Monday, November 17, 2025
E-PAPER
Homeజాతీయంప్రజాస్వామ్య పునాదులపై సర్‌ దాడి

ప్రజాస్వామ్య పునాదులపై సర్‌ దాడి

- Advertisement -

12 రాష్ట్రాలు లక్ష్యంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఉమ్మడి రాజకీయ ప్రాజెక్టు
మహిళలు, దళితులు, ఆదివాసీలపై పెరిగిన దాడులు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆందోళన
ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటాలకు పిలుపు
తీవ్ర పేదరికాన్ని అరికట్టిన కేరళకు అభినందనలు

న్యూఢిల్లీ : బీహార్‌ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) వివాదాస్పద ప్రక్రియపై సీపీఐ(ఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ కాదనీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఉమ్మడి రాజకీయ ప్రాజెక్టు అని విమర్శించింది. దేశంలో మహిళలు, దళితులు, ఆదివాసీలపై దాడుల పెరుగుదలకు ఆర్‌ఎస్‌ఎస్‌ జొప్పిస్తున్న విద్వేషపూరిత మనువాద భావజాలమే కారణమని పేర్కొంది.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం, వేతనాలు తగ్గిపోతుండటం మొత్తం దేశ ఆర్థిక స్థితి ఏమాత్రం సవ్యంగా లేదన్న గణాంకాల పట్ల సీపీఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు మరింత సమిష్టి కార్యాచరణతో ఉమ్మడి పోరాటాల ను నిర్మించాలని పిలుపునిచ్చింది. ఈ నెల 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సమావేశమైంది. పార్టీ కేంద్ర కమిటీ తదుపరి సమావేశాన్ని వచ్చే ఏడాది జనవరి 16-18 తేదీల్లో కేరళలోని తిరువనంతపురం లో నిర్వహించాలని నిర్ణయించింది. జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపై సమా వేశంలో తీర్మానించిన అంశాలను ఆదివారం సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విడుదల చేసింది.

బీహార్‌ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం
బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయి లో 67 శాతం పోలింగ్‌ జరిగింది. గత ఎన్నికల తో పోలిస్తే ఇది 9.6 శాతం అధికం. మహిళలు 71.6 శాతం మంది ఓటేశారు. గణనీయంగా పెరిగిన మహిళల రాజకీయ భాగస్వామాన్ని ఇది సూచిస్తోంది. వివిధ పార్టీలకు లభించిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో పోలిస్తే ఎన్డీఏకు పెద్దగా పెరిగిందేమీ లేదు. అయినప్పటికీ రాష్ట్ర శాసనసభలో తన బలాన్ని పెంచుకోగలిగింది. ఎన్నికల సమయంలో అధికార కూటమి అధి కార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియో గించుకుంది. అనేక అవకతవకలకు పాల్ప డింది. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసింది. రాష్ట్రం వెలుపలి నుంచి భారీగా కార్యకర్తలను రప్పించింది.

మత, కుల తత్వాలను రెచ్చగొడు తూ తన నేతలు చేసిన ప్రసంగాలతో ఆయా సమాజాల ఓటర్లను సమీకరించి ప్రయోజనం పొందింది. ప్రధాని, హోం మంత్రి సహా కూటమి నేతలందరూ అలాంటి ప్రసంగాలే చేశారు. వీరి వాక్చాతుర్యానికి కార్పొరేట్‌ మీడియా ఆజ్యం పోసింది. దీంతో మహాగఠ్‌బంధన్‌ లేవనెత్తిన అనేక ప్రజా సమస్యలు మరుగునపడి పోయాయి. బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్ష పార్టీలు మరింత సంఘటిత ప్రయత్నాలు జరిపి, దాని ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఉమ్మడి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని బీహార్‌ ఎన్నికలు నిరూపించాయి. కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిని సీపీఎం సవివరంగా పరిశీలిస్తుంది. ఫలితాలకు సర్‌ ప్రక్రియ, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాన్ని అధ్యయనం చేస్తుంది. పార్టీ అభ్యర్థులతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు కూడా ఓటు వేసిన ఓటర్లకు సీపీఎం కృతజ్ఞతలు తెలిపింది.

ప్రభుత్వ వైఫల్యంతోనే ఢిల్లీ పేలుళ్లు
ఢిల్లీలో జరిగిన బాంబు దాడి వెనుక విస్తృత నెట్‌వర్క్‌ ఉన్నదన్న విషయం స్పష్టమవుతోంది. ప్రజలకు భద్రత కల్పించడంలోనూ, ఇలాంటి ఉగ్ర దాడులను అడ్డుకోవడంలోనూ ప్రభుత్వ వైఫల్యం మరోసారి బయటపడింది. పహల్గాం దాడి తర్వాత తాను చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా జైషే మహమ్మద్‌ కేంద్ర కార్యాలయం ధ్వంసమయ్యాయని ప్రభుత్వం చెప్పుకుంది. తాజా దాడికి జైషే కారణమని ప్రభుత్వం తెలపడంతో ఈ వాదనల్లో పస లేదని తేలిపోయింది. దాడులకు కారణమైన ఉగ్రవాద వ్యవస్థలను కనిపెట్టి, కుట్రదారులందరినీ చట్టం ముందు నిలపడా నికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ఈ ఘటనను సాకుగా చూపించి మత ప్రాతిపది కన సమాజాన్ని విభజించడానికి జరుగుతున్న ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది.

కేరళ చారిత్రక విజయం
రాష్ట్రంలో తీవ్ర దారిద్య్రాన్ని అంతం చేసే విషయంలో చారిత్రక విజయం సాధించామని నవంబర్‌ 1వ తేదీన కేరళలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ప్రకటించింది. తీవ్ర దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాన్ని (ఇపిఇపి) అత్యంత జాగరూకతతో, ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం వల్లనే ఇది సాధ్యపడింది. స్థానిక స్వపరిపాలనా సంస్థల భాగస్వామ్యంతో నాలుగు సంవత్సరాల డేటా ఆధారంగా 64,006 కుటుంబాలను గుర్తించి వారి అవసరాలను తీర్చడం జరిగింది. ప్రగతిశీల రాజకీయాలు, వికేంద్రీకృత పాలనపై ఆధార పడిన కేరళ అభివృద్ధి నమూనా సమర్ధతకు ఈ విజయం నిదర్శనం.

కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఆర్థికపరమైన యుద్ధం చేసినప్ప టికీ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధుల కొరత కలిగించినప్పటికీ కేరళ విజయాన్ని సాధిం చింది. పరిమితులు ఉన్నప్పటికీ రాజకీయ సంకల్పం, నిబద్ధత ప్రదర్శించడం ద్వారా వామపక్ష ప్రభుత్వం ఉన్నత సంక్షేమ ఫలితాలు సాధించగలిగింది. కాబట్టి ఈ విజయాన్ని అత్యంత ముఖ్యమైనదిగా చూడాల్సి ఉంటుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా కేరళ ప్రజలకు పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది. యుడీఎఫ్‌ను, బీజేపీ వంటి మతతత్వ శక్తులకు ఓడించాలని పిలుపునిచ్చింది. బీజేపీ ఇతర మతతత్వ శక్తులతో చేతులు కలిపిన విషయాన్ని యుడిఎఫ్‌ నిరూపించుకుంటోందని సీపీఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది.

