Friday, November 7, 2025
E-PAPER
Homeఖమ్మంబీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసం ముట్టడి

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసం ముట్టడి

- Advertisement -

నియోజకవర్గ అభివృద్ధి వేగవంతం చేయాలని డిమాండ్
మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు దారుణ స్థితిలో ఉన్నాయని, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పిలుపు మేరకు జరిగిన ఈ ముట్టడిలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ  డీఎంఎఫ్, సీఎస్ఆర్ నిధుల వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఏర్పాటైన రహదారులు తప్ప, ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క కొత్త రహదారి కూడా నిర్మించి లేదని ఆయన విమర్శించారు. గుంతలు తో నిండిన రహదారులు ప్రమాదాలకు కేంద్రంగా మారినప్పటికీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విచారకరమన్నారు.

అశ్వారావుపేట పట్టణంలో రూ.23 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులు మంజూరైనా, రెండేళ్లు దాటినా పూర్తి కానందున స్థానిక ప్రజలు రోజువారీగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారిపై రాళ్లు ఎగిరి వాహనాల అద్దాలు పగిలే స్థితి ఏర్పడినా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి కొరత, వీధి దీపాలు వెలగకపోవడం, చెత్త సేకరణ సరిగా లేకపోవడం వంటి సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్నాయని తెలిపారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార నాయకులు అక్కడ ప్రచారంలో మునిగిపోయి, తమను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేయడం బాధాకరమన్నారు. మణుగూరులో పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, మండలాధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అయితే…
గతంలో కాంగ్రెస్ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు అనంతరం టీఆర్ఎస్‌ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ శ్రేణులు ఇదే నివాసాన్ని ముట్టడించిన పరిస్థితులు చోటు చేసుకోగా, నేడు మెచ్చా ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముట్టడి సాగడం ప్రచారంలో చర్చనీయాంశంగా మారింది.సీఐ నాగరాజు రెడ్డి పర్యవేక్షణలో అశ్వారావుపేట,దమ్మపేట ఎస్.హెచ్.ఓ లు ఎస్సై లు యయాతి రాజు,సాయి కిశోర్ రెడ్డి,అఖిల బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -