71 లక్షల మంది ఓటర్లు తొలగింపు
తుదిజాబితా విడుదల
చెన్నై : తమిళనాడులో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్) 2026 తరువాత తుదిజాబితాను సోమవారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 5,67,07,380 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాను తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) అర్చన పట్నాయక్ విడుదల చేశారు. అంటే గత జాబితాతో పోల్చుకుంటే దాదాపు 71 లక్షల మంది ఓటర్లను అంటే 15 శాతం మందిని తొలగించారు. గతేడాది అక్టోబర్‌లో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రకారం 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. షోలింగనల్లూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 5,36,991 మంది ఓటర్లు ఉన్నారని, హార్బర్‌లో అత్యల్పంగా 1,16,896 మంది ఓటర్లు ఉన్నారని అర్చన పట్నాయక్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,77,38,925 మంది పురుష ఓటర్లు, 2,89,60,838 మంది మహిళా ఓటర్లు, 7,617 మంది ధర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో 5.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు దాఖలు చేయడానికి గతేడాది డిసెంబరు 19 నుంచి అవకాశం ఇచ్చారు. ఇది ఈ జనవరి 30 వరకూ కొనసాగింది. ఫిర్యాదులు స్వీకరించిన తరువాత తుదిజాబితాలో 27,53,796 మంది ఓటర్లను చేర్చారు. ఇదే సమయంలో 4,23,172 మంది ఓటర్లును తొలగించినట్లు అర్చన పట్నాయక్ తెలిపారు. తమిళనాడులో గతేడాది నవంబర్‌లో సర్ ప్రక్రియ ప్రారంభమయింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అన్ని పోలింగ్ కేంద్రాలనూ తుది జాబితా అందుబాటులో ఉంటుందని అర్చన పట్నాయక్ తెలిపారు. అలాగే, ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుందని అర్చన తెలిపారు. అర్హత కలిగిన ఓటర్లు ఫారమ్ 6ని సమర్పించడం ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునని, లేదా మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపారు. కాగా, ఈ నెల 26, 27 తేదీల్లో భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ తమిళనాడులో పర్యటిస్తారని, వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారని అర్చన పట్నాయక్ తెలిపారు.



