లాభాల వాటా రూ.20 వేలు చెల్లించాలి : మాజీ శాసన సభ్యులు జూలకంటి, గుమ్మడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిలో, లాభాలు సాధించడంలో కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర ఉన్నదని గుర్తు చేశారు. లాభాల వాటాలో వారికి రూ.20వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచడంలో, సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కోలిండియాలో ఇదేరకమైన పనులను నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రోజుకు రూ.1,285 చెల్లిస్తుంటే సింగరేణిలో కేవలం రూ.541మాత్రమే చెల్లించటమేంటని ప్రశ్నించారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలైన సింగరేణిలో సెలవులు, వైద్యం, క్యాంటీన్ తదితర చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు చేయకపోవడం దారుణమని చెప్పారు. కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలైనా వారికిచ్చిన హామీని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. 2024-25 లాభాల్లో బోనస్ చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బి. మధు, యాకుబ్ షా వలి, యాకయ్య, కరుణాకర్, బాబు, రామనాథం, రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES