– రహదారి విస్తరణ జాప్యం పై స్థానికులు నిరసన
– రాస్తారోకో తో నిలిచిపోయిన వాహనాలు
– పోలీస్ లు జోక్యంతో విరమణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు ఏళ్లు గడుస్తున్న పూర్తి కాకపోవడంతో రోడ్లపై నుంచి లేస్తున్న దుమ్ము ధూళి భరించలేక పోతున్నా మంటూ బుదవారం స్థానికులు పేరాయిగూడెం సమీపంలో రోడ్డుకి అడ్డంగా డ్రమ్ములు పెట్టి ఆందోళనకు దిగారు. దీంతో సత్తుపల్లి – జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.సమాచారం అందుకున్న ఎస్ఐ కే.అఖిల సిబ్బందితో మ ఘటనాస్థలికి చేరుకొని ఆందోళన దిగిన వారితో చర్చించారు.సుమారు రెండు సంవత్సరాలుగా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తుండడంతో తమ బ్రతుకులు దుమ్ము కొట్టి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఇదిగో అదిగో అంటూ ఏళ్లు గడుపుతున్నారు గానీ పనులు మాత్రం పూర్తి కావడం లేదని స్థానికులు వాపోయారు. తినే అన్నంలో కూడా ధూళి పడుతుంది.రోజు కేజీల కొద్ది దుమ్ము ఎత్తి బయట పోస్తూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల పనులు పూర్తి చేస్తామని సంబంధిత ఉన్నత అధికారులు హామీ ఇస్తేనే కానీ, ఆందోళన విరమించేది లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో ఎస్ఐ అఖిల ఆర్ అండ్ బి డీఈఈ తో ఫోన్లో మాట్లాడారు.వారం రోజుల్లో రోడ్లపై తారు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు.తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నామని, హామీ నెరవేర్చని పక్షంలో తిరిగి ఆందోళనకు దిగుతామని స్థానికులు తెలిపారు.



