”ఎక్కడైనా ఎప్పుడైనా ఆకలి
చెలరేగి కేక పెట్టిందంటే
అక్కడ సిరి సంపదలన్నీ
బందీ అని అనుమానించు”
ఈ నాలుగు పాదాలు చాలు ఏ అవరిచితుడైనా ఇదేదో కమ్యూనిస్టు కవిత్వంలా వుందే అని కలవరపడడానికి లేదా కితాబివ్వడానికి. సరిగ్గా ఉన్నం వెంకటేశ్వర్లు, ఉషలకు కావాల్సింది ఇదే.
తెలుగునాట తామేమీ ఇప్పటికిప్పుడు కవికుల (శ్రేణిలో చోటు దక్కించుకోవాలని తహతహ పడుతూ ఈ దీర్ఘ కవితా రచనకు పూనుకోలేదు. చరిత్రలో మొట్టమొదటి సారి తలకిందులు ప్రవంచాన్ని నిలువుగా నిలబెట్టిన మార్క్సిస్టు తాత్విక సిద్ధాంతానికి ఒక సజనాత్మక రూపాన్నివ్వడం వారి లక్ష్యం. కేపీటల్ సారాన్ని కవితాత్మకంగా చెప్పాలన్నది వారి పట్టుదల. వారికిదో తీరని దాహం.
మార్క్సిజం సిద్ధాంతంగా ఎంత గహనమైందో, కమ్యూనిస్టు మేనిఫెస్టోలో కారల్ మార్క్స్ దాన్ని ప్రతిపాదించిన తీరు అంత సజనాత్య్మకమైంది, అంత కవితాత్మకమైంది కూడా. సిందూరం రచయితలు ఈ సాహసానికి పూనుకోవడానికి ఇదొక ప్రేరణ కావచ్చు.
కమ్యూనిజం లాంటి సిద్ధాంతాన్ని, అందులోనూ కేపీటల్ గ్రంథాన్ని ఒక దీర్ఘ కవితలో చెప్పడానికి… అదీ ఈ మాయదారి రోజుల్లో చెప్పడానికి వూనుకున్నందువల్లనే సాహసానికి అనాల్సి వచ్చింది. ఇలాంటి ప్రయత్నంలో అటు మార్క్సిజం సిద్ధాంతంగా సూటిదనం కోల్పోయే ప్రమాదం, ఇటు కవిత్వం నినాద ప్రాయమై పేలవంగా మారే పరిస్థితీ రెండూ వుంటాయి. రెండింటిని సమన్వయం చేయడం రచయితలకు కత్తి మీద సామవుతుంది. ఇక ఎదురుగా వున్నది ఒకే మార్గం. మయకోవ్ స్క్రీ మార్గం. ముందు సిద్ధాంతం, తర్వాతే కవిత్వం అనే వైఖరిని తీసుకోడం!
ఇలాంటి రచనలకు ఈ పరిమితో, ప్రత్యేకతో ఉండి తీరుతుందని విమర్శకులు, పాఠకులు గుర్తించాలి. అప్పుడే సిందూరం లాంటి దీర్ధ కవితకు న్యాయం జరుగుతుంది. అలా చూసినవుడు రచయితలు సిద్ధాంతం నుంచి అటూ ఇటూ తొణకడానికి అణుమాత్రం కూడా అంగీకరించరని ఈ మొత్తం కవితలో ఏ ముక్క చూసినా ఇట్టే తెలిసిపోతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిందూరం కవిత మొత్తం శ్రమ చుట్టూ తిరుగుతుంది. ‘తరతరాల చెమట బావులు తవ్వి/ లోడి, తోడి సంపదకు జమేస్తున్నా/ పేదల ఆకలి మాపే మార్పేమీ లేదు’ అంటూ మొదలెట్టి, ఈ మానవాకృతి ఏర్పడడమే ‘జీవి శ్రమలో దూరి/ శ్రమతో మనిషిగ మారడం’ వల్లనే సాధ్యమైందని శ్రమ విలువను మాటిమాటికీ గుర్తు చేస్తుంది. ‘ఆడా మగా తేడా లేని/ ఆదిమ సంచారంలో/ సమూహాలుగా మారడం వల్ల/ ఒకప్పుడు సమిష్టి శ్రమ పుట్టిందంటూ ‘కీబోర్డూ, సెల్ ఫోను తోడేసుకొన్న’ నేడు రూపం మారడం తప్ప శ్రమా, దాని విలువా, దాని దోపిడీ మారనే లేదని వివరిస్తుంది. ‘అడవుల్లో పుట్టి, కొండల్లో ఎదిగి/ పుట్టా గుట్టా మెట్టల తిరిగి/’ సిగ్గులొలుకుతున్న ప్రకృతి కన్యను శ్రమజీవి వరుడై పెళ్లాడితే వారి తొలిబిడ్డే వస్తు వైందని కవితాత్మకంగా బోధిస్తుంది. ‘శ్రమలోని శ్రమశక్తిని సరుకు చేసి/ నిరుద్యోగ మార్కెట్లో రేటుకు కొనేసి/ దాన్నుంచి శ్రమ విలువను పిండేసి/ బురిడీ లాభం కొట్టేస్తున్నారని’ మార్క్సిస్టు మూల సూత్రాన్ని విప్పి చెబుతుంది. ‘నిజానికి శ్రమ వెలిగే దీపం/ ధర దీపం చుట్టూ తిరిగే శలభం’ అంటూ దానికి మరింత వివరణను జోడిస్తుంది. ‘ఉవ్పుగల్లుకు లేని ధర/ బంగారం వెండికి ఏల’ అని ప్రశ్నించుకోమంటుంది. ‘యంత్రాల గదుల్లో ఏసీలు/ శ్రామికులు నిద్రించగ విశ్రాంతి గదులు/ అలుపెరుగని పని చేసుకోవడానికి/ ఆస్తులు పెంచుకోవడానికి’ తప్ప అందులో ఔదార్యం ఏమీ లేదని లోగుట్టు విప్పి చెప్పి మోసపోవద్దని హెచ్చరిస్తుంది. ‘ఈ రహస్యం తెలుసుకున్న శ్రమజీవులు/ యుద్ధభేరీలు మోగించారనీ/ రణంతో రష్యాలో సాధించారనీ’ శ్రామిక జనానికి అనలు సిసలు దారి చూపిస్తుంది. ఆశాభావాన్ని రగిలిస్తుంది.
గతంలో తాను పెట్టుబడి గ్రంథాన్ని రేఖామాత్రంగా పరిచయం చేస్తూ తెచ్చిన సిందూరంకు కాలం గడిచే కొద్దీ మరింత వివరణ, విస్తరణా అవసరమని వెంకటేశ్వర్లు, ఉషలకు అనిపించినట్లుంది. దీంతో కన్యాశుల్కంలా ఇది మొదటి దానికన్నా దాదాపు రెండింతలైంది. వాస్తవానికి మరొకరి కయితే ‘ఇప్పుడిలాంటి మార్క్సిస్టు తాత్విక దీర్ఘ కవితనెవరు చదువుతారు?’ అని తెలియని నీరసం ఆవహించి వుండాలి. కానీ వీరి జీవితంలో అలాంటి మాటకు తావే లేదు. వెంకటేశ్వర్లుకు శరీరం ఎంత సహకరించకున్నా, సమాజం ఎంత అస్తవ్యస్తంగా కనిపిస్తున్నా, శత్రువెంత మాయలమారిగా మారినా అవేవీ ఆయన్ను లక్ష్యం నుంచి అణు మాత్రం కదిలించలేవు. అందుకే ‘ఇది స్త్రీ నుదుటి సిందూరం కాదు/ శ్రమశక్తి వాటా మార్పుకు/ తెగువ చూపే కష్టజీవుల/ బలగాలు చేసే యుద్ధాల/ నుదుటిపై దిద్దిన పోరాటాల/ కొత్త సిందూరం’ అంటూ పిడికిలెత్తి మరీ చెబుతూనే వుండగలరు. ఎంతటి మహాోధృత కాల ప్రవాహాన్నయినా కలం తోడుగా ఎదురీత్తూ వీరోచిత జీవన యాత్ర సాగిస్తూ ఒక నమూనాగా నిలిచిపోగలరు! చాలామందికిది మొండితనంగా కనిపించవచ్చు. కానీ ఏం చేద్దాం? ఎవరికిష్టం వున్నా లేకున్నా కష్టజీవుల్ని నమ్ముకున్న కమ్యూనిస్టులది జగమొండి తత్త్వం మరి!
విఠపు బాలసుబ్రహ్మణ్యం, శాసన మండలి మాజీ సభ్యులు
శ్రమైక జీవన సిందూరం
- Advertisement -
- Advertisement -