ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా కథానాయిక సమంత రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ నెల9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రీమి యర్స్ నుంచే అద్భుతమైన స్పందన లభించింది. తొలిరోజున సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజున రూ. 1.5 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సినిమా రాబట్టింది. రెండో రోజు నుంచి ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ మంచి కలెక్షన్లని సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, ‘చిత్ర నిర్మాణం వైపు ఇంత ధైర్యంగా ఎలా వచ్చేశానా? అని ఇటీవల అనుకున్నా. నిర్మాతలు ఎందుకు వరసగా సినిమాలు చేస్తారో నాకు ఇప్పుడర్థమైంది. ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వులు చూడటమే అందుకు కారణం. విద్యార్థి దశలోని సమ్మర్ హాలీడేస్ నాకు గుర్తొచ్చాయి. మా కోసం మా అమ్మ ఎంత కష్టపడిందో ఇప్పుడు తెలిసొచ్చింది. పిల్లలు నిరుత్సాహపడకూడదు. సినిమాకి తీసుకెళ్ళాలని పరితపించేది. మేం థియేటర్‌లో సినిమా చూడటం, పాప్‌కార్న్ కోసం అన్నయ్యతో గొడవ పడటం, చూసిన సినిమా గురించి చర్చించుకోవడం.. ఇవన్నీ నిన్న జరిగినట్టుగా ఉంది. నాటి జ్ఞాపకాలను ఫ్యామిలీ ప్రేక్షకుల కోసం రీ క్రియేట్ చేయాలనిపించింది. ఆ లక్ష్యంతోనే ట్రాలాలా సంస్థని నెలకొల్పా. మేమెంత కష్టపడినా ప్రేక్షకులకు సినిమా నచ్చితేనే విజయం అందుకుంటుంది. ఈ సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మా సినిమాకి తొలి రోజు నుంచే అత్యద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న నాకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బాగా సపోర్ట్ చేసింది. సురేష్‌బాబు కుటుంబ సభ్యుడిలాంటివారు. ఈ సినిమా గురించి ఏమీ అడగకుండానే చేసేద్దాం అని భరోసా ఇచ్చారు. అందరి సహకారంతో ప్రేక్షకుల ఆదరణతో నిర్మాతగా నా తొలిఅడుగుకి మంచి శుభారంభానివ్వడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.