Tuesday, January 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ జరపాలి

సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ జరపాలి

- Advertisement -

కమీషన్లు కొల్లగొట్టేందుకే కాంట్రాక్టు సైట్‌ విజిట్‌ పద్ధతి
బీజేపీకి, రేవంత్‌రెడ్డికి మధ్య చీకటి ఒప్పందం
దోపిడీ సొమ్ము వాటాల కోసమే సీఎం, మంత్రుల మధ్య పంచాయితీ
బీఆర్‌ఎస్‌ గద్దెల జోలికొస్తే నీ గద్దె కూలుస్తాం : సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు హెచ్చరిక

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. బీజేపీకి, రేవంత్‌రెడ్డికి మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ సింగరేణి టెండర్లలో కుంభకోణం జరిగిందని చెప్పారు. సీఎం, మంత్రుల మధ్య వాటాల పంచాయితీలు చూస్తున్నామని అన్నారు. కాంట్రాక్టు సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ లేదనే కారణంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నైనీ బ్లాక్‌ టెండర్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. కాంట్రాక్టు సైట్‌ విజిట్‌ పద్ధతి దేశంలోనూ, కోల్‌ ఇండియాలోనూ లేదన్నారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2024లో ఈ విధానాన్ని తెచ్చిందని చెప్పారు. ఆయన బామ్మర్ది సుజన్‌రెడ్డి కంపెనీ శోదా కన్‌స్ట్రక్షన్‌కు ఈ సర్టిఫికెట్‌ వచ్చాక మొదటి టెండర్‌ దక్కిందని వివరించారు. సింగరేణిలో ఆరు టెండర్లు కూడా ప్లస్‌ ఏడు పర్సెంటేజీకి వారి అనుయాయులకు కట్టబెట్టారని విమర్శించారు. కోల్‌ బ్లాక్‌ టెండర్‌ దేశంలో ఎక్కడ జరిగినా మైనస్‌ 10 నుంచి మైనస్‌ 22 శాతానికి పోతుందని చెప్పారు. గతంలో సింగరేణిలోనూ మైనస్‌ ఏడు నుంచి మైనస్‌ 20 వరకు వెళ్లేదని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి వచ్చాక అన్ని టెండర్లు ప్లస్‌ ఏడు నుంచి ప్లస్‌ 10 శాతానికి పోతున్నాయని అన్నారు. భట్టి కేవలం నైనీ టెండర్లు మాత్రమే రద్దు చేస్తామన్నారనీ, మిగతా వాటి సంగతేంటని హరీశ్‌రావు ప్రశ్నించారు.

సైట్‌ విజిట్‌ విధానంతో అనుయాయులకు టెండర్లు
ఆన్‌లైన్‌ టెండర్ల ద్వారా దేశంలో ఎవరైనా దాఖలు చేయొచ్చనీ, కానీ సైట్‌ విజిట్‌ విధానంలో ముందే వెళ్లి చూసి సింగరేణి నుంచి సర్టిఫికెట్‌ పొందాలని హరీశ్‌రావు అన్నారు. ఎవరు ముందుగానే టెండర్‌ వేస్తున్నారో తెలుసుకుని, బెదిరించి, భయపెట్టి వారికి టెండర్‌ దక్కకుండా చేసి పాలకుల అనుయాయులకు ప్లస్‌ ఏడు నుంచి ప్లస్‌ 20 శాతానికి కట్టబెట్టి, కమీషన్లు కొల్లగొట్టారని విమర్శించారు. నైనీ బ్లాక్‌లోనూ ఇదే జరిగిందనీ, వాటాల పంచాయితీ వచ్చి కొట్టుకునే పరిస్థితి నెలకొందని చెప్పారు. సింగరేణిలో బీఆర్‌ఎస్‌ హయాంలో ఉన్న టెండర్లను రద్దు చేసి, వాటినే కాంగ్రెస్‌ అనుయాయులకు కట్టబెడుతున్నారని అన్నారు. సింగరేణి గతంలో బల్క్‌లో ఐఓసీఎల్‌ నుంచి డీజిల్‌ సరఫరా చేసేవారని చెప్పారు.

కానీ పర్సెంటేజీల కోసం డీజిల్‌ను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారని విమర్శించారు. కమీషన్ల కోసం సింగరేణి ఇచ్చే డీజిల్‌ విధానాన్ని రద్దు చేశారని అన్నారు. దీంతో సింగరేణికి ఎక్కువ నష్టమని చెప్పారు. రేవంత్‌రెడ్డికి నిజాయితీ ఉంటే సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. అన్ని వివరాలు అందించేందుకు తాను సిద్ధమని అన్నారు. రేవంత్‌రెడ్డికి, బీజేపీకి మధ్య చీకటి ఒప్పందం ఉందనీ, ఒకవేళ లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. సింగరేణి సంస్థ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని సీఎండీగా నియమించాలని కోరారు. సైట్‌ విజిట్‌ విధానంతోపాటు డీజిల్‌ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలన్నారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

క్యాబినెట్‌ దండుపాళ్యం ముఠా
క్యాబినెట్‌ దండుపాళ్యం ముఠా అనీ, సింగరేణి టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటి రెడ్డి మధ్య వాటాల పంచాయితీ వచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. ఐఏఎస్‌ అధికారులు, జర్నలిస్టులు బలి పశువులయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. దక్కన్‌ సిమెంట్స్‌ యజమానిని సీఎం ఇంటికి ఎదురుగా ఉన్న గెస్ట్‌ హౌజ్‌లో తుపాకీ ఎక్కుపెట్టి పైసలు వసూలు చేశారంటూ మంత్రి కుమార్తె చెప్పిందని గుర్తు చేశారు. సమ్మక్క సారలమ్మ టెండర్లు దక్కలేదంటూ మంత్రి పొంగులేటి దేవాదాయ శాఖ నుంచి ఆర్‌ అండ్‌ బీకి మార్చి దాన్ని దక్కించుకున్నారని వివరించారు.

మద్యం బాటిళ్లపై హోలో గ్రాం టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ మంత్రి మధ్య ఐఏఎస్‌ బలయ్యారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి సంతకం చేయకుండానే సినిమాల ప్రివ్యూ షోలు, ధరల పెంపు ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు. ఈ పంచాయితీల మధ్య ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు సంపత్‌ కుమార్‌ రూ.ఎనిమిది కోట్ల కోసం కాంట్రాక్టర్‌నే బెదిరించారని గుర్తు చేశారు. ఆ కాంట్రాక్టర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఖాకీ బుక్కు ఎక్కడికి పోయిందని డీజీపీ శివధర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను ప్రశ్నించారు.

సీఎంగా రేవంత్‌ విఫలం
సీఎం రేవంత్‌రెడ్డికి తెల్వకుండా సిట్‌ ఎలా వస్తుందని హరీశ్‌రావు అడిగారు. హోంమంత్రి, సీఎంకు తెల్వకుండా సిట్‌ వస్తే ముఖ్యమంత్రిగా ఆయన విఫలమైనట్టేనని అన్నారు. సర్కార్‌ నడుపుతున్నారా, సర్కస్‌ నడుపుతున్నారా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ జెండా గద్దె జోలికొస్తే ఆయన గద్దె కూలుస్తామని హెచ్చరించారు. గులాబీ జెండా గద్దెల్లో లేదనీ, ప్రజల గుండెల్లో ఉందని చెప్పారు. ఇకనైనా ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టాలని కోరారు. క్యాబినెట్‌లో రైతు బంధుపై, యూరియా కొరతపై చర్చించి ప్రకటన వస్తుందని రైతులంతా ఎదురుచూశారని అన్నారు. కానీ ఆ చర్చే జరగలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల ఊసేలేదని చెప్పారు.

రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు… భట్టి వైఎస్‌కు విధేయులు
సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి భట్టి వైఎస్‌కు విధేయులని హరీశ్‌రావు అన్నారు. ఆ ఇద్దరూ తెలంగాణ వ్యతిరేకులని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ భూస్థాపితమే లక్ష్యమంటూ ఎన్టీఆర్‌ ప్రకటించారనీ, అది జరిగితేనే మనశ్శాంతి కలుగుతుందని అన్నారు. టీడీపీ, బీజేపీ ఎన్డీయే కూటమిలో ఉన్నాయని వివరించారు. టీడీపికి అనుకూలంగా రేవంత్‌రెడ్డి మాట్లాడితే బీజేపీకి అనుకూలమే అవుతుందన్నారు. కాంగ్రెస్‌ ఔట్‌సోర్సింగ్‌ సీఎం, అసలైన కాంగ్రెస్‌ వాదులకు మధ్య యుద్ధం నడుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కెపి వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, నాయులు మన్నె గోవర్ధన్‌రెడ్డి, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -