సాధువులు, సంత్‌లు, రాజ్యాధికారం కోసం కిందామీదా, పడుతున్నారంటే, మనం సామాన్య పౌరులుగా ఏమి అర్థం చేసుకోవాలీ?-”శక్తి అనేది భగవంతుడిలో లేదు. అధికారంలో ఉంది! పదవిలో ఉంది!!”-అని. కేంద్రంలో అధికారంలో ఉన్న మన దేశ నాయకుల ఆలోచనా విధానం ఎలా ఉంది? గణితం, సైన్సు వంటి విషయాల పట్ల వారికున్న పరిజ్ఞానం ఎంత అనేది బేరీజు వేసుకుందాం! వీరు వేదాల్లో విమానాల ప్రసక్తి ఉందంటారు. గ్రహణాల్లో విశ్వ రహస్యాలు న్నాయంటారు. కురుక్షేత్రంలో అణ్వాయుధాలు న్నాయంటారు. అవతారాల్లో జీవ పరిణామముందంటారు. భారతంలో టెస్ట్‌ట్యూబ్ బేబీలున్నారనీ, రామాయణంలో ఆర్కిటెక్చర్, నాగ సాధువుల్లో నానో టెక్నాలజీ, వినాయకుడి తలలో ప్లాస్టిక్ సర్జరీ..అన్నింటికన్నా భగవద్గీతలో శాంతి సూత్రాలున్నాయనీ నమ్మబలుకుతున్నారు. నమ్ముదామా, లేక- ‘మీ మాటలన్నీ బూటకంరా బాబూ! మేం నిజాలు గ్రహిం చాం-ఇక మీరు మీనోర్లు మూసుకోండి’-అని అందామా?
మహాకుంభమేళాకు అరవై ఏడు కోట్లమంది వచ్చి పుణ్యస్నానాలు చేశారని మనదేశ నాయకులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నాయకులు కలిసికట్టుగా డప్పుకొట్టి ప్రచారం చేసుకున్నారు. అదెలాగా? అని అడిగితే మనలాంటి సామాన్యులకు వారు సమా ధానం చెప్పరు. మనం అల్పులం కదా? వారి గణిత స్థాయిని మనం అందుకోలేమని వారు అనుకొని ఉండొచ్చు. అందుకే కొన్ని సంస్థలు, కొందరు స్వతంత్ర జర్నలిస్టులు లెక్కలు వేశారు. ఏలిన వారి గణిత పరిజ్ఞానం ఇదీ-అని ప్రజల ముందు పెట్టారు. దేశ జనాభా 140కోట్లు. ఇందులో 67కోట్లుఅంటే, సుమారు సగం జనాభా కుంభమేళా స్నానాలు చేశారని కదా చెప్పుకుంటున్నారు. దేశంలో పసిపాపలు, పదేండ్లలోపు పిల్లల జనాభా 25కోట్లు. సుమారు 15కోట్ల మంది వయోవృద్ధులు, వికలాంగులు- ముస్లింలు-క్రైస్తవులు ఇంకా ఇతర మతస్థులు 20కోట్ల మంది ఉన్నారు. వీరెవరూ కుంభమేళా స్నానాలకు రాలేదు. రానివారి లెక్క చూస్తే, అది సుమారు 55కోట్ల మంది అవుతున్నారు. వీరుగాక, అలాంటి సనాతన సంప్రదాయం పట్ల అభిరుచి లేని వారు విముఖత చూపేవారు మరి, కోట్లమందే ఉంటారు. వీరందరిని తీసేస్తే స్నానాలు చేసిన వారి సంఖ్య 67 కోట్లు ఎలా వస్తుంది. వచ్చారని అనడానికి ఆధారమే లేదు. ఇలాకాకుండా, మరో రకంగా కూడా ఒక సంస్థ వారు సర్వే నిర్వహించారు. బస్సులు, రైళ్లు, విమానాలు, కార్లు వంటి వాటిపై అక్కడికి చేరుకున్న వారి సంఖ్య లెక్కకట్టారు. ఏ వాహనంలో ఎంతమంది ప్రయాణిం చగలరో మనకు తెలుసు గనుక, రోజుకు అవి ఎన్ని ట్రిప్‌లు వేయగలవో తెలుసు గనక ఒకరోజులో ప్రయాగ్‌కు ఎంతమంది చేరుకోగలరో తెలిసిపోతుంది. ఆ రకంగా మన పాలకులు చెప్పే 67కోట్ల జనం అబద్దం అని తేలింది.
కుంభమేళాలో తొక్కిసలాట జరిగి కొందరు మరణిస్తే, అక్కడి టెంట్‌లు తగలబడి కొందరు, రోడ్డు ప్రమాదాల్లో కొందరు, రైల్వేస్టేషన్‌లలో తొక్కిసలాట జరిగి కొందరు మరణిస్తే, రాష్ట్ర, దేశ నాయకులెవరూ సంతాపం తెలుపలేదు. తమ అసమర్థతను ఒప్పుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది-చెప్పలేదు. మృతుల కుటుంబాలను ఏ రకంగానూ ఆదుకోలేదు. పైగా-కుంభమేలా మృతులకు ”భగవంతుడు లభించాడని’ -యూపీ ముఖ్యమంత్రి ప్రకటించాడు. ఆ యోగి కూడా అదేవిధంగా భగ వంతుడిలో ఐక్యం కావడానికి ప్రయత్నించవచ్చు కదా? రోగాల బారినపడ్డ వాళ్లూ, కాళ్లూ, చేతులూ విరిగినవారు ఎందరో అస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. యోగి చెప్పిన విధంగా వారికి భగవంతుడు ప్రాప్తించడం లేదు.ఇక్కడ సామాన్య జీవితమూ దొరకడం లేదు. ఇక యోగి, మోడీలు కూడా దేశ ప్రజల్ని నమ్మించడానికి చుట్టూ తాళ్లు కట్టుకుని, బాడీగార్డులను పెట్టుకుని కుంభమేళా స్నానం చేశామనిపించారు. వారికి బాడీగార్డుల మీద ఉన్న విశ్వాసం దేవుడి మీద లేదన్నది ఈ దేశ ప్రజలకు అర్థమైంది. ఆ సందర్భంలోనే ఒక సంఘటన జరిగింది. ఒక బీజేపీ అంధభక్తుడు మురికి గంగలో పలుమార్లు మునిగి తేలడం వల్ల, పవిత్రజలాలనుకుని వాటిని మింగడం వల్ల- తీవ్రంగా బబ్బుపడ్డాడు. అతనికి గత ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే చిర్రెత్తుకొస్తుంది. అందువల్ల తమ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టించిన ఆసుపత్రిలోనే తనను చేర్పించాలని పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులూ, మిత్రులూ కలిసి ఆసుపత్రుల చరిత్ర తవ్వుతూ తిరిగారు. వారి పట్టణంలో కాదుగదా, దేశమంతా దుర్భిణివేసి వెతికినా అలాంటిది ఏదీలేదని, తెలిసేసరికి పేషెంట్‌కు ప్రాణం మీదికి వచ్చింది. విధిలేక అందుబాటులో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్పించారు.
ఈ ప్రపంచమే నిద్రలో జోగుతున్న మనుషుల గుంపు! నిద్రలో ఉన్నవారు మెలకువగా ఉన్నవారిని భరించలేరు. విశ్వాసకులు అవిశ్వాసకుల్ని భరించలేనట్టుగా మెలకువగా ఉన్నవారు ఏవేవో శబ్దాలు చేస్తున్నారని, తమను నిద్రపోనివ్వడం లేదని నిద్రలో జోగే జనం, మనోభావాలు దెబ్బతీసుకుంటారు. BLIND BELIFE IN AUTHORITY IS THE GREATEST ENEMY OF TRUTH అని అన్నాడు మహాశాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.ఉత్తరప్రదేశ్‌లోని ఒక జైలులో జైలు అధికారులు మహాకుంభమేళా త్రివేణి సంగమం నుండి కొన్ని నీళ్లు తెప్పించారు. జైలులో ఉన్న ఒక ట్యాంకులో కలిపారు. జైలులో ఉన్న ఖైదీలందరికీ ఆ ట్యాంక్ నీళ్లతో స్నానం చేసే అవకాశం కలిగించారు. వారి పాపాలు తొలగిపోతాయన్నది వారి విశ్వాసం. అదే నిజమైతే, పాపాలు తొలిగిన ఖైదీలు కొందరైనా విడుదల కావాలి కదా? బీఫ్ కంపెనీల నుండి బలవంతంగా చందాలు వసూలు చేసుకునేవారు వరుసగా మహాకుంభ మేళాకు క్యూకట్టారట! బీఫ్ కంపెనీ యజమానులంతా బీజేపీ వారే గనుక, వారెలగూ, ముందే వెళ్లి మునిగి ఉంటారు. వీరందరి పాపాలు పోవాలి కదా! ముస్లింల పేర్లతో బీఫ్ ఎగుమతులు చేసే బీజేపీ వారు పవిత్రులయి పోయినట్టేనా? వారు మళ్లీ కొత్త పాపాలు చేసుకోవచ్చా?
కుంభమేళా పేరుతో చాలా గమ్మత్తులు జరిగాయి. అందులో ఒకటి ఇలా జరిగింది. కుంభమేళాకు వెళ్లలేని వారు వారి ఫొటోలు పంపితే ఆ ఫొటోలను త్రివేణి సంగమంలో ముంచి, మంత్రోచ్ఛారణతో మంగళస్నానం చేయిస్తాం.దీనివల్ల కుంభమేళా స్నాన ఫలితం ఆఫొటోలో ఉన్న వారికి సంపూర్ణంగా లభిస్తుంది. ఈ అవకాశం ఉపయోగించుకో దలచిన వారు ఈకింది ఫోన్ నెంబర్‌కు రూ.500 ఫోన్ పేగాని, గూగుల్ పేగాని చేయవచ్చు అని ఒక సంస్థ ప్రకటించింది. ఇకనేం మనదేశంలో అంధవిశ్వాసులకేం తక్కువ? వేలమంది ఎగబడ్డారు. వాడెవడో తెలివిగా కూచున్నచోట డబ్బు సంపాదిం చుకున్నాడు. వచ్చిన ఫొటోలు ఏరోజుకారోజు కాల్చేశాడు. విషయం బయటికి రాకుండా జాగ్రత్తపడ్డాడు. అయినా ఆ సంస్థ చేసిన మోసం పత్రికలెక్కింది. ”పావన్ గంగాకి జల్ పవిత్ర్ హై స్వఛ్‌హై”-అని యూపీ ముఖ్యమంత్రి గొప్పగా మాట్లాడితే సుప్రీంకోరు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ”మిస్టర్ యోగీ! ఆ నీటిని తాగి చూపించు”-అని సవాల్ విసిరాడు. యోగి నోరు మెదపలేదు. రోషానికి పోయి ఆ నీళ్లు తాగి చూపించినా బాగుండును. ఆయనే గతంలో చెప్పినట్టు ఆయనకు కూడా భగవంతుడు లభించేవాడు.
మోసపోవడానికి రెండు మార్గాలున్నాయి 1.సత్యం కాని దాన్ని నమ్మడం 2.సత్యాన్ని నమ్మడానికి ఇష్టపడక, తిరస్కరించడం
– సోరెన్ ఆబీకీర్కెగార్డ్, డానిష్ తత్త్వవేత్త, రచయిత.
జీవశాస్త్రం మీద, వైద్యశాస్త్రం మీద మంచి ”పట్టు” సాధించిన సంప్రదాయ సనాతన వాది కృష్ణ స్వరూప్‌దాస్ జీ తన ప్రవచనంలో భక్తులకు ఇలా చెప్పాడు. ”నెలసరిలో భర్తలకు వంటచేసి పెట్టే భార్యలు కుక్కలుగా పుడతారు”- గుజరాత్‌లోని భుజ్‌లో స్వామి నారాయణ్ మందిర్‌లో ఈ ”వైజ్ఞానిక” అంశాన్ని సెలవిచ్చారు. దీన్ని మనం నమ్మాలి అని వారి భావన! అలాగే కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సత్య పాల్‌సింగ్ మరొక అంశాన్ని వెలుగులోకి తెచ్చాడు. ”వానరం నరుడిగా మారడాన్ని మనం చూడలేదు. మన పూర్వీకులు కూడా చూడలేదు. అసలు ఇంత వరకు ఎవరూ చూడలేదు. అందువల్ల జీవ పరిణామ సిద్ధాంతం తప్పు-దీన్ని మన విద్యాసంస్థల సిలబస్‌ల నుండి తీసివేయాలి!” అని అన్నాడు. దీన్ని అలా ఉంచి, వారు నమ్మే సృష్టి సిద్ధాంతాన్నే పరిశీలిద్దాం. మరి దేవుడిని ఎవడు చూశాడూ? దేవుడు మనుషులను యధా తథంగా సృష్టిస్తున్నప్పుడు ఎవడు చూశాడు? సత్యపాల్‌సింగ్ కానీ, అతని పూర్వీకులు గానీ, వారివారి పూర్వీకులుగానీ చూశారా? ఆయన మనల్ని అడిగిన లాజిక్‌నే ఉపయోగించి మనం ఆయన్ని అడుగుతున్నాం కదా?
కమలం గుర్తు ఈదేశంలో ఒక తాయత్తులాంటిది. అది దగ్గరుంచుకుంటే-ఈడి, ఐటి లాంటివేవీ పట్టి పీడించవు అని అన్నాడొక యువసైన్సు కార్యకర్త వ్యంగ్యంగా-నిజమే కదా మనం చూస్తున్నది!
వ్యాసకర్త: త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలిగ్రహీత
డాక్టర్ దేవరాజు మహారాజు
దేశ నాయకుల సైన్సు, గణిత పరిజ్ఞానం అమోఘం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES