రూ.500 పెంచి చేతులు దులుపుకోవడం దారుణం
ఈ నెల 12న ఇచ్చిన హామీని మరిచిన ఉప ముఖ్యమంత్రి
అభివృద్ధి నిధుల కోసం 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తాకట్టు పెట్టిన ఎమ్మెల్యేలు : సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు మోసం చేసిందనీ, రూ.500 వేతనం పెంచి చేతులు దులుపుకున్నదని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి.మధు విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేసేదాకా పోరాడుతామని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న కాంట్రాక్టు కార్మికులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన హామీని మరిచారని విమర్శించారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి నిధుల కోసం 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తాకట్టు పెట్టడాన్ని తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు పట్టిన గతే పట్టిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. జీతాలు పెరుగుతాయని ఎంతో ఆశతో ఎదురుచూసిన కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర సర్కారు నిరాశే మిగిల్చిందని వాపోయారు. బోనస్ చట్టం ప్రకారం చూసిన లాభాల్లో ఉన్న కంపెనీలు కాంట్రాక్ట్ కార్మికులకు 20 శాతం వరకు బోనస్ చెల్లించాలని గుర్తుచేశారు.
కాంట్రాక్టు కార్మికులపై సానుభూతి పలుకులు పలికిన ఇంధన శాఖామంత్రి భట్టి విక్రమార్క, జీతాలు పెంచుతామని హామీలు ఇచ్చిన కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయారని విమర్శించారు. ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలకాయలు ఊపుకుంటూ రావడాన్ని తప్పుబట్టారు. సింగరేణి యాజమాన్యం దగ్గర నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్న ఎమ్మెల్యేలు తమ డబ్బుల కోసం కాంట్రాక్టు కార్మికుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల శ్రమతో, రక్తంతో రూ.6,395 కోట్లు లాభాలు ఆర్జించిన సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారికి కొంత మేర లాభాలు కేటాయించాలనే సోయిలేకపోవడం దారుణమని పేర్కొన్నారు. నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 20 నెలలు గడిచినప్పటికీ సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచలేదని విమర్శించారు. గతేడాది కాంట్రాక్ట్ కార్మికులతో పాలాభిషేకాలు చేయించుకున్న ఎమ్మెల్యేలకు మరి ఈ సంవత్సరం తద్దినాలు పెట్టాలా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు స్పందించి కాంట్రాక్టు కార్మికులకు సముచితమైన లాభాల వాటాను ఇప్పించాలని డిమాండ్ చేశారు.