– దెబ్బతిన్న ఎగువ విట్‌మెంట్.. చీలిన పిట్టగోడ
– గతేడాది పడ్డ బుంగకు తాత్కాలిక మరమ్మతులు
– జలాశయంలో సామర్థ్యానికి మించి నీటి నిల్వ
– డిజైన్ ప్రకారం 517 మీటర్లే.. కానీ 520కి పెంచుతూ గతంలో జీవో
– భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని నిపుణుల హెచ్చరిక
– శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచన
– తక్షణమే పనులు చేపట్టాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
తాగు, సాగునీటి అవసరాలు తీర్చే వరప్రదాయినిగా ఉన్న సింగూర్ ప్రాజెక్టు ప్రమాదపుటంచులో ఉంది. జలాశయానికి వాటిల్లనున్న ముప్పును పసిగట్టిన నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను సమర్పించారు. శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, లేని పక్షంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించడమే కాకుండా తీసుకోవాల్సిన జాగ్రతల గురించి పలు సూచనలు చేశారు. ఏడు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే సింగూరు జలాశయం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల భారీ వరదలొస్తే పెద్దఎత్తున డ్యామేజ్ జరగనుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో 29.91 టీఎంసీల సామర్థ్యంతో 1976లో సింగూర్ రిజర్వాయర్ నిర్మితమైంది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తోంది. తాగునీటి అవసరాలే కాకుండా నేరుగా సాగు నీరందిస్తోంది. భూగర్భ జలాల నీటి మట్టం పెరగడం ద్వారా దిగువ ప్రాంతంలో నీటి లభ్యత సంమృద్ధిగా ఉంటుంది. అయితే ప్రాజెక్టులు, జలాశయాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరిగేషన్ శాఖ నిర్లక్షం ఫలితంగా సింగూరు జలాశయం డేంజర్ జోన్‌లో ఉంది. మరమ్మతులు చేయకపోవడమే కాకుండా ప్రాజెక్టు డిజైన్‌కు మించి నీటి నిల్వను ఉంచేలా గత ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అదే స్థాయిలో నీటి నిల్వల్ని కొనసాగించడం వల్ల కట్టలు దెబ్బతినడం, రివిట్‌మెంట్ పాడై బుంగలు పడటం మొదలైంది. ఇప్పటికైనా నిపుణుల సూచనల మేరకు తక్షణమే ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఎగువన దెబ్బతిన్న రివిట్‌మెంట్
జలాశయం మట్టి కట్టల ఆఫ్‌స్టీమ్ పంపునకు రక్షణగా ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్ దెబ్బతిన్నది. పలు చోట్ల మట్టి కట్టలు కూడా దెబ్బతిన్నాయి. పిట్టగోడ నిలువునా చీలిపోయింది. గతేడాది కట్ట లోపల భాగంలోని రివిట్‌మెంట్ దెబ్బతిని బుంగపడింది. ఈ ఏడాది జూన్ 23న ప్రాజెక్టును డీఎస్‌ఆర్‌పీ కమిటీ చైర్మెన్ అశోక్‌కుమార్ గంజు, నిర్మాణ రంగ నిపుణులు యోగిందర్‌కుమార్, ఈఎన్‌సీ మాజీ డీజీ ఎం.రాజు, మెకానికల్ నిపుణులు కన్నయ్యతో కూడిన నిపుణుల బృందం సింగూరు ప్రాజెక్టును పరిశీలించింది. ప్రాజెక్టుకు ఏర్పడిన ప్రమాదాన్ని గమనించిన కమిటీ సమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. డ్యామ్ ఎగువ భాగంలో దెబ్బతిన్న రివిట్‌మెంట్, కట్టలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కూడా ప్రభుత్వానికి సూచించింది.
సామర్థ్యానికి మించి నీటి నిల్వ వల్లే..
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జలాశయంలో 517 మీటర్ల నీటి నిల్వకు వీలుగా డిజైన్ చేశారు. చాలాకాలం అదే నిబంధన కొనసాగించారు. రాష్ట్రంలో తాగునీటి అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం అమల్లోకి వచ్చాక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సింగూరులో నీటి నిల్వను పెంచాలని నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాలు పెరిగాయనే నెపంతో 520 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు వీలుగా అనుమతిస్తూ గత ప్రభుత్వం 2017 అక్టోబర్ 30న జీవో 885 జారీ చేసింది. అప్పటి నుంచి జలాశయంలో సామర్థ్యానికి మించి నీటిని నిల్వ చేస్తూ వచ్చారు. కొన్ని సార్లు అధికారులు ఇష్టానుసారంగా 522 మీటర్ల వరకు కూడా నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టు నిర్వహణ చేశారు.
నిపుణుల నివేదిక బేఖాతర్
సింగూరు జలాశయం పరిరక్షణ విషయంలో నిపుణుల నివేదికను ప్రభుత్వాలు బేఖాతర్ చేస్తున్నాయి. నివేదిక సూచనల మేరకు మరమ్మతులు చేపట్టకపోతే ఏ క్షణంలోనైనా భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించినా ప్రభుత్వాలకు పట్టింపులేదనే విమర్శలున్నాయి. 97 శాతం నీటి నిల్వలు పూర్తిగా గేట్లపై ఆధారపడినందున జలాశయం నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కమిటీ చెప్పింది. 2016, 2019, 2024లో జలాశయం తనిఖీలు చేసిన నిపుణుల కమిటీ స్పిల్‌వే, ఎర్త్‌డ్యామ్, గ్యాలరీలకు మరమ్మతులు చేపట్టాలని సూచించింది. ఇంతవరకు సింగూరు జలాశయానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు.
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి
ఏడు జిల్లాలకు తాగునీటితో పాటు సాగునీటి అవసరాలు తీర్చేందుకు నిర్మించిన సింగూరు జలాశయానికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
శుక్రవారం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.సాయిలు, ఎం.నర్సిములు, అందోల్ ఏరియా కార్యదర్శి విద్యాసాగర్ ప్రతినిధి బృందం సింగూరు జలాశయాన్ని పరిశీలించింది. దెబ్బతిన్న రివిట్‌మెంట్, కట్టలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్వహణలో తీవ్రమైన లోపాలున్నందున నష్టం వాటిల్లే దుస్థితి నెలకొన్నదన్నారు. ప్రభుత్వం మరమ్మతులకు అనుమతులిచ్చి నిధులు కేటాయించకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
– సీపీఐ(ఎం)
ప్రమాదపుటంచులో సింగూర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES