Sunday, March 29, 2026
E-PAPER
Homeఆటలుఫైనల్లో సినర్‌

ఫైనల్లో సినర్‌

- Advertisement -

సెమీస్‌లో జ్వెరెవ్‌పై ఘన విజయం
టైటిల్‌ పోరులో సబలెంక, గాఫ్‌ ఢీ
మయామి ఓపెన్‌ 2026

మయామి (యుఎస్‌ఏ)
వరల్డ్‌ నం.2, ఇటలీ స్టార్‌ జానిక్‌ సినర్‌ ఎదురులేని జోరు కొనసాగుతుంది. ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నమెంట్‌లో ప్రత్యర్థికి ఒక్క సెట్‌ కోల్పోకుండా విజయ ప్రస్థానం కొనసాగిస్తున్న సినర్‌.. మయామి ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో వరల్డ్‌ నం.3 అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై 6-3, 7-6(7-4)తో జానిక్‌ సినర్‌ వరుస సెట్లలో గెలుపొందాడు. 15 ఏస్‌లు, ఓ బ్రేక్‌ పాయింట్‌ సాధించిన సినర్‌.. జ్వెరెవ్‌పై పైచేయి సాధించాడు. తొలి సెట్లో ఓ బ్రేక్‌ పాయింట్‌తో 6-3తో అలవోకగా నెగ్గిన సినర్‌కు రెండో సెట్లో గట్టి పోటీ ఎదురైంది. జ్వెరెవ్‌, సినర్‌ ఇద్దరూ సర్వ్‌లు నిలుపుకోవటంతో నువ్వా నేనా అన్నట్టు మ్యాచ్‌ సాగింది. సినర్‌ వరుస సెట్ల రికార్డుకు బ్రేక్‌ పడేలా కనిపించినా.. టైబ్రేకర్‌లో ఇటలీ ఆటగాడు అదరగొట్టాడు.

7-4తో స్పష్టమైన పైచేయి సాధించాడు. రెండు సెట్లలో జ్వెరెవ్‌ ఒక్క బ్రేక్‌ పాయింట్‌ సాధించలేదు. పాయింట్ల పరంగా 72-68తో జానిక్‌ సినర్‌ ఆధిపత్యం చాటుకున్నాడు. మెన్స్‌ సింగిల్స్‌ మరో సెమీఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు జిరి లెహెక 6-2, 6-2తో వరుస సెట్లలో ఆర్థర్‌ ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై సులువుగా గెలుపొందాడు. 21వ సీడ్‌ జిరి.. 28వ సీడ్‌ ఆర్థర్‌ను చిత్తుగా ఓడించాడు. 6 ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో జిరి ఔరా అనిపించాడు. 4 ఏస్‌లు సాధించిన ఆర్థర్‌.. ఒక్క బ్రేక్‌ పాయింట్‌ సాధించలేకపోయాడు. పాయింట్ల పరంగా 63-44తో జిరి పైచేయి సాధించాడు. నేడు జరిగే టైటిల్‌ పోరులో జానిక్‌ సినర్‌తో జిరి తాడోపేడో తేల్చుకోనున్నాడు. 21వ సీడ్‌ జిరి ఫైనల్లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగుతుండగా.. ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నమెంట్లలో హ్యాట్రిక్‌ టైటిల్‌పై సినర్‌ కన్నేశాడు.

సబలెంకతో పోరుకు గాఫ్‌ సై
మహిళల సింగిల్స్‌లో వరల్డ్‌ నం.1, టాప్‌ సీడ్‌ అరినా సబలెంక (బెలారస్‌), వరల్డ్‌ నం.4 కొకొ గాఫ్‌ (అమెరికా) అంతిమ సమరానికి సై అంటున్నారు. తొలి సెమీఫైనల్లో కజకిస్తాన్‌ భామ, మూడో సీడ్‌ ఎలెనా రిబకినాపై సబలెంక సూపర్‌ విక్టరీ సాధించింది. ఫామ్‌లో రిబకినాపై 6-4, 6-3తో సబలెంక గెలుపొందింది. 9 ఏస్‌లు, 4 బ్రేక్‌ పాయింట్లతో సబలెంక అదరగొట్టింది. రిబకినా 2 ఏస్‌లు, 2 బ్రేక్‌ పాయింట్లతోనే సరిపెట్టింది. సబలెంక సర్వ్‌ బ్రేక్‌ చేసి ఒత్తిడికి గురిచేసినా.. ఒక్క సెట్‌లోనూ స్పష్టమైన పైచేయి సాధించలేదు. పాయింట్ల పరంగా 66-48తో సబలెంక ఆధిపత్యం చూపించింది. మరో సెమీఫైనల్లో అమెరికా అమ్మాయి కొకొ గాఫ్‌ 6-1, 6-1తో ఆడుతూ పాడుతూ టైటిల్‌ పోరుకు చేరుకుంది. 13వ సీడ్‌, చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి కరొలినా ముచోవపై గాఫ్‌ చెమట పట్టకుండా గెలుపొందింది. 1 ఏస్‌, 6 బ్రేక్‌ పాయింట్లతో గాఫ్‌ దూకుడుగా చూపించింది.

ముచోవ ఓ బ్రేక్‌ పాయింట్‌ సాధించినా.. గాఫ్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. 36-21తో పాయింట్ల పరంగా గాఫ్‌ పైచేయి నిలుపుకుంది. పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో ఇటలీ జోడీ సిమోనె బొలెలి, ఆండ్రీయ వావసోరి 6-3, 6-4తో జాన్‌ స్మిత్‌, శాండర్‌ జంటపై వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించారు. మరో సెమీస్‌లో హెన్రీ, హ్యారీ జోడీ 6-2, 6-3తో జెబాల్లోస్‌, మార్సెల్‌పై అలవోక విజయం సాధించి టైటిల్‌ పోరుకు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో టేలర్‌ (అమెరికా), సైనికోవ (చెక్‌ రిపబ్లిక్‌) జంట 4-6, 6-4, 10-3తో స్టెఫానీ (బ్రెజిల్‌), గాబ్రియెల (కెనడా)పై మూడు సెట్ల పోరులో పైచేయి సాధించి ఫైనల్లో కాలుమోపారు. ఇటలీ జోడీ జాస్మిన్‌ పావొలిని, సారా ఎరాని జంట 2-1తో ముందంజలో ఉండగా… ఎలిస్‌ మార్టెన్స్‌ (జర్మనీ), జాంగ్‌ (చైనా) వాకోవర్‌ ఇవ్వటంతో నేరుగా ఫైనల్లోకి ప్రవేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -