Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించాలి

సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించాలి

- Advertisement -

35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలి
సొంత ఇంటి పథకం అమలుకు కార్మికులు బ్యాలెట్‌ ఓటులో పాల్గొనాలి
11, 12 తేదీల్లో పని ప్రదేశాల్లో బ్యాలెట్‌బాక్స్‌ల ఏర్పాటు
సివిల్‌ విభాగంలో అవినీతిపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలి : సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం

సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలు ప్రకటించి అందులో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సివిల్‌ విభాగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ”సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కావాలా.. కంపెనీ క్వార్టర్‌ కావాలా..” అనే నినాదంతో కార్మికుల మనోగతాన్ని బహిర్గతం చేసేందుకు ఈనెల 11, 12 తేదీల్లో బొగ్గు గనులు, డిపార్ట్‌మెంట్‌ ప్రాంతాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల అభిప్రాయాన్ని బ్యాలెట్‌ ఓటింగ్‌ ద్వారా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్మికులంతా బ్యాలెట్‌ ఓటింగ్‌ కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. కార్మికులు ఇండ్ల మరమ్మత్తుల విషయంలో సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికులకు ఇచ్చిన సొంత ఇంటి కల నెరవేర్చడంలో విఫలమయ్యాయని విమర్శించారు. సింగరేణి కార్మికులు ఇల్లు నిర్మించుకునేందుకు ఒకొక్కరికి రూ.25 లక్షలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నదని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా 1300 ఎకరాల భూమిని సీఐటీయూ గుర్తించిన విషయాన్ని సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఈ స్థలంలో కార్మికులకు సొంత ఇల్లు నిర్మించే అవకాశం ఉందన్నారు. సింగరేణి కార్మికుల నివాసం ఉంటున్న ఇల్లు శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయని, వాటి జీవితకాలం ముగిసిందని తెలిపారు. అయినప్పటికీ ప్రమాదపు అంచున కార్మికులు అదే ఇండ్లల్లో ఉంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల ఇండ్ల మరమత్తు పేరుతో సివిల్‌ డిపార్ట్మెంట్‌ అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ విషయమై విజిలెన్స్‌ విచారణ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బదిలీలకు దరఖాస్తు పెట్టుకున్న కార్మికులు, ఉద్యోగులకు బదిలీలు నిర్వహిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు. అలాగే, ఈ నెల15న సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించేందుకు యూనియన్‌ పిలుపునిచ్చిందని, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్లు, గాజుల రాజారావు, సూరం ఐలయ్య, సంపత్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad