Sunday, January 25, 2026
E-PAPER
Homeబీజినెస్వెండి రికార్డ్‌ మెరుపు

వెండి రికార్డ్‌ మెరుపు

- Advertisement -

ఔన్స్‌ ధర 100 డాలర్లకు చేరిక..
న్యూయార్క్‌/ముంబయి :
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతున్నాయి. చరిత్రలో తొలిసారిగా కామెక్స్‌ మార్కెట్‌లో వెండి ఔన్సు (28 గ్రాములు) ధర 100 డాలర్ల మైలు రాయిని అధిగమించింది. జనవరి 23న ఒక్కరోజే 7శాతం పైగా ఎగిసి ఒక దశలో 103.26 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఈ పరిణా మం భారతీయ మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభా వం చూపింది. దేశీయంగా కిలో వెండి ధర రికార్డుస్థాయిలో రూ.3,39,927కు చేరి.. రూ. 3.40లక్షల మార్కుకు చేరువలో నిలిచింది.

ప్రధాన కారణాలు..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెచ్చగొడుతోన్న భౌగోళిక ఉద్రిక్తతలు బంగా రం, వెండి ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి. ఇటీవల దుర్మార్గంగా వెనిజులా అధ్యక్షుడు మదురోను యుఎస్‌ అరెస్ట్‌ చేయడం, గ్రీన్‌ లాండ్‌ను దక్కించుకోవడానికి అమెరికా చేస్తో న్న కుట్రలతో యూరప్‌ దేశాల మధ్య తలెత్తిన విభేదాలు, ట్రంప్‌ ప్రకటించిన కొత్త టారిఫ్‌ ఆంక్షలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేశాయి. ఈ అస్థిరత నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే వెండి, బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు లలో ఒకటైన చైనా జనవరి 1 నుండి వెండి ఎగుమతులపై కఠినమైన ఆంక్షలు విధిం చింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో వెండి కొరతకు దారితీసింది.
పరిశ్రమల నుండి భారీ డిమాండ్‌..
వెండికి ఇటీవల పరిశ్రమల నుండి భారీ డిమాండ్‌ నెలకొంది. గ్రీన్‌ ఎనర్జీ, సోలార్‌ ప్యానెల్స్‌, విద్యుత్‌ వాహనాలు, ఎఐ డేటా సెంటర్ల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. సరఫరా తక్కువగా ఉండటం, డిమాండ్‌ పెరగడం వల్ల ధరలకు రెక్కలు వచ్చాయి. మరోవైపు అమెరికన్‌ డాలర్‌ విలువ తగ్గడం, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు కూడా వెండి ధరల ర్యాలీకి కారణమయ్యాయి. దేశీయంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డ్‌ స్థాయిలో పతనం కావడం భారత్‌లో వెండి, బంగారం ధరలకు మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. గతేడాది 2025లో రూపాయి విలువ 5 శాతం పడిపోగా.. ఈ ఏడాది జనవరిలో ఇప్పటి వరకు 2.3 శాతం క్షీణించింది. వెండి ధరలు అమాంతం పెరిగ డంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగితే ధరలు స్వల్పంగా తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ అతిగా కొనుగోళ్లు జరిగిన స్థితిలో ఉందని, కొత్తగా పెట్టుబడి పెట్టేవారు అప్రమత్తంగా వ్యహారించాలని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -