ఇవ్వాళ్ళ మనం పరిచయం చేసుకుంటున్న ఈ బాల సాహితీవేత్త కూడా సిద్ధిపేటకు చెందినవారే! గతంలో చెప్పుకున్న బాల సాహితీవేత్తల్లో సిద్ధిపేటకు చెందినవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక రకంగా చూస్తే రాశిలోనూ, వాసిలోనూ సిద్ధిపేట బాల సాహితీవేత్తలది తెలంగాణ బాల సాహిత్య చరిత్రలో నిక్కచ్చిగా ఎన్నికగన్న స్థానమే! ఈ కోవలోనే మరో బాల సాహితీవేత్త… పెద్దలు చీకోటి రాములు కూడా. వృత్తిరీత్యా వివిధ వ్యాపార సంస్థల్లో గుమాస్తాగా, సేల్స్‌మెన్‌గా ఉంటూనే తనలోని ఆసక్తిని, రచనను కొనసాగిస్తున్నారు చీకోటి రాములు. వీరు ఉమ్మడి మెదక్ జిల్లా ఒర్కోలు సమీపంలోని వెంకటాపురంలో జనవరి 6, 1950 న పుట్టారు. శ్రీమతి చీకోటి సత్యవ్వ – శ్రీ చీకోటి ఈశ్వరయ్య వీరి అమ్మానాన్నలు.
‘జ్ఞానుల వద్దను మౌనము
పెద్దల వద్దను మౌనము
మదిదెలిసి మాట్లాడవలె
శ్రీచీకోటి శ్రీరామ’ అంటూ తాను రాసిన మణిపూసల శతకములో చెప్పిన వీరు చిన్నప్పుడే వీరు తల్లిని కోల్పోగా అన్నీ తానై తండ్రి ఈశ్వరయ్య వీరిని పెంచి పెద్దచేశారు. ప్రాథమిక, మాధ్యమిక విద్య తన స్వగ్రామంతో పాటు ఇర్కోడు, తోర్నాలలో, హెచ్.ఎస్.ఎల్.సి. సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూల్‌లో చదివారు. ఇంటర్మీడియట్‌ను 1969 అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమకాలంలో పూర్తిచేశారు. తొలుత చిన్నపాటి వ్యాపారాలు నిర్వహించిన రాములు తరువాత వివిధ సంస్థల్లో గుమాస్తాగా పనికి కుదిరి నేటికీ అదేవృత్తిగా జీవిస్తున్నారు. ప్రస్తుతం సిద్ధిపేటలో నివాసముంటున్న వీరు గేయం, పద్యం, వచనకవిత్వం రాస్తున్నారు. బాలల కోసం రాయడమంటే మరింత ఇష్టం ఈ కవికి. వీరి ‘రాగమాల’ గేయ సంపుటి బాలల కోసం రాసిన బాల గీతాల మాలిక.
గతంలో వీరి తొలి పుస్తకం ‘మనిషి’ 2017లో అచ్చయ్యింది. ఇది గద్యపద్యాత్మకమైన చంపూ కావ్యం. తరువాత కథాశిల్పి ఐతా చంద్రయ్య సహవాసం, మార్గదర్శకత్వంలో మరిన్ని గ్రంథాలను రాశారు రాములు. వాటిలో ‘రాగమాల’, ‘చీకోటి శతకము’ వంటివి అచ్చయ్యాయి. సిద్ధిపేటలో జరిగే అన్ని సాహిత్య సాంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొనే వీరు ‘ప్రపంచ తెలగు మహాసభల సన్మాహక కారక్రమాల సత్కారం’, ‘జాతీయ సాహిత్య పరిషత్తు సత్కారం, తెలంగాణ సాహిత్య కళాపీఠం సత్కారం, ఉదయ కళానిధి ధార్మిక సేవా సత్కారం, మల్లీనాథ సూరి కళా పీఠం సత్కారం, వర్ణన తెలంగాణ సాహిత్య అకాడమి సత్కారం, గిడుగు రాంమూర్తి ఫౌండేషన్ పురస్కారం, బాల చెలిమి పిల్లల పత్రిక సత్కారం, సిద్ధిపేట శ్రీవాణీ సాహిత్య పరిషత్ సత్కారాలు, గౌరవాలు అందుకున్నారు.
పద్యాన్ని, గేయాన్ని, మణిపూసలను రాసిన వీరు బాలల కోసం అనేక బాల గేయాలు రాశారు. పిల్లల కోసం వీరు రాసిన కొత్త పుస్తకం ‘అక్షర భారతి’. ఇది రాములు బాలలకు అందిస్తున్న కొత్తకానుక. ఇందులో తాను కొలిచే ఆది దైవము గణపతి నుండి తనకు తారపడిన ప్రతిదానిని గేయంగా మలిచారు. ‘నెమలి ఈక’ చిన్నదే కావచ్చు కాక! కాని బడి పిల్లల జ్ఞాపకాల సందుగులో దీనిని మించిన యాది… గొప్పవస్తువు మరొకటి ఉండకపోవచ్చు. కవి రాములు ‘బాలల చేతిని బంగారు ఈక/ పుస్తకాలలో పొదిగిన ఈక/ ఫకీరు చేతిన పావనమీక/ విసనగర్రై వీసు ఈ ఈక’ అంటూ నెమలీకను కవిత్వం చేశారు. ఇంకోచోట ‘ఐకమత్యమే బలము/ అందరు గూడిన గలుగు/ ఒకేమాటపై నుండుము/ ఒక బాటపై నడువుము/ .. గడ్డిపోచ లొక్కటైన/ గజరాజె బంధీయగును/ చీమల బారి చేరగ పాపమై పట్టు దప్పును’ అని వ్రాస్తారు కవి చీకోటి. ‘బాలలు భావికి దీపాలు/ భారతమాతకు రూపాలు/ దేశవిదేవ వెలుగ దివ్వెలు/ మీరె కద సమాజ దివిటీలు/ చదువనేది ముఖ్యం మీకు/ అదియే సంస్కారమై వెలుగు/ నిరతము సేవా భావము/ అంతిమ ధ్యేయం మీకు’ అంటూ బాలలకు చక్కని హితవు చెప్పిన కవి రాములు ‘వృధాజేయకు సమయంబు’ అంటూ హెచ్చరిస్తారు కూడా!
తన గేయాల్లో పిల్లలకు హితవును, నీతిని చెబుతూనే లోక రీతిని, వివిధ అంశాలను పరిచయం చేశారు రాములు. ఒక దగ్గర ఉగాదిని వర్ణిస్తూ ‘వసంతమాడెను వనమంత/ నవజాత చిగుళ్ళు నాట్యమాడ’ అంటూ గేయం రాస్తే, మరోచోట సంక్రాంతికి పిల్లలకు ఇష్టమైన పతంగుల పండుగను గురించి అందంగా చెబుతారిలా – ‘బారులు దీరిన బాలలు/ ఎందరెందరో పిల్లలు/ అందరి చేతికి దారము/ అదే పతంగి కాదారము’. భారత చరణహారతిగా తన అక్షర గీతికలను అందించిన కవి చీకోటి రాములు ‘జయీభవ జననీ భారతి’ అంటూ మాతృభారతికి తన గేయాలతో హారతిని అందిస్తాడీ కవి. మన బాలల కోసం చక్కని గీతాలను ‘అక్షర భారతి’గా అందించిన సిద్ధిపేట కవి, పెద్దలు చీకోటి రాములుకు అభినందన ‘కోటి’. జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్
9966229548
బాలల పద్యగేయ రచనలో మేటి సిద్ధిపేట ‘చీకోటి’
- Advertisement -
- Advertisement -