Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుతెలంగాణలోనూ సర్‌ జరగాలి

తెలంగాణలోనూ సర్‌ జరగాలి

- Advertisement -

50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం
ఉపరాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ, బీఆర్‌ఎస్‌ను సంప్రదించలేదు
ఫలానా పనిచేస్తామంటేనే మద్దతు అనటం సరిగాదు
వేరేవాళ్ల మద్దతుతో అవసరమేంటి?
ఎన్డీయే కూటమి ఓట్లు చాలు
ఆర్‌ఎస్‌ఎస్‌ స్ట్రిప్టు బరాబర్‌ చదువుతా
తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం
సింగరేణి కార్మికులు కట్టే ఐటీని తిరిగి జమ చేస్తాం : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణలోనూ సర్‌ జరగాలనీ, ఓటర్ల ప్రక్షాళన జరిగితే ఒక్క హైదరాబాద్‌లోనే మూడు, నాలుగు లక్షల బోగస్‌ ఓట్లు పోతాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అంశం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బీహార్‌లో ఎన్డీయే కూటమికి అనుకూల పరిస్థితులున్నాయనీ, కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య సీట్ల పంచాయతీ నడుస్తున్నదని మంత్రి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధుల తో ఇష్టాగోష్టి నిర్వహించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు 50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో వైసీపీ మద్దతు అడగకున్నా వాళ్లే ముందుకొచ్చి మద్దతు ప్రకటించారనీ, తెలంగాణలో ఫలానా ఇస్తేనే, పనిచేస్తేనే మద్దతిస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు అనటం సరిగాదని అన్నారు. ఇప్పటి వరకూ మద్దతుపై ఆ రెండు పార్టీలనూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. తమకు వేరేవాళ్ల మద్దతు అవసరం లేదనీ, తొలి బీసీ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ గెలుపునకు ఎన్డీయే కూటమి ఓట్లు చాలని నొక్కి చెప్పారు. తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ఐడియాలజీ నుంచి వచ్చాననీ, ఆర్‌ఎస్‌ఎస్‌ స్క్రిప్టు బరాబర్‌ చదువుతానని స్పష్టం చేశారు.బీఆర్‌ఎస్‌లోని వాళ్లంతా వంద శాతం అవినీతిపరులనీ చెప్పలేదనీ, అన్ని పార్టీల్లోనూ మంచోళ్లు, అవినీతి పరులుంటారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే మంచోళ్లను తమ పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌ హయాంలోనూ ఫిరాయింపులు జరిగాయనీ, రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత అదే జరుగుతున్నదని తెలిపారు. గువ్వలబాలరాజు చేరిక ఫామ్‌హౌజ్‌ కేసుతో సంబంధం లేదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో యూత్‌ ఓటర్లు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. ఇతర పార్టీల నేతల చేరికలపైనే దృష్టి పెట్టకుండా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై ప్రణాళికాబద్ధం గా ముందుకెళ్తున్నామనీ, అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని చెప్పారు. జూబ్లీ ఉప ఎన్నికపై ఫోకస్‌ పెట్టి పనిచేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని మరోమారు డిమాండ్‌ చేశారు. తాము ఇష్యూ బేస్డ్‌గానే విమర్శలు చేస్తాముగానీ, ఇష్టమొచ్చినట్టు నేతలను తిట్టబోమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో శత్రువులం కాదు ప్రత్యర్థులమేనన్నారు. సిద్ధాంతపరంగా, సమస్యల మీద చర్చజరగాలిగానీ, పేగులు మెడలేసుకుం టా…బొంద పెడతా..ఏం పీకలేవు..ఇవేం మాటలు అని ప్రశ్నించారు.బ్లాక్‌ మార్కెట్‌లో ఎక్కువ రేటుకు యూరియా అమ్మకాలకు రేవంత్‌రెడ్డి సర్కారు అడ్డుకట్ట వేయాలని కోరారు. చైనా, రష్యా దిగుమతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామనీ, రామగుండం ఫ్యాక్టరీలో ఏర్పడిన టెక్నికల్‌ సమస్యను పరిష్కరించేందుకు విదేశాల నుంచి ఒక బృందం వచ్చిందని తెలిపారు. రామగుండంలోనూ త్వరలో యూరియా ఉత్పత్తి ప్రారభమవుతుందని చెప్పారు. జాంబియా, అర్జెంటీనా దేశాల్లో రేర్‌ మెంటల్స్‌ గనులు తవ్వి మన దేశానికి తరలించేందుకు ఆ దేశాలతో ఒప్పందాలు జరిగాయని చెప్పారు. మైనింగ్‌ చట్టాల్లో సంస్కరణ లు తీసుకురాబోతున్నామన్నారు. తెలంగాణలో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ పొడిగింపునకు, మెట్రో రెండో ఫేస్‌ విస్తరణకు, జాతీయ రహదారుల నిర్మాణాలకు, 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కేంద్రం సహకరిస్తున్న దని తెలిపారు. సింగరేణి కార్మికులు కట్టే ఐటీని తిరిగి వారి ఖాతాల్లో తిరిగి జమచేస్తామని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad