కార్మిక హక్కులు హరించేలా బీజేపీ విధానాలు
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలో పాలడుగు భాస్కర్
30 తీర్మానాలను ఆమోదించిన ప్రతినిధులు
నవతెలంగాణ-మందమర్రి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సింగరేణిని వేగంగా ప్రయివేటీకరణ వైపు నడిపిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) 17వ రాష్ట్ర మహా సభలు రెండోరోజైన ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి సీఈఆర్ క్లబ్‌లో ఉత్సాహభరితంగా సాగాయి. శనివారం ప్రారంభమైన ఈ మహాసభలో.. ముందుగా యూనియన్ ఫౌండర్ సత్య నారాయణ యూనియన్ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ప్రతినిధులంతా నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రారంభమైన మహాసభలో పలువురు కేంద్ర, రాష్ట్ర నాయకులు మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని ప్రయివేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. గనుల్లో పని చేసే కార్మికుల భద్రత విషయంలో రాజీపడేదిలేదని తెలిపారు. పని స్థలాల్లో భద్రతా చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. వందేండ్ల కార్మిక పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రం రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం ద్వారా కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. యూనియన్ల ఏర్పాటుపై ఆంక్షలు, సమ్మె హక్కుపై దాడి, యూనియన్ గుర్తింపునకు కఠిన నిబంధనలు విధించడం ద్వారా కార్మిక యూనియన్లను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మె కేవలం కార్మికుల నిరసన మాత్రమే కాదని, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం సాగుతున్న పోరాటమని స్పష్టం చేశారు. అనం తరం సీనియర్ నాయకులు నాగరాజు గోపాల్ 30 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ ముగింపు మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, గౌరవ అధ్యక్షులు పి.రాజారావు, ఉప ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్, ప్రచార కార్యదర్శి మెండు శ్రీనివాస్, ఎస్‌సీకేఎస్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి బి.మధు, సీఐటీయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రంజిత్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ముత్యంరావు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బ్రహ్మచారి, వివిధ ఏరియాల బ్రాంచ్ అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