ఇంధనంపై ప్రయివేటు గుత్తాధిపత్యం
రానున్న పార్లమెంట్‌ శీతాకాల సమా వేశాల్లో నూతన విద్యుత్‌ సవరణ బిల్లు- 2025ను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడా నికి కేంద్ర ప్రభుత్వం దూకుడుగా అడుగులు వేస్తోంది. ఆ రంగాన్ని ప్రయివేటీకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యుత్‌ రంగం యొక్క స్వభావాన్ని పూర్తిగా మార్చేసి, దానిని ఆర్థికంగా, లాభదాయకంగా నడిచే మార్కెట్‌గా రూపొందించడమే ఈ బిల్లు లక్ష్యం. బిల్లుకు ఆమోదం లభిస్తే వ్యవసాయ, గృహ వినియోగదారులకు భారీగా టారిఫ్‌ షాక్‌ ఇస్తుంది. రాష్ట్ర డిస్కమ్‌లు నిర్వీర్యమవుతాయి. జాతీయ ఇంధన సార్వభౌమత్వం ప్రయివేటు గుత్తాధిపత్యం చేతిలోకి వెళుతుంది. ఫెడర లిజం, జీవనోపాధి హక్కుపై ఈ బిల్లు నేరుగా దాడి చేస్తోంది. బిల్లులో చేసిన ప్రతిపాదిత మార్పులపై సీపీఐ(ఎం) ప్రజాభిప్రాయాన్ని సమీక రిస్తుంది. విద్యుత్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే పోరాటానికి నేతృత్వం వహిస్తున్న కార్మిక, రైతు సంఘాలకు మద్దతు ఇస్తుంది. ఈ పోరాటంలో చేయి కలిపి దానిని బలోపేతం చేయాలని సమాజంలోని అన్ని వర్గాలకూ పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది.

‘శ్రమశక్తి నీతి’తో కార్మికుల హక్కుల నిర్వీర్యం
కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘శ్రమ శక్తి నీతి’ ముసాయిదా యొక్క ప్రధాన లక్ష్యం కార్మికులకు లభిస్తున్న రక్షణలు, వాటిని అమలు చేసే యంత్రాంగాన్ని, ఉమ్మడి బేరసారాల హక్కులను నిర్వీర్యం చేయడమే. ఈ బిల్లు ‘మనుధర్మ శాస్త్రాల’ నుంచి ప్రేరణ పొందింది. ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర రాజ్యాంగంపై ప్రత్యక్షంగా దాడి చేస్తోంది. ఆర్థిక పరమైన ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని కార్పొరేట్‌ అనుకూల కార్మిక కోడ్‌లను అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను బలవంతం చేయడం ద్వారా సమాఖ్య నిర్మాణాన్ని కేంద్రం బలహీనపరుస్తోంది. లేబర్‌ కోడ్‌ల అమలుకు ఇది ఓ మోసపూరిత ప్రయత్నం. ప్రభుత్వ కార్పొరేట్‌, హిందూత్వ నిరంకుశ పాలనకు అనుగుణంగా దీనిని రూపొందించారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఉమ్మడి రాజకీయ ప్రాజెక్టు
పన్నెండు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని కొనసాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) అనేది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ల ఉమ్మడి రాజకీయ ప్రాజెక్ట్‌. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా అమలు చేస్తున్నారు. ఇది లక్షలాది మంది ఓటర్ల ఓటు హక్కును ఓ పద్ధతి ప్రకారం తొలగించేందుకు ఉద్దేశించ బడింది. వివాదాస్పదమైన బీహార్‌ ప్రక్రియ ఆధారంగా డాక్యుమెంటేషన్‌ను మరింత కఠినతరం చేసుకుంటూ, 2002 నాటి పురా తన బేస్‌లైన్‌ను ఉపయోగించుకొని దొడ్డిదారిన జాతీయ ఓటర్ల రిజిస్టరుగా (ఎన్‌ఆర్‌సీ) వ్యవహరించే ప్రయత్నం.

ఓటర్లను పాలక పార్టీకి అనుకూలంగా మార్చడం, సార్వత్రిక వయోజన ఓటు హక్కు పునాదులను దెబ్బ తీయడం దీని ఉద్దేశం. ఎన్నికల ప్రజాస్వామ్యం పై జరుగుతున్న అతి ముఖ్యమైన దాడిగా దీనిని చూడాల్సి ఉంటుంది. పౌరసత్వాన్ని నిర్ణయించే హక్కును లాక్కోవడానికి ఈసీఐ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా పార్టీ విస్తృత ప్రచారం చేస్తుంది. అప్రమత్తంగా ఉండాలనీ, నకిలీ ఓటర్లు ఓటరు జాబితాల్లో పేర్లు నమోదు చేసుకోకుండా చూసుకోవాలని ప్రజలను కోరింది.

పెరుగుతున్న దాడులు
దేశంలో మహిళలు, దళితులు, ఆదివాసీలపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో గత 11 సంవత్సరాల కాలంలో ఆయా వర్గాలపై దాడులు బాగా పెరిగాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో విడుదల చేసిన అధికారిక డేటా చెబుతోంది. ఈ దాడులు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలు ప్రచారం చేస్తున్న మనువాద భావజాలానికి ప్రతిబింబాలు.

దుస్థితిలో ఆర్థిక వ్యవస్థ
మన ఆర్థిక వ్యవస్థ సరిగా లేదని ఇటీవల విడుదలైన గణాంకాలు చెబుతున్నాయి. నిరుద్యోగం, ఉద్యోగావకాశాలు లేకపోవడం, వేతనాల్లో పెరుగుదల లేకపోవడం వంటివి ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరుస్తూ అమెరికా, ఈయూలతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకుంది. అమెరికా విధించిన సుంకాల కారణంగా మన ఎగుమతు లు 37.5శాతం పడిపోయాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోని పక్షంలో గతంలో బలమైన స్థానంలో ఉన్న రంగాల్లో కూడా మార్కెట్‌ వాటాను కోల్పోయే ప్రమాదం ఉంది.

స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా అమెరికాతో రక్షణ భాగస్వామ్యం
భారత్‌-అమెరికా దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన పది సంవత్స రాల సహకార ఫ్రేమ్‌వర్క్‌ నిబంధనలు మన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయి. అమెరికా ఆదేశాలకు మన సైనిక, విదేశాంగ విధానాలు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అమెరికాపై సాంకేతికంగా మరింతగా ఆధార పడాల్సి వస్తుంది. ప్రాంతీయ ఘర్షణ ప్రమాదం పెరుగుతుంది. చైనాను అడ్డు కోవ డం, అమెరికా నేతృత్వంలోని సైనిక నిర్మాణం లో మన దేశాన్ని అధికారికంగా కట్టిపడేయడం దీని ఉద్దేశమని ఒప్పందంలో స్పష్టంగా ఉంది.

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశాన్ని అమెరికా కబంధ హస్తాల్లోకి లోతుగా నెట్టివేస్తుండటాన్ని పొలిట్‌బ్యూరో ఖండిం చింది. దేశంలోని వివిధ రంగాల్లో అమెరికా వస్తువులకు విస్తృత మార్కెట్‌ ప్రవేశం కల్పిం చేందుకు ఉద్దేశించిన వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాల్సిందిగా మన దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ ఒత్తిడికి ప్రభుత్వం లొంగిపోతోందని వార్తలు వస్తు న్నాయి. మన ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఒప్పందంపై సంతకం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.

వెనిజులాకు సంఘీభావం
వెనిజులాపై సైనిక దాడిని ప్రారంభించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఆ ప్రాంతంలో 10 వేలకుపైగా సైనిక సిబ్బందిని మోహరించింది. అమెరికా సామ్రాజ్యవాదంతోనే వెనిజులాపై చర్యకు దిగుతోంది. అమెరికా దుందుడుకు యత్నాలను పొలిట్‌బ్యూరో ఖండించింది. వెనిజులా ప్రజలకు సంఘీభావం తెలిపింది.

గాజాలో కాల్పుల విరమణతో ఊరట
గాజాలో కాల్పుల విరమణ, ఇజ్రాయిల్‌ దాడులకు ముగింపు వంటి పరిణామాలు దీర్ఘకాలం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజలకు కొంత ఊరట కల్పించాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ ఉల్లంఘిస్తూనే ఉంది. ఇజ్రాయిల్‌ విషయంలో భారత ప్రభుత్వం తన విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దేశంతో రక్షణ, భద్రతా సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలి. పాలస్తీనాకు సంఘీభావం తెలియజేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -