ఉచిత బస్సులతోనే సాధికారత రాదు : సుశీలాగోపాలన్ స్మారక సదస్సులో ది హిందూ డిప్యూటీ ఎడిటర్ శ్రీనివాసన్ రమణి
బీహార్‌లో 35లక్షల మంది మహిళల ఓట్ల తొలగింపు
వలసల సాకుతో అణచివేత
అక్టోబర్ విప్లవంతోనే రష్యాలో మహిళలకు ఓటు : రిటైర్డ్ జడ్జి రజని వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
భారత ప్రభుత్వం చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో రాజ్యాంగ హక్కులకు ప్రమాదం ఏర్పడిందని ది హిందూ ఆంగ్ల దినపత్రిక జాతీయ ఉప సంపాదకులు శ్రీనివాసన్ రమణి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క బీహార్‌లోనే రకరకాల కారణాలతో 65 లక్షల ఓట్లను తొలగిస్తే అందులో మహిళలవి 35 లక్షలు ఉన్నాయని గుర్తు చేశారు. వలసల సాకుతో మహిళల అణిచివేత కొనసాగుతున్నదని వ్యాఖ్యానించారు. తద్వారా సాధారణ ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులకు రక్షణ లేకుండా పోతున్నదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎస్‌వీకేలో సుశీలా గోపాలన్ స్మారక ట్రస్ట్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో ”భారతదేశంలో మహిళా ఓటర్లు: సవాళ్లు, మినహాయింపులు, ఓటింగ్ సరళి” అనే అంశంపై ఎనిమిదో సుశీలా గోపాలన్ స్మారకోపన్యాసం నిర్వహించారు.
దీనికి సుశీలా గోపాలన్ స్మారక ట్రస్ట్ చైర్‌పర్సన్ కీర్తి సింగ్ అధ్యక్షత వహించగా సుశీలా గోపాలన్ స్మారక ట్రస్ట్ కార్యదర్శి సుధా సుందరరామన్, ట్రస్టీ ఎస్.పుణ్యవతి, ఐద్వా తెలంగాణ ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మి పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసన్ రమణి మాట్లాడుతూ బీహార్‌లో విదేశీయులు ఎక్కువగా ఉన్నారంటూ భారత ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను చేపట్టిందని చెప్పారు. ఎక్కడ ఓటు ఉంటే అక్కడే వేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరిస్తున్నాయని గుర్తు చేశారు. చనిపోయారనీ, స్థానికం లేరనీ, వలసపోయారనీ, డూబ్లీకేటు ఓటర్లు ఉన్నారని మహిళలను రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించకుండా, హక్కును ఉపయోగించు కోకుండా చేస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 18 నుంచి 29 ఏండ్ల వయస్సున్న ఓటర్లల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారనీ, వారి ఓట్లను ఇష్టానుసారం తొలగిస్తున్నారని చెప్పారు. కుటుంబ ఆస్తుల తగాదాలు, అత్తింటికి వెళ్లడం కూడా కారణాలుగా చూపిస్తున్నారని వివరించారు. నిజానికి ఇలా జరగకూడదని అభిప్రాయపడ్డారు.
బీహార్ రాష్ట్రంలో జర్నలిస్టుల బృందం పర్యటించిన సందర్భంగా అనేక అక్రమాలు వెలుగు చూశాయని వివరించారు. నిరక్షరాస్యులుగా ఉన్న 40 నుంచి 50 శాతం మంది మహిళల దరఖాస్తులను ఈసీ తిరస్కరించినట్టు చెప్పారు. బీహార్‌తోపాటు ఝార్ఖండ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. కేరళలో మహిళల్లో అక్షరాస్యత ఎక్కువగా కాబట్టి అక్కడ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో సమస్యలు ఉన్నాయని అన్నారు. వలసలు పోయిన వారిలో పురుషులు ఎక్కువగా ఉంటే, తొలగించిన వారిలో మహిళలే ఎక్కువ ఉన్నారని వివరించారు. కేవలం ఉచిత బస్సు పథకాలతోనే మహిళల్లో సాధికారత రాదని గుర్తు చేశారు. తాత్కాలిక రుణ పథకాలు కాకుండా శాశ్వత ప్రాతిపతికన మహిళలకు ఉపాధి అవకాశాలు కేరళలోని కుటుంబ శ్రీ పథకం ద్వారా వస్తాయన్నారు. ఓటు హక్కును కోల్పోతున్నవారిలో పేదలు, మహిళలు ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని సీతారామ్ ఏచూరి ఎక్కువగా చెప్పేవారని గుర్తు చేశారు. మహిళల అవకాశాలు, హక్కులను హరిస్తున్న కేంద్రంతోపాటు భారత ఎన్నికల సంఘం చర్యలను ఖండించాలని చెప్పారు. సర్‌ను అడ్డంపెట్టుకుని దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఓటర్లను జాబితాలనుంచి తొలగించారని చెప్పారు.
విద్యార్థి దశనుంచే పోరాటాలు : సుధా సుందరరామన్
సుశీలాగోపాలన్ విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉన్నారని సుశీలాగోపాలన్ స్మారక ట్రస్టీ కార్యదర్శి సుధా సుందరరామన్ అన్నారు. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, హింసలో మహిళలతోపాటు పిల్లలు ఎక్కువగా బాధితులు అవుతున్నారని చెప్పారు. 1981లో సుశీలా ఐద్వాను జాతీయ సంఘంగా తీర్చిదిద్దారనీ, తనే మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని చెప్పారు. వర్కింగ్ క్లాస్ కోసం తీవ్రంగా శ్రమించినట్టు వివరించారు. త్రిశూర్ కార్మికుల సమస్యలపై ఉద్యమించారని చెప్పారు. శ్రామిక మహిళలు, అసంఘటిత రంగంపై పనిచేశారని అన్నారు. న్యాయపరమైన హక్కులు, పరిపాలన విషయాల్లో విశేష కృషి చేశారని చెప్పారు. మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు. కేరళలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన చరిత్ర సుశీలాగోపాలన్‌దని గుర్తు చేశారు. వరకట్నం సమస్యలపై ఐద్వా పనిచేసి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారని వివరించారు. సుశీలా సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఐద్యఉద్యమాల్లో దిట్ట సుశీలాగోపాలన్ : పుణ్యవతి
సుశీలాగోపాలన్ స్మారక ఉపన్యాసాలు దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో జరుగుతున్నాయని సుశీలాగోపాలన్ స్మారక ట్రస్ట్ ట్రస్టీ ఎస్.పుణ్యవతి అన్నారు. ఐద్వా జాతీయ మహాసభలు జనవరిలో ఉన్న కారణంగా ఈసారీ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భువనేశ్వర్, కేరళ, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చేపట్టినట్టు వివరించారు. సుశీలాగోపాలన్ ఉద్యమ బాధ్యతే కుటుంబ బాధ్యతగా భావించారని గుర్తు చేశారు. కేరళలో కొబ్బరి పీచు కార్మికులను చైతన్యం చేయడంలో సుశీలాగోపాల్ పాత్ర కీలమని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో మహిళ హక్కుల కోసం పోరాటం చేశారని చెప్పారు. ఐక్య ఉద్యమాలను నిర్మించడంలో దిట్ట అని అభిప్రాయపడ్డారు. వందన సమర్పణ చేసిన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ సర్‌తో కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్దిని పొందే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సీనియర్ నేత టి జ్యోతి, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి ఆఫీస్ బేరర్లు కెఎన్.ఆశాలత, బుగ్గవీటి సరళ, నాగలక్ష్మి, వినోద, వరలక్ష్మి, నాయకులు లక్ష్మమ్మ, పద్మ, సృజన పాల్గొన్నారు.
1917లోనే రష్యాలో మహిళలకు ఓటు హక్కు : రిటైర్ట్ జడ్జి టి రజని
1917లో సోవియేట్ రష్యా విప్లవంలోనే అక్కడ మహిళలకు పురుషులతోపాటు ఓటుహక్కును కల్పించారని రిటైర్డ్ జడ్జి టి రజని చెప్పారు. ఇది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందన్నారు. భారత్‌లో పోరాటం ద్వారా సాధించుకున్న మహిళల హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. అనిబిసెంట్, సరోజినినాయుడు మహిళల ఓటు హక్కు కోసం ఉద్యమించినవారిలో ఉన్నారని చెప్పారు. దశలవారీగా మహిళల ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చిందనీ, ఆతర్వాత పోటీచేయడానికి అవకాశం దక్కిందని వివరించారు. రాజకీయ స్వేచ్ఛకోసం మహిళలు విపరీతంగా శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు. 1951-52లో పూర్తిస్థాయిలో మహిళలతోపాటు వయోజనులందరికీ ఓటు హక్కు సాధించుకున్నారని చెప్పారు. రాజ్యాధికారానికి మహిళలు అర్హులయ్యారని చెప్పారు. విజ్ఞతతో ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందనీ, కులం, ప్రాంతం, మతం, డబ్బు, రాజకీయాలు, ఆర్థికాంశాలు ఓటును దెబ్బతీస్తున్నాయన్నారు. తద్వారా మహిళ అధికారం వీగిపోతున్నదని అభిప్రాయపడ్డారు. అన్నం, బట్ట, పుస్తకం అన్నీ రాజకీయమే అవుతున్నాయని గుర్తు చేశారు. ఓటుతో మహిళలకు సంబంధించి అన్నీ విషయాలు లింకై ఉన్నాయని చెప్పారు. ఓటును సవ్యంగా వేయడం ముఖ్యమని వ్యాఖ్యానించారు.



