2025లో ఒకటిన్నర రెట్ల పెరుగుదల
ఏడాదిలో 10 గ్రాముల ధర రూ.2,200కు చేరిక
న్యూఢిల్లీ : బంగారంతో పాటు వెండి ధరలు జిగేల్‌మంటున్నాయి. కేవల ఒక్క ఏడాదిలోనే వెండి ధర ఒక్కటిన్నర రెట్లు పైగా ఎగిసింది. ఒక్క 2025లో కిలో వెండి విలువ రూ.1.37 లక్షలు పెరిగి రూ.2.27 లక్షలకు చేరింది. దీంతో 10 గ్రాముల ధర దాదాపు రూ.2,270గా పలుకుతోంది. శుక్రవారం సెషన్‌లో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.9,750 ఎగబాకి రూ.2,27,000కి చేరింది. ఇది మరో నూతన చారిత్రక గరిష్ఠ స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 72 డాలర్లు పలకడంతో భారత్‌లోనూ ఎగిసిపడుతోన్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి రికార్డ్ స్థాయిలో 72 డాలర్లకు చేరుకోవడం వల్లనే దేశీయంగా ప్రియమవుతోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెండి ఏకంగా రూ.1,37,300 లేదా 153 శాతం ఎగబాకింది. గతేడాది డిసెంబర్ 31న రూ.89,700గా ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ.2 లక్షలు దాటి.. రూ.2.3 లక్షల దిశగా పరుగులు పెడుతోంది.
ఏడాది 10 గ్రాముల ధర
2010 272
2015 360
2020 675
2022 625
2023 740
2024 900
2025 2270
డాలర్ బలహీనంగా ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లడం, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఆందోళన పరిస్థితులు కొనసాగుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు పెరుగుతున్నాయని సౌమిల్ గాంధీ వెల్లడించారు. గత నాలుగు రోజుల్లో ఔన్స్ వెండి 5.56 డాలర్లు లేదా 8.3 శాతం ఎగబాకింది. దీంతో ధర 67.14 డాలర్ల నుంచి 72 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు వెండి 43.73 డాలర్లు లేదా 151 శాతం పెరిగింది. బుధవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.50 తగ్గి రూ.1,40,800గా నమోదయ్యింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర తొలిసారిగా 4,500 డాలర్లు పలికింది. గత నాలుగు రోజుల్లో పసిడి 186.46 డాలర్లు లేదా 4.3 శాతం ఎగబాకింది. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు 1,920.19 డాలర్లు లేదా 73.7 శాతం ఎగిసింది.
కొండెక్కిన వెండి
- Advertisement -
- Advertisement -



