దశల వారీగా ప్రయివేటీకరణకు కేంద్రం కుట్ర
2030 వరకు 50 శాతం ధారాదత్తం
2014 నుంచి ఒకే ఒక్క బొగ్గుగని కేటాయింపు
సంస్థ గుర్తించిన 15 బావుల్లో రెండు ప్రయివేట్‌కు అప్పగింత
కొత్త గనులు రాకుంటే భవిష్యత్ అంధకారమే
సింగరేణి కార్మికుల్లో ఆందోళన
ఊరగొండ మల్లేశం
తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి క్రమంగా కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతోంది. ఉత్పత్తి, మార్కెట్, సాంకేతికత తదితర పోటీని అందిపుచ్చుకోలేక కాదు. కేంద్ర ప్రభుత్వ వివక్షను తట్టుకోలేక.. ప్రపంచీకరణ పేరుతో ప్రయివేటు పెట్టుబడులను భారీగా ప్రోత్సహిస్తున్న మోడీ సర్కార్ క్రమంగా పబ్లిక్ సెక్టార్‌ను అప్పనంగా వారి చేతుల్లో పెట్టేందుకు పలు సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. ఈ క్రమంలోనే సింగరేణి సంస్థను సైతం బడా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2030 వరకు దశల వారీగా 50 శాతం వరకు వారికి అప్పగించే భారీ కుట్రకు తెరతీసిందని తెలుస్తోంది. కేంద్రం కుట్ర ఫలిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.ఒకప్పుడు 1.36 లక్షల మందికి నీడనిచ్చిన సింగరేణి సంస్థలో ప్రస్తుతం 40 వేల రెగ్యులర్, 30 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తున్నారు.
2014లో కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలకు గడ్డు పరిస్థితులు దాపురించాయి. బడా కార్పొరేట్లకు, విదేశీ పెట్టుబడిదార్లకు దేశంలోని పబ్లిక్ సెక్టార్లను అప్పగించే కుట్రకు కేంద్రం తెరలేపింది. ఎల్‌ఐసీ, రైల్వేలు, విమానయానం, ఓడరేవులు తదితర పేరు మోసిన రంగాల్లో ఇప్పటికే బడా బాబులకు రెడ్ కార్పెట్ పర్చింది. అదే వరుసలో సింగరేణిని సైతం తన అనుయాయులకు అప్పనంగా అప్పగించేందుకు మోడీ సర్కార్ భారీ స్కెచ్ వేసిందనీ, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు అందులో భాగమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. మోడీ సర్కార్ అధికారం చేపట్టిన పన్నెండేండ్లలో సింగరేణికి ఒక్క బొగ్గు బ్లాకును కూడా కేటాయించలేదు. 2015లో సంస్థ గుర్తించిన 15 కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించాలని సింగరేణి కేంద్రానికి దరఖాస్తు చేసింది. గతంలో లాగా నేరుగా కేటాయించడం కుదరదనీ, అవసరముంటే వేలంలో పాల్గొనాలని కేంద్రం తేల్చి చెప్పింది.
సింగరేణి దరఖాస్తు చేసుకున్న ఖమ్మం జిల్లా కోయగూడెం-3, కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి ఓసీపీ-3, మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి, కళ్యాణఖని-6 బ్లాక్‌లకు వేలం నిర్వహించి ప్రయివేటు కంపెనీలకు కేటాయించింది. అరబిందో ఫార్మాతో పాటు మరో మూడు సంస్థలు ఈ బ్లాకులను దక్కించుకున్నాయి. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్‌ను సింగరేణి దక్కించుకున్నా తొమ్మిదేండ్లుగా పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 2025 ఏఫ్రిల్‌లో అన్ని అనుమతులు దక్కించుకుని ఉత్పత్తి ప్రారంభించింది. ఆ ఒక్క బొగ్గుగని తప్ప సింగరేణికి ఈ పన్నెండేండ్లలో మరే బ్లాక్ దక్కలేదు. ఫలితంగా ఉద్యోగుల సంఖ్యను కూడా సంస్థ కుదిస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలతోనే కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికి అందుబాటులోకి రావడం లేదు. కొత్త గనులు కేటాయించక పోవడం, విస్తరణ చేపట్టక పోవడం.. ఇలాగే కొనసాగితే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది.
2030 వరకు సగం ఖాళీ…
సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధి (కోల్‌బెల్ట్ ఏరియా)లో 11,257 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. అందులో సింగరేణికి 2,997 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వేందుకు అనుమతులున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 1,500 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా మరో 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అనుమతి పొందిన ప్రాంతం లో మిగిలిన బొగ్గును తవ్వి తీసేందుకు తాజా లెక్కల ప్రకారం 29 అండర్ గ్రౌండ్, 19 ఓపెన్ కాస్ట్ .. మొత్తం 48 బొగ్గు బావులను సంస్థ నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీస్తోంది.
అయితే 2030 వరకు ఇందులో సగం బావుల్లో బొగ్గు నిల్వలు అయిపోనుండటంతో అవి మూత పడే అవకాశం ఉంది. రాబోయే ఐదేండ్లలో సింగరేణి విస్తరించి ఉన్న కోల్‌బెల్ట్ ఏరియాలో దాదాపు 25 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేయాలని నిర్ణయిం చింది. నేరుగా తమకే కేటాయించాలని సింగరేణి కోరిన 15 బ్లాకులతో పాటు మరో 10 బ్లాకులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేలం వేయనుంది. సింగరేణి సంస్థ సీరియస్‌గా వేలంలో పాల్గొన్నా ఒకటి రెండు కూడా దక్కవని భావిస్తున్నారు. ఫలితంగా రాబోయే ఐదేండ్లలో సింగరేణి తన సగం వాటా కోల్పోనుండగా, ఆ వాటాను కేంద్రం ప్రయివేటు పెట్టుబడి దార్లకు అప్పగించనుందని తెలుస్తోంది.
పదేహేను దశాబ్దాల ప్రయాణం…
1871లో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ కింగ్ ఖమ్మం జిల్లాలోని ‘ఇల్లందు’ అనే గ్రామంలో బొగ్గు గనులను కనుగొన్నాడు. 1886లో ఇంగ్లాండులో ఉన్న ‘ది హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్’ ఇల్లందు పరిసర ప్రాంతాల్లో బొగ్గు గనులను తవ్వుకొనే హక్కు సంపాదించింది. 1920 డిసెంబర్ 20న హైదరాబాద్ కంపెనీస్ చట్టం ప్రకారం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ‘ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ’్ (ఎస్‌సీసీఎల్) ఏర్పడింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించింది.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, జిల్లాల్లో సింగరేణి సంస్థకు బొగ్గు గనులు ఉన్నాయి. ప్రస్తుతం ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర వాటా 51 శాతం కాగా, కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం. సంస్థ వాటాలో ఎక్కువ భాగం రాష్ట్రానిదే అయినా.. కొత్త బొగ్గు బావుల కేటాయింపు లాంటి ముఖ్యమైన నిర్ణయాలు కేంద్రానివే కావడంతో సింగరేణితో పాటు మరో ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్ ఇండియాకు కూడా గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయి.
కొత్త గనులు కేటాయించాలి
కోల్‌బెల్ట్ ఏరియాలో గుర్తించిన బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలి. ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, ఉత్పత్తి సింగరేణి కాలరీస్ కంపెనీ సొంతం. 150 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో సంస్థ ఎన్నో ఒడిదొడకులను ఎదుర్కొని నిలబడింది. దేశంలోనే అత్యధిక లాభాల్లో నడుస్తున్న సంస్థను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోంది. బడా కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటాం. అవసరమైతే ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేసి మరో తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడి సంస్థను కాపాడుకుంటాం.
రాజిరెడ్డి, అధ్యక్షులు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ)



