భారీ మెజార్టీతో గెలవాలి
అందుకుగట్టి ప్రయత్నం చేయాలి : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్‌కు భారీ మెజారిటీ వచ్చేలా ప్రయత్నం చేయాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్టపాలన పట్ల మరింత అవగాహన కల్పించాలని సూచించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని వివరించారు. ఇక జూబ్లీహిల్స్‌లో తన అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీషీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో, బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపు లక్ష్యంగా, పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన, ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోటీలో ఉన్న అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ సహా, ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎమ్మెల్సీ మహమూద్‌అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల, క్లస్టర్ల ఇంచార్జులు పాల్గొన్నారు. వారిలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మెన్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నేతలు, స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.
ఈ సమావేశం సందర్భంగా పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇప్పటిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేతకు ఇన్‌చార్జీలు రిపోర్ట్ చేశారు. పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణ కు సంబంధించి, అధినేత కేసీఆర్ సమావేశంలో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు వివరించారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనాకాలంలో అమలు చేసిన అభివద్ధికార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత కేసీఆర్ సూచించారు.