– ధృవపత్రాల అందజేత
– తెలంగాణ సమస్యలను ఢిల్లీలో వినిపిస్తా: వేం నరేందర్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభకు కాంగ్రెస్ నుంచి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాధి అభిషేక్ మను సింఘ్వీ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిద్దరికి అసెంబ్లీ కార్యదర్శి, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రెండ్ల తిరుపతి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌కు అభ్యర్థులు వచ్చి ధృవపత్రాలు అందుకున్నారు. వేం నరేందర్‌రెడ్డి వెంట మంత్రి డి శ్రీధర్‌బాబు, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అభిషేక్ మను సింఘ్వీ ధృవపత్రాన్ని ఆయన ఎన్నికల ఏజెంట్ చౌహాన్ తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమస్యలను ఢిల్లీలో వినిపిస్తానని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ పెద్దలు మల్లికార్జ్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తానని అన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే అనుభవం గల నాయకులు రాజ్యసభలో అడుగుపెడుతున్నారని తెలిపారు. వారిద్దరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ వారి ప్రస్థానం..
అభిషేక్ మను సింఘ్వీ : రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో ఫిబ్రవరి 24, 1959లో అభిషేక్ మను సింఘ్వీ జన్మించారు. ప్రముఖ న్యాయవేత్త డాక్డర్ లక్ష్మి మల్ సింఘ్వీ కుమారుడు. ఢిల్లీతోపాటు కేంబ్రీడ్జ్, హార్వర్డ్ యూనివర్సీటీల్లో విద్యాభ్యాసం చేశారు. ప్రముఖ గజల్, సూఫీ సింగర్ అనితా సింఘ్వీ ఆయన భార్య. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 34 ఏండ్ల వయస్సులో అత్యంత పిన్న వయస్కుడైన యువ న్యాయవాదిగా పేరుగాంచారు. 37 ఏండ్ల వయస్సులోనే యువ అదనపు భారత సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. రాజ్యాంగ సంబంధమైన కేసుల్లో ఆయనకు ఎక్కువ ప్రావీణ్యం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తరపున రెండేండ్లుగా సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. ఈయనకు తెలంగాణ నుంచి రాజ్యసభలో రెండోసారి ప్రాతినిథ్యం లభించింది.
వేం నరేందర్‌రెడ్డి : మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం అర్పణపల్లెలో వేం నరేందర్‌రెడ్డి జన్మించారు. వరంగల్‌లో సీకేఎం కాలేజీ నుంచి పట్టభద్రులయ్యారు. 1982లో టీడీపీ ప్రధానకార్యదర్శిగా సేవలు అందించారు. అనంతరం 2017లో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. తాజాగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004లో మహబూబాబాద్ నుంచి టీడీపీ టికెట్‌తో ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం,. 2015లో ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి పోటీచేశారు. 2021లో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



