డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామ చెరువు రోజు రోజుకి ఆక్రమణ, చెరువు సర్వే గూర్చి గ్రామస్తులు ప్రజావాణిలో డిప్యూటీ తాసిల్దార్ హేమలత కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్థుడు లక్ష్మీకాంత్ పటేల్ మాట్లాడుతూ .. సిద్ధాపూర్ గ్రామంలో గల చెరువు రోజు రోజుకి ఆక్రమణకు గురవుతోందని అన్నారు. ఈ చెరువు తాతల కాలం నుంచి అందరికీ ఎంతగానో ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం ఈ చెరువుకి పడమర, ఉత్తరం దక్షిణం, భాగాలలో కొంతమంది చెరువును ఆక్రమించి పంటలు పండిస్తున్నారని అన్నారు.
దీనివలన చెరువులో నీటి నిల్వ ఆవిరైపోతోందని ఆవేదన చెందారు. ఈ చెరువును సర్వే చేయించి మా గ్రామం యొక్క చెరువు హద్దులు పెట్టించగలరని కోరుతున్నామని అన్నారు. ఈ సర్వేతో చెరువు కబ్జాకు గురి కాకుడా చూడాలని అన్నారు. “చెరువు రక్షణ ప్రతి ఒక్కరి లక్ష్యం” అని చెప్పారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనియెడల కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.



