అమెరికాలో కొనసాగుతున్న ప్రతిష్టంభన
భారీగా లేఆఫ్‌లు తప్పవు : ట్రంప్ బెదిరింపు
వాషింగ్టన్ : అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 1న ప్రారంభమైన షట్‌డౌన్ మంగళవారం ఆరో రోజుకు చేరింది. వ్యయ బిల్లుపై అధికార రిపబ్లికన్, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చలు ఫలించేలా లేవు. లేఆఫ్‌లు కొనసాగుతున్నాయని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ ‘ఇప్పటికే ఆ పని జరుగుతోంది.
డెమొక్రాట్లే దీనికి కారణం’ అని ఆరోపించారు. దేశంలో అనేక ఉద్యోగాలు పోవ డానికి వారే కారకులని నిందించారు. ఏయే సంస్థలలో ఉద్యో గాలలో కోత పెడ తారని అడిగిన ప్రశ్న కు సమాధానం ఇచ్చేందుకు ట్రంప్ నిరాకరించారు.
ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి
ప్రతిష్టంభన తొలగించేందుకు శాసనకర్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో లేఆఫ్‌లు జరిగితే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యయ బిల్లుపై తమ వాదనే నెగ్గాలని అటు రిపబ్లికన్లు, ఇటు డెమొక్రాట్లు పట్టు పడుతుండడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికాలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో పులి మీద పుట్రలా షట్‌డౌన్ జరిగింది. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు వ్యాపారాలను దెబ్బతీశాయి. ఉద్యోగాల కల్పన తగ్గిపోయింది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆయన నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోంది. రెండు ట్రిలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్ లోటును భరించడం కష్టంగా మారింది.
అధ్యక్ష భవనం బెదిరింపులు
చర్చలు విఫలమయ్యాయని ట్రంప్ భావిస్తే ప్రభుత్వ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించడం మొదలవుతుందని అధ్యక్ష భవనం హెచ్చరించింది. రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు డెమొక్రాట్లకు ఇంకా అవకాశం ఉన్నదని అధ్యక్ష భవనం జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ సీఎన్‌ఎన్ కార్యక్రమంలో చెప్పారు. ఇదిలా వుండగా ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ ట్రంప్ ఆదివారం వర్జీనియాలోని నార్ఫోక్‌లో అమెరికా నౌకాదళ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
‘ఆట కొనసాగాలని నేను భావిస్తున్నాను’ అని ట్రూత్ సోషల్‌లో ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనా ప్రతిష్టంభనను తొలగించడానికి అర్థవంతమైన చర్చలేవీ జరగడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న అరకొర చర్చలు ఫలప్రదమయ్యే సూచనలు కూడా కన్పించడం లేదు. షట్‌డౌన్ కారణంగా ఏడున్నర లక్షల మంది ప్రభుత్వోద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. షట్‌డౌన్ కొనసాగినంత కాలం ఉద్యోగులకు ప్రభుత్వం రోజుకు 400 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.