Wednesday, December 17, 2025
E-PAPER
Homeజాతీయంపశ్చిమ బెంగాల్‌లో సర్‌ ఎఫెక్ట్‌

పశ్చిమ బెంగాల్‌లో సర్‌ ఎఫెక్ట్‌

- Advertisement -

58 లక్షలకుపైగా ఓటర్ల పేర్లు తొలగింపు
ముసాయిదా జాబితా విడుదల చేసిన ఈసీ
ఓటర్ల తొలగింపుపై వారం రోజుల్లో విచారణ ప్రక్రియ


కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్‌) ఎఫెక్ట్‌ భారీగా కనిపించింది. దాదాపు 58లక్షలకుపైగా ఓటర్ల పేర్లను రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఎన్నికల కమిషన్‌ మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.. షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందుగానే ఈ జాబితాను ప్రచురించడం గమనార్హం. మృతి చెందడం, వలసలు, గణన ఫారంలు సమర్పించకపోవడం వంటి కారణాలతో 58 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సర్‌ ప్రక్రియకు ముందు 7,66,37,529 పేర్లు ఉండగా, ఆ తరువాత 7,08,16,631 మంది పేర్లు ఉన్నాయి. అంటే 58,20,898 మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఈ ముసాయిదా జాబితాను బూత్‌లు వారీగా, తొలగింపునకు గల కారణాలతో సహా పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వెబ్‌సైట్‌, ఎన్నికల కమిషన్‌ ఓటర్‌ పోర్టల్‌, ఈసీఐఎన్‌ఈటీ అప్లికేషన్‌లో అందుబాటులో ఉంచారు.

అలాగే తొలగించిన ఓటర్ల వివరాల జాబితాను సీఈవో వెస్ట్‌బెంగాల్‌ అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తొలగించిన ఓటర్లపై వారం రోజుల్లో విచారణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఎన్నికల సంఘానికి చెందిన ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ వారం రోజుల వ్యవధిలో విచారణ నోటీసుల ముద్రణ, సంబంధిత ఓటర్లకు వాటిని అందించడం, ఈసీ డేటాబేస్‌లో డిజిటల్‌ బ్యాకప్‌ సృష్టించడం వంటి పనులు జరుగుతాయని ఆ అధికారి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం సర్‌ ప్రక్రియను నిర్వహించారు. తొలగించిన పేర్లను, తొలగించిన కారణాన్ని ప్రత్యేక పోర్టల్‌ ద్వారా చూడవచ్చు. గణన ఫారంలు సమర్పించని కారణంగా ఎక్కువ శాతం ఓటర్ల పేర్లు తొలగించినట్టు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. అలాగే, ఒకటి కంటే ఎక్కువ బూత్‌ల్లో పేర్లు ఉండటం, వలస వెళ్లడం, జాడ తెలియకపోవడం, నకిలీ ఓటర్లు.. వంటి కారణాలతోనూ పేర్లు తొలగించినట్టు వెల్లడించింది.

గతవారంలో సీఈవో కార్యాలయం విడుదల చేసిన సమా చారం ప్రకారం జాబితాలో 24,16,852 మంది మృతి చెందినట్టు గుర్తిం చారు. 19,88,076 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లుగా గుర్తించారు. 12,20,038 మంది అదృశ్యం లేదా వారి రిజిస్టర్డ్‌ చిరునామాల్లో జాడ కనిపించడం లేదని గుర్తించారు. మరో 1.38 లక్షల మంది ఓటర్లు నకిలీ ఎంట్రీలుగా గుర్తించారు. మరో 1,83,328 మందిని ఘోస్ట్‌ ఓటర్లుగా గుర్తించారు. ఇతర సమస్యల కింద 57 వేల కంటే ఎక్కువ పేర్లను తొలగించారు. ఏదేమైనా సరే మొత్తంగా 58,20,989 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. అయితే పేర్లు తొలగించడంపై ఆందోళన వద్దని ఈసీ వెల్లడించింది. 2026 జనవరి 15వరకూ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. ముసాయిదా జాబితా తరువాత బాధితవ్యక్తులు డిక్లరేషన్‌ ఫారం, అవసరమైన డాక్యుమెంట్లతో ఫారం 6లో తమ క్లెయిమ్‌లను సమర్పిం చవచ్చునని ఈసీ అధికారి ఒకరు తెలిపారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల (బిఎల్‌ఓ) వద్ద కూడా ముసాయిదా జాబితాల హార్డ్‌ కాపీలు అందుబాటులో ఉంటాయని ఈసీ తెలిపింది.

అలాగే, రాష్ట్రంలో ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా వీటిని అందించారు. అయితే బెంగాల్‌లో నవంబర్‌ 4న సర్‌ ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 11న ముగిసింది.కాగా, ముసాయిదా జాబితాలో భారీగా పేర్లు తొలగించడంపై రాష్ట్రంలోని అధికార టీఎంసీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ, ఈసీ ఉమ్మడి కుట్రగా ఆరోపించింది. సుమారు రెండు కోట్ల మంది ఓటర్లను బెదిరిం చడానికి, వారి పౌరసత్వాన్ని ప్రశ్నించడానికి చేసిన ప్రయత్నంగా సర్‌ ప్రక్రియను అభివర్ణించింది. టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఫిబ్రవరి 14న తుది జాబితా ప్రచురించిన తరువాత ఈ విషయంపై తాము మాట్లాడుతామని బెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తెలిపారు. కాగా, మంగళవారం ప్రచురించిన ముసాయిదా జాబితాలో ఒక టీఎంసీ కౌన్సిలర్‌ మృతి చెంది నట్టుగా గుర్తించారు. దంకుని మున్సిపాలిటీలోని 18వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌ సూర్య పేరును జాబితా నుంచి తొలగించారు. సూర్య మృతి చెందినట్టుగా కారణం తెలిపారు. దీంతో సూర్య కొల్‌కతా సమీపం లోని ఒక శ్మశానవాటికకు వెళ్లి తన అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -