– పార్లమెంట్‌లో ప్రతిపక్షాల డిమాండ్
– 13వ రోజూ సమాధానమివ్వని కేంద్రం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై చర్చించా లనే డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళన బుధవారానికి 13వ రోజుకు చేరుకున్నది. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్లకార్డు పట్టుకుని నినాదాల హౌరె త్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఎటువంటి చర్చ లేకుండా మర్చంట్ షిప్పింగ్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనే ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ తొలుత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడగా, తిరిగి ప్రారంభమైన సభలోనూ ఆందోళన కొనసాగడంతో ఏకంగా గురువారానికి వాయిదా పడింది.
పార్లమెంట్‌లో ఎస్‌ఐఆర్‌పై చర్చించలేం: మంత్రి రిజిజు
పార్లమెంట్‌లో బీహార్ ఎస్‌ఐఆర్‌పై చర్చించలేమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఆయన లోక్‌సభలో మాట్లా డుతూ ఓటర్ల జాబితా సవరణ అంశంపై పార్లమెంట్‌లో చర్చించడం అంటే, అన్ని నియమాలను ఉల్లంఘించినట్టు అవుతుం దని ఆయన అన్నారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్ష ఎంపీలు సహకరించాలని ఆయన కోరారు. సభా కార్యక్రమాను అడ్డుకోరాదన్నారు. మనం చర్చించడం కోసం చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని, జాతీయ క్రీడా విధాన్ని తామేమీ ప్రవేశపెట్టడంలేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనేది వ్యక్తిగత వ్యవస్థ అని, సుప్రీంకోర్టులో ఆ కేసు ఉందని, ఆ అంశాలను పార్లమెంట్‌లో చర్చించలేమని మంత్రి రిజిజు అన్నారు. ఎస్‌ఐఆర్ అనేది ఎన్నికల కమిషన్ నిర్వహించే రాజ్యాంగ ప్రక్రియ అని, పార్లమెంటరీ చర్చకు లోబడి ఉండదని అన్నారు.
జవాబుదారీతనం నుంచి తప్పించుకోవటమే.. ప్రియాంక గాంధీ
బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రభుత్వం జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటుందని ఆరోపించారు. చర్చను నిర్వహించడానికి అధికార పార్టీ విముఖత వ్యక్తం చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షం చర్చ కోసం మాత్రమే అడుగుతోందని, ప్రభుత్వం కోరుకుంటే ఈ సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. ” అధికారపక్ష సభ్యులు అంత బలహీనంగా మారారా? వారు పార్లమెంటును నడపలేకపోతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించలేకపోతున్నారు” అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల సంస్కరణలపై చర్చించే ప్రాముఖ్యతను డీఎంకే ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. ప్రభుత్వం దానిని అనుమతించకపోవడాన్ని విచారకరమని అన్నారు.
మేం చర్చ జరపాలని కోరుతున్నాం : ఖర్గే
రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ”స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై చర్చ జరగాలని మేం కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ స్పీకర్, చైర్మెన్, ప్రభుత్వాన్ని చాలా ప్రశాంతంగా అడుగుతూనే ఉన్నారు. మా ఓట్లు దొంగలించకూడదు. ఓటర్ల జాబితాలోని అవకతవకలు, ఓట్ల దొంగతనం గురించి చర్చించడానికి మాకు సమయం కావాలని కోరుతున్నాం. పూర్తి చర్చ జరిగితే వారు ఎక్కడ తప్పులు చేసినా, రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో ఏమి చేసినా సమాధానం, సూచనలు ఇవ్వగలం. దేశ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా తమ హక్కులను కోల్పోతున్న ఓటర్లను మనం రక్షించగలం. 2023 జూలై 21న అప్పటి చైర్మెన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ సభకు ప్రతిదాని గురించి చర్చించే హక్కు కలిగి ఉంది. ఎవరి ఓట్లు కోతకు గురవుతున్నాయి? మైనార్టీ ఓట్లు కోతకు గురవుతున్నాయి. దళిత ఓట్లు కోతకు గురవుతున్నాయి. గిరిజన ఓట్లు కోతకు గురవుతున్నాయి. ఉపాధి హామీ కార్మికుల ఓట్లు కోతకు గురవుతున్నాయి, వలస కార్మికుల హక్కులను కోల్పోతున్నారు” అని అన్నారు.
పార్లమెంట్ ఆవరణలో ఆందోళన
పార్లమెంట్ ఆవరణలో బీహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. మంగళవారం పార్లమెంట్ ఆవరణంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేట్టారు. ప్లకార్డులు పట్టుకుని మోడీ ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాధీ, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, డీఎంకే ఎంపీ కనిమొళి ఇతర ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ వాయిదా పడిన తరువాత కూడా ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి.
ఎస్‌ఐఆర్‌పై చర్చించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES