Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసిన్హాకు రెండుచోట్ల ఓట్లా ?

సిన్హాకు రెండుచోట్ల ఓట్లా ?

- Advertisement -

సర్‌ మోసమా? డిప్యూటీ సీఎం మోసం చేశారా?
నిలదీసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌
పాట్నా :
‘ఎన్నికల కమిషన్‌ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ మొత్తం మోసపూరితంగా చేసిందా? లేక బీహార్‌ డిప్యూటీ సీఎం విజయ్‌కుమార్‌ సిన్హా మోసం చేశారా?’ అని బీహార్‌ ప్రతిపక్ష నేత, ఆర్‌జెడి నాయకుడు తేజస్వి యాదవ్‌ ప్రశ్నించారు. పాట్నాలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తిగా మోసపూరితంగా ఉందని అన్నారు. బీజేపీకి సహాయపడే సాధనంగా ఈసీఐ మారకూడదని చెప్పారు. విజయ్‌ కుమార్‌ సిన్హాకు పాట్నాలోని బంకిపూర్‌ అసెంబ్లీ స్థానంలోనూ, లఖిసరారు అసెంబ్లీ స్థానంలోనూ వేర్వేరు వయసులతో ఓటరుగా నమోదై ఉన్నారని తెలిపారు. ఒక నియోజకవర్గంలో వయసు 57 అని, మరో నియోజకవర్గంలో 60 అని నమోదైందని చెప్పారు. ‘కొత్త ఓటర్ల జాబితా అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులకు ఇచ్చారు. ఈ జాబితాలలో రెండు చోట్ల నమోదై ఉంది. ఇప్పుడు ఎవరు మోసం చేస్తున్నారు? ప్రజలు దీనిని తెలుసుకోవాలి’ అని అన్నారు. ‘వేర్వేరు దశల్లో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు సిన్హా రెండుచోట్ల ఎన్యూమరేషన్‌ ఫారాలు పూర్తి చేశారా? ఆయన వ్యక్తిగతంగా సంతకం చేయకపోతే, నకిలీ సంతకాల ఆధారంగా రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల కమిషన్‌ రెండు వేర్వేరు ఓట్లను సృష్టించిందా?’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈసీఐ వెబ్‌సైట్‌లోని రెండు ఎపిక్‌ నెంబర్లను మీడియాకు చూపించారు. సిన్హా నుంచి బూత్‌ లెవెల్‌ అధికారులు రెండు ప్రదేశాల్లోనూ సంతకాలు తీసుకుని నమోదు చేసి ఉండవచ్చునని తేజస్వి చెప్పారు. ఎన్నికల కమిషన్‌, పాట్నా, లఖిసరారు జిల్లా యంత్రాంగాలు ఈ అంశంపై ఏం చేస్తాయని ప్రశ్నించారు. తనకు ఆగమేఘాలపై నోటీసు జారీ చేసిన ఎన్నికల యంత్రాంగం ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తుందని నిలదీశారు. బీజేపీకి అనుకూలంగా ఈసీఐ వ్యవహరిస్తోందని విమర్శించారు. విజరుకుమార్‌ సిన్హా దోషి అయితే రాజీనామా చేయాలని, ఈసీఐ దోషి అయితే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా పురుషుల కంటే అత్యధికంగా మహిళల ఓట్లను తొలగించారని తెలిపారు.
లఖిసరై నుంచి ఓటు తొలగించాలని దరఖాస్తు చేశా : విజయ్‌ సిన్హా
లఖిసరై నియోజకవర్గం నుంచి తన ఓటు తొలగించాలని దరఖాస్తు చేసుకున్నానని, ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని డిప్యూటీ సీఎం విజయ్‌ సిన్హా చెప్పారు. గతంలో తన కుటుంబం ఓట్లన్నీ పాట్నాలో ఉన్నాయని, 2024 ఎన్నికల సమయంలో లఖిసరై అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చాలని దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img