టమొదటి సీఎం చేస్తానని చెప్పిన ఆ పార్టీ అధినేత కేసీఆర్‌… ఇచ్చిన మాట తప్పారని ఎద్దేవా చేశారు. ఆనాడు అలా వ్యవహరించిన ఆయన… ఇప్పుడు శాసనసభ స్పీకర్‌గా దళితుడైన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఉన్నారు కాబట్టే… అసెంబ్లీకి రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆదివారం సభలో బిల్లులపై చర్చ సందర్భంగా… బీఆర్‌ఎస్‌ సభ్యులు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన దానిగా చెబుతున్న రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ వ్యవహారంపై హౌస్‌ కమిటీకి పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఆ సందర్భంగా సీనియర్‌ సభ్యుడు కడియం శ్రీహరి మాట్లాడేందుకు ప్రయత్నించగా… బీఆర్‌ఎస్‌ సభ్యుడు పాడి కౌశిక్‌ రెడ్డి, ఆయన వైపు వేలు చూపుతూ.. రకరకాల సైగలు చేస్తూ బెదిరించినట్టుగా వ్యవహరించారు. ఆ సందర్భంగా సభలో పెద్ద దుమారం చెలరేగింది.

ఈ దశలో జోక్యం చేసుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాన ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్‌ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌నుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు, ఆ పార్టీ సభ్యుడు కేటీఆర్‌ను ఉద్దేశించి పలుమార్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్‌… వారికి పరిపాలన చేయరాదని, అందువల్ల తానే సమస్యలను పరిష్కరిస్తానని అవమానించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారని విమర్శించారు. ఎస్సీని ఉప ముఖ్యమంత్రి చేసిన ఆయన.. ఆ తర్వాత అతడిని కూడా బర్తరఫ్‌ చేశారన్నారు. 2018లో ఎస్సీల నుంచి కొప్పుల ఈశ్వర్‌ ఒక్కరికే మంత్రివర్గంలో చోటు కల్పించారని గుర్తు చేశారు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దళితుడైన భట్టి విక్రమార్కను ఓర్వలేకపోయారని చెప్పారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందర్నీ లాక్కుని అపోజీషన్‌ లీడర్‌ పదవి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు తమ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా హరీష్‌రావు ఉండగా మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ ఉన్నారని వివరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో భట్టి విక్రమార్క… బడ్జెట్‌ను ప్రవేశపెడితే ఆయన్ను అవమానించేలా బీఆర్‌ఎస్‌ సభ్యులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, సీతక్క వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌, రామచంద్ర నాయక్‌, వేముల వీరేశం, అద్దంకి దయాకర్‌… ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది దళితులకు, ఆదివాసీలకు తమ ప్రభుత్వంలో పదవులు కల్పించామని చెప్పారు. ఇదీ తమ టీమ్‌ అని పేర్కొన్నారు. కానీ గతంలో కేసీఆర్‌ టీమ్‌లో హరీష్‌ రావు, కేటీ రామారావు, దయాకర్‌ రావు, వినోద్‌ రావు, కవితారావు, సంజరురావు… ఇలా అందరూ రావులే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

దళితులను చిన్నచూపు చూసే కేసీఆర్‌కు కనువిప్పు కలిగించేందుకే స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఎన్నుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో దళితుడిని మైక్‌ అడగాల్సి వస్తుందనే కాఉరణంతోనే కేసీఆర్‌ సభకు రావటం లేదని దెప్పిపొడిచారు. ఈ రకంగా బీఆర్‌ఎస్‌ నేతలు దళితులపట్ల తీవ్రమైన వివక్షను ప్రదర్శిస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, ఇతర పార్టీల్లోంచి వచ్చిన వారికి మంత్రి పదవులిచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే పార్టీ నేతలు ఫిరాయింపులపై మాట్లాడటం, సభలో గోల చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలనే విధానంతో ముందుకు వెళుతున్నామని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సంస్కరణల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నామని తెలిపారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించి 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మైనింగ్‌ శాఖ నోటీసులు ఇచ్చి పన్నులు రాబట్టిందని చెప్పారు.

ఏ విషయంలోనైనా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంత పారదర్శకంగా తాము తీసుకున్న చర్యలను అభినందిస్తే అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారని అభిప్రాయపడ్డారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ వ్యవహారంపై హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మూడు హౌస్‌ కమిటీలు వేసి, బ్లాక్‌ మెయిల్‌ చేసి ఆస్తులు గుంజుకున్నారని వివరించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ లబ్ది పొందారని వ్యాఖ్యానించారు. వారిలా హౌస్‌ కమిటీ వేసి రాజకీయ లబ్ది పొందాలని తాము భావించటం లేదన్నారు. అందుకే పదేండ్ల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఖనిజ సంపద దోపిడీ, అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని తెలిపారు.

ప్రతిపక్షాల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా సీబీసీఐడీ అధికారులకు అందించాలని సూచించారు. వాటిపై సంపూర్ణంగా విచారించి, దోషులను శిక్షిస్తామని స్పష్టం చేశారు. హౌస్‌ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందేనని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తాము నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని స్పష్టం చేశారు. ఆ సంస్థపై నమ్మకం లేకపోతే సీబీఐకి విచారణకు అప్పగించాలా? అని అడిగారు. బ్లాక్‌ మెయిల్‌ చేయడానికే బీఆర్‌ఎస్‌ నేతలు హౌస్‌ కమిటీ కోరుతున్నారని విమర్శించారు. ‘ఇక్కడ ఉన్నది రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క… అందువల్ల మీ పప్పులుడకవు…’ అని హెచ్చరించారు. అక్రమ మైనింగ్‌ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అయినా, రేవంత్‌రెడ్డి కుటుంబమైనా… ఆ వ్యవహారంలో ఎవరున్నా ఆధారాలు బయటపెట్టాలని సీఎం సవాల్‌ విసిరారు.

ఆధారాలుంటే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మీరు చెప్పింది వినకపోతే పొంగులేటి రాజీనామా చేయాలా? ‘ అని ప్రశ్నించారు. మీ తాతలు దిగొచ్చినా అది జరగదు…’ అని వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలకు వ్యతిరేకంగా చైర్‌ను డిక్టేట్‌ చేసే సంస్కృతి ఎక్కడిదని ప్రశ్నించారు. ఎన్నో ఏండ్ల అనుభవమున్న సీనియర్‌ సభ్యులు వ్యవహరించేది ఇలాగేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి నిజాయితీ, నిబద్ధతను దేశంలో ఎవరూ శంకించలేరని సీఎం వ్యాఖ్యానించారు. ‘మీ సభ్యుడు వ్యవహరించిన తీరును మీరు సమర్ధిస్తున్నారా..? కడియంకు జరిగినట్టుగా కేసీఆర్‌కు జరిగితే మీరు సమర్ధిస్తారా..?’ అంటూ హరీశ్‌రావు, కేటీఆర్‌లను సీఎం ప్రశ్నించారు. సభలో కుస్తీలు పట్టడానికి రాలేదని, సీనియర్‌ సభ్యులను అవమానించే ఇలాంటి వ్యవహార శైలి మంచిది కాదని హితవు పలికారు. దీనికి ఇక్కడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అవమానకరంగా, అసభ్యంగా వ్యవహరించిన పాడి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. హరీష్‌రావు సూచన మేరకు ఎథిక్స్‌ కమిటీని ఏర్పాటు చేసి దానికి పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారాన్ని సిఫారసు చేయాల్సిందిగా సీఎం కోరారు.

పాడిపై మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌
శాసనసభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మాట్లాడక ముందు స్పీకర్‌… ఇదే అంశంపై ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. కడియం శ్రీహరి విషయంలో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును వారు తప్పుబట్టారు. శ్రీహరికి ఆయన క్షమాపణలు చెప్పాలనీ, సభ నుంచి సస్పెండ్‌ చేయాలని మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

సభలో నిరసన
రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంలో సభా సంఘం వేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు దాదాపు రెండు గంటలపాటు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్‌ అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు నిలబడి చప్పట్లతో ఆందోళనకు దిగారు. కాగితాలను చించి గాల్లో ఎగరేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -