అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూశ్ గోయల్ వెల్లడి
న్యూఢిల్లీ : భారత్-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరిగే అవకాశం వుందని, ఏప్రిల్‌లో అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ శుక్రవారం తెలిపారు. అలాగే బ్రిటన్, ఒమన్‌లతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా ఏప్రిల్‌లోనే అమ లయ్యే అవకాశం వుంది. కాగా న్యూజీలాండ్‌తో కుదుర్చుకునే ఒప్పందం సెప్టెంబరు నుండి అమల్లోకి రావచ్చని గోయల్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయాలని యురోపియన్ యూనియన్ కూడా కోరుకుంటోందని చెప్పారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రస్తావ నాంశాలను భారత్, కెనడాలు ఖరారు చేస్తున్నాయని తెలిపారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను ఖరారు చేయడానికి వచ్చే వారం వాషింగ్టన్‌లో ఇరు దేశాల ముఖ్య ప్రతినిధులు భేటీ అవుతారు. మూడు రోజులు పాటు ఈ సమావేశాలు జరుగుతాయి.
ఒప్పందంపై సంతకాలు చేసేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ మార్చిలో భారత్‌కు వచ్చే అవకాశం వుందని గోయల్ తెలిపారు. టారిఫ్‌లను 18శాతానికి తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులు ఈ నెల్లో జారీ అవుతాయని భావిస్తున్నట్టు గోయల్ చెప్పారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంతో భారత ఎగుమతిదారులకు అపార వాణిజ్య అవకాశాలు వస్తాయని గోయల్ చెప్పారు. రూ.25,060కోట్ల విలువైన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం)కు చెందిన ఏడు విడిభాగాలను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. వ్యవ సాయంతో సహా కీలకమైన సున్నిత రంగాలకు ప్రభుత్వం రక్షణ కల్పించిందన్నారు. వాస్తవానికి చాలా దూరమైన ప్రపంచంలో రాహుల్ జీవిస్తున్నారంటూ గోయల్ విమర్శించారు. ఇక్కడున్న వారందరూ ఎగుమతిదారులే, 50శాతం టారిఫ్‌లతో మీరు సంతోషంగా వుంటారా? అని ఎదురు ప్రశ్నించారు. మన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయా? ఉద్యోగాలు సురక్షితంగా వుంటాయా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.
ఎందుకు అంగీకరించారు: రాహుల్
అమెరికాకు చాలా ఇస్తూ, భారత్ వెనక్కి పొందేది మాత్రం అత్యంత తక్కువగా కనిపిస్తున్న ఈ వాణిజ్య ఒప్పందంపై భారత్ ఎందుకు సంతకం చేసిందో ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రశ్నించారు. ప్రధానిపై వచ్చిన ఒత్తిడికి ఆయన ఉక్కిరి బిక్కిరై లొంగిపోయారని విమర్శించారు. ప్రతికూల స్పందనకు ఎలాంటి హామీ లేకుండానే ఏడాది కాలంలో వంద బిలియన్ల వరకు అమెరికా దిగుమతులను ఎందుకు పెంచడానికి అంగీకరించిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.



