Tuesday, November 25, 2025
E-PAPER
Homeజాతీయంసర్‌ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం

సర్‌ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం

- Advertisement -

కోల్‌కతాలో సీఈఓ కార్యాలయాన్ని ముట్టడించిన బీఎల్‌ఓలు
కోల్‌కతా :
తీవ్రంగా వున్న పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామంటూ పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న సర్‌ ప్రక్రియలో పాల్గొంటున్న బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) సోమవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సీఈఓ కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిం చారు. కార్యాలయాన్ని ముట్టడిస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులతో అక్కడ ఘర్షణ జరిగింది.
బీఎల్‌ఓ అధికార్‌ రక్షా కమిటీ సభ్యులు ఉత్తర కోల్‌కతాలోని కాలేజీ స్క్వేర్‌ నుండి ప్రదర్శన చేపట్టారు. ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వున్న కార్యాలయానికి తాళాలు వేస్తామంటూ సింబాలిక్‌గా వారు తాళాలు, సంకెళ్ళు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. సెంట్రల్‌ కోల్‌కతాలో గల సీఈఓ కార్యాలయంలోకి వెళ్ళేందుకు పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను తొలగించడానికి వారు ప్రయత్నించారు.
సర్‌ సందర్భంగా తీవ్ర స్థాయిలో, అమానవీయమైన పని ఒత్తిడి వుంటున్నదని ఫిర్యాదులు చేసినా ఎన్నికల అధికారి పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు విమర్శించారు. అందుకే తాము ప్రదర్శన చేపట్టాల్సి వచ్చిందని బీఎల్‌ఓలు చెప్పారు. రెండు మూడేండ్లకు పైగా పట్టే పనిని కేవలం ఇంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించడం సరికాదన్నారు. ఒత్తిడి తట్టుకోలేక చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇద్దరైతే ఆత్మహత్య కూడా చేసుకున్నారని కమిటీ విమర్శించింది.
నవంబరు 4న రాష్ట్రంలో ప్రారంభమైన సర్‌ ప్రక్రియ డిసెంబరు 4తో ముగియనుంది. డిసెంబరు 9న ముసాయిదా జాబితా ప్రచురించాల్సి వుంది. గడువు పొడిగించకపోయినా, దిద్దుబాటు చర్యలు తీసుకోకపోయినా నిరసనలు కొనసాగు తాయని కమిటీ హెచ్చరించింది.

మూడువారాల్లో 16 మంది మృతి
సర్‌ ప్రక్రియ చేపట్టిన రాష్ట్రాల్లో 16 మంది బీఎల్‌ఓలు చనిపోయారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తెలిపారు. మరో ఆరుగురు బీఎల్‌ఓలు ఆస్పత్రుల్లో ఉన్నారని వివరించారు. బీజేపీ చేతిలో కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారటంతో..ఓట్‌ చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -