Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంధాన్యం కొనుగోలు చేయించండి సారూ

ధాన్యం కొనుగోలు చేయించండి సారూ

- Advertisement -

– పోలీసుల కాళ్లు పట్టుకున్న రైతులు
– రైస్‌మిల్లర్‌ ధాన్యం తరలించడంలేదని రాస్తారోకో
– వేరే వారిని కొననివ్వడంలేదని ఆవేదన
– పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-నసురుల్లాబాద్‌

తమ ధాన్యం కొనుగోలు చేయకుండా రైస్‌మిల్లు యజమాని అడ్డుకుంటున్నాడని.. వేరే రైస్‌మిల్లు వారిని సైతం కొననియ్యడం లేదని రైతులు ఆవేదన చెందారు. ధాన్యం తరలించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల కాళ్లు పట్టుకొని రైతులు వేడుకున్నారు. వివరాలిలా ఉన్నాయి..
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తాలో బోధన్‌-బాన్సువాడ ప్రధాన రహదారిపై శనివారం రైతులు పెద్దఎత్తున బైటాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరునెలల పాటు శ్రమకోర్చి పంట పండిస్తే కొనుగోలు చేసే సమయంలో అధికారులు, రైస్‌మిల్లర్లు మిలాకత్‌ అయి తమను మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. నసురుల్లాబాద్‌ సహకార సంఘం కార్యదర్శి శ్రీనివాస్‌ని, మండల పౌర సరఫరా శాఖ అధికారి షాంషోదీన్‌ని సస్పెండ్‌ చేయాలంటూ రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు చేయని సుగుణ రైస్‌ మిల్లును సీజ్‌ చేయాలని, యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.సుమారు రెండు గంటల పాటు రైతులు రోడ్డుపై బైటాయించడంతో ఇరు వైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ రాఘవేంద్ర అక్కడికి వచ్చి ఆందోళన విరమించాలని కోరగా.. రైతులు ససేమిరా అనడంతో బాన్సువాడ సీఐ తిరుపతయ్య, బీర్కూర్‌ ఎస్‌ఐ మహేందర్‌కు సమాచారం ఇచ్చారు. వారు సిబ్బందితో కలిసి వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. రైస్‌మిల్లు యజమాని తమ ధాన్యం అమ్ముకోకుండా అడ్డుకుంటున్నారని, ఆ రైస్‌మిల్లుకు ప్రభుత్వ ధాన్యం కేటాయించొద్దని రైతులు డిమాండ్‌ చేశారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌- తహసీల్దార్‌ వచ్చి హామీ ఇవ్వాలని భీష్మించుకూర్చున్నారు. తమ ధర్నాకు సహకరించాలని పోలీసుల కాళ్ల మీద పడి.. ధాన్యం కొనే విధంగా చూడండి సారూ.. అంటూ రైతులు వేడుకున్నారు. ఈ క్రమంలో ఓ రైతు పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. తోటి రైతులు అడ్డుకున్నారు. పోలీసుల సమాచారంతో తహసీల్దార్‌ సువర్ణ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. సుగుణ రైస్‌మిల్లు, గిరిధర్‌ రైస్‌మిల్లు నిర్వాహకులపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని, ధాన్యం కొనుగోలు చేసే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -