ఎన్ని ఆంక్షలు పెడితే అన్నిసార్లు వస్తా
తల్లీబిడ్డను ఎడబాపారు..
చంద్రుడు లాంటి కేసీఆర్‌కు మచ్చ తెచ్చారు
చింతమడక ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్తున్న..
కన్న ఊరు భవిష్యత్తులో కర్మ భూమి కావొచ్చు : చింతమడక బతుకమ్మ సంబురాల్లో కవిత ఘాటు వ్యాఖ్యలు
కుటుంబంలో చిచ్చు పెట్టిన వారిని వదిలిపెట్టనంటూ హెచ్చరికలు
భావోద్వేగంతో కంటతడి..
నవతెలంగాణ- సిద్దిపేటరూరల్
‘సిద్దిపేట, చింతమడక ఎవరి జాగీరు కాదు.. ఎన్ని ఆంక్షలు పెడితే అన్నిసార్లు వస్తా.. తాటతీస్తా..’ అంటూ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ‘తల్లీబిడ్డను ఎడబాపారు.. చంద్రుడు లాంటి కేసీఆర్‌కు మచ్చ తెచ్చారు’ అంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. సిద్దిపేట రూరల్ మండలంలోని మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాల్లో ఆదివారం ఆమె పాల్గొన్నారు. ముందుగా రాఘవ పూర్ వద్ద గ్రామస్తులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అలాగే అక్కడ గ్రామ మహిళలతో కొద్దిసేపు బతకమ్మ ఆడారు. లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామం చింతమడకకు చేరుకున్నారు. ఈ క్రమంలో డప్పుచప్పులతో ఆమెకు మహిళలు స్వాగతం పలకగా.. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఇంట్లో బతుకమ్మను పేర్చి రామాలయం ముందు ఉన్న గ్రౌండ్‌లో బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 2005కు ముందు తాను ఎన్నోసార్లు గ్రామానికి వచ్చి వెళ్లే దాన్నని, ఆ తర్వాత ఉద్యమంలో బిజీగా మారి ఇక్కడికి రాలేకపోయానని అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సిద్దిపేటకు రావాలన్నా, చింతమడకకు రావాలన్న ఎన్నో ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. ఇదే చింతమడక గడ్డలో పుట్టిన కేసీఆర్.. ఇక్కడి ప్రజల అండదండలతో, వారిచ్చిన ఆత్మస్థైర్యంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు సుపరిపాలనను అందించారని అన్నారు. ఆయన చాటున కొందరు అక్రమాలకు పాల్పడి చంద్రుడు లాంటి తన తండ్రికి మచ్చ తీసుకువచ్చారని తెలిపారు. ఆ విషయాన్ని తాను బయటపెట్టినందుకు కుటుంబంలో గొడవలు పెట్టి తల్లిని పిల్లను ఎడబాపారని ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా వారి భరతం పడతానంటూ హెచ్చరించారు. తాను సిద్దిపేటకు, చింతమడకకు రాకుండా ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని.. ఆంక్షలు పెడితే ఒక్కసారి కాదు వందసార్లు వచ్చి తన సత్తా చూపిస్తానని తెలిపారు. తనకు చింతమడక జన్మ భూమి అని, రానున్న రోజులు కర్మ భూమి కావచ్చన్నారు. దుఖంలో ఉన్న తనకు చింతమడక ప్రజలు ప్రేమను పంచారనీ, భవిష్యత్తులో అండగా నిలవాలని చెబుతూ కంటతడి పెట్టారు.