Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeకథసిరిమువ్వ

సిరిమువ్వ

- Advertisement -

”ఓ వంద మువ్వలు కలిసి చేసే శబ్దం వినడానికి ఎంత బాగుంటుందో కదా! నిజానికి వాటికి కూడా ప్రాణం ఉంటే, ఎంత గొప్పగా మాటలాడగలవో అనిపిస్తుంది. అందులో ఒక్కటి సరిగ్గా శబ్దం చేయలేకపోయినా, మిగతా మువ్వల శబ్దంలో అది తేలిపోతుంది. ఒకవేళ అది కూడా తన భావాన్ని చెప్పాలనుకుంటే? అలా, అన్ని మువ్వల మధ్య తనకంటూ గుర్తింపు కోరుకునే ఒక సిరిమువ్వ కథే ఇది.
తన పేరు వెన్నెల. సాధారణంగా రాత్రిని కూడా ‘అందంగా’ మార్చేది వెన్నెల అంటారు. పుస్తకాల్లో, సినిమాల్లో కూడా వెన్నెల అంటే అందమే అనేలా రాస్తారు. అందుకేనేమో ఎవరు దానికి వంక పెట్టరు. కానీ ఈ వెన్నెల ఆడపిల్ల కదా, పైగా అందమే తన సమస్య. చిన్నప్పటి నుండి తనకు ఎదురైన చిన్న చిన్న సందర్భాల వల్ల తనని ఎవరు ఇష్టపడరు అని తనని తాను తక్కువ చేసుకుంటూ ఉండేది. ‘నేను అందరికి కనిపించే వెన్నెలని కాదు నిశీథి చాటున దాకున్న వెన్నెలని’ అని అనుకునేది. దానికి చాలా కారణాలు ఉన్నాయనుకోండి. చిన్నప్పటి నుండి తనకి కూచిపూడి డాన్స్‌ అంటే చాలా ఇష్టం. చాలా చోట్ల వాళ్ళ గ్రూపుతో కలిసి ప్రోగ్రామ్స్‌ ఇచ్చేవారు. తను మధ్యలో ఉండాలి, అందరు తనని గుర్తించాలి అని ఉండేది వెన్నెలకి. కానీ ఎప్పుడూ తనని వెనకాలే ఉంచేవారు. ఎందుకో వాళ్ళు చెప్పకపోయినా తనకి అర్ధమయ్యేది. అలాగే తన చుట్టూ ఉన్నవాళ్ళ ప్రేమకథల్లో కూడా తను ఎప్పుడు ఒక సైడ్‌ క్యారెక్టర్లానే ఉండేది. కానీ నాకంటూ ఒక ప్రేమకథ ఉంటే బాగుండు. రూపాన్ని కాకుండా తనలోని అందాన్ని చూసేవారు దొరికితే బాగుండు అని ఎప్పుడు అనుకుంటుండేది. అలా తన ప్రేమనంతా తనలోనే దాచుకునే వెన్నెలకి ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం. అతను ఎవరో కాదు వాళ్ళ డాన్స్‌ గ్రూపులో మెయిన్‌ లీడ్‌గా చేసే చైతన్య.
చైతన్య గురించి మాట్లాడుకునే ముందు మనం వెన్నెల ఫస్ట్‌ లవ్‌ దీపిక గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్‌ లవ్‌ ఎందుకన్నానంటే స్కూల్‌, కాలేజ్‌ ఆఖరికి డాన్స్‌ క్లాసులో కూడా ఇద్దరే తిరిగేవారు. అందుకే ఫ్రెండ్స్‌ కూడా సరదాగా లవర్స్‌ అని ఆడుకునేవారు.
ఇప్పుడు మన హీరో ఛైతన్య గురించి మాట్లాడుకుందాం. ఓ రోజు వెన్నెల, దీపిక ఇద్దరూ డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అప్పుడే వాళ్ళ అమ్మతో పాటు అక్కడికి వచ్చాడు చైతన్య. ”ఒసేరు.. న్యూ జాయినింగ్‌ అనుకుంటా చూడవే” అని అన్నది దీపిక. వెన్నెల మొదటిసారి చైతన్యని చూసింది అప్పుడే. తను బయటికి చెప్పలేకపోయింది గానీ, అదే తన లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. బండి దగ్గర నుంచి లోపలికి వచ్చేవరకు చైతన్యని అలానే చూస్తూ ఉండిపోయింది.
”చూడ్డానికి చాలా క్లాస్‌గా ఉన్నాడు. ఏ వెస్ట్రన్‌ డాన్సో నేర్చుకోకుండా కూచిపూడికి వచ్చాడంటే గ్రేటేనే” అని అన్నది దీపిక. వెన్నెల మాత్రం ఏమి మాట్లాడకుండా చైతన్యనే చూస్తూ ఉంది.
”నచ్చాడా” అని అన్నది దీపిక నవ్వుతూ.
”హే.. అలాంటిదేమి లేదు”
”తప్పేముందే. అంటే అబ్బాయిలకేనా లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. మనకు ఉండకూడదా” అని అన్నది దీపిక. ఈలోపే చైతన్య క్లాసులో జాయిన్‌ అయి, తిరిగి వెళ్లిపోతున్నాడు. అతను బయటికి వెళ్లిపోయేవరకు కండ్లద్దాల మధ్య నుంచి తొంగి తొంగి చూస్తోంది వెన్నెల. అలా మొదటిసారి మాటల్లేని పరిచయం ఏర్పడింది వెన్నెలకి, చైతన్యకి.
మరుసటి రోజు రాగానే, చైతన్యను అందరికీ పరిచయం చేశారు వాళ్ళ గురువుగారు. ‘చిన్నప్పటి నుంచే కూచిపూడి నేర్చుకుంటున్నాడు. వాళ్ళ డాడీకి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందట’ అని అన్నాడు. తర్వాత అందరూ ప్రాక్టీస్‌ చేసి పక్కన కూర్చున్నారు. ”ఏంటే అలా చూస్తున్నావు” అని అడిగింది వెన్నెల.
”వెళ్లి మాట్లాడుదామా” అని అన్నది దీపిక.
”నువ్వు వెళ్ళు, నేను రాను”
”నేను వెళ్లాం అన్నదే నీకోసం. నేను ఒక్కదాన్నే వెళ్లి ఏమి చేయను. మళ్ళీ నాకు కనెక్ట్‌ అయితే నీకే ప్రాబ్లెమ్‌” అని అన్నది నవ్వుతూ. కోపంగా చూసింది వెన్నెల.
”సరదాగా అన్నానే. నాకు తెలియదా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే నువ్వు ఎంత టైం తీసుకుంటావో, నీ ఇష్టం నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే మాట్లాడుదాం సరేనా” అని అన్నది దీపిక. నవ్వుతూ తల ఊపింది వెన్నెల.
వచ్చిన కొన్నిరోజుల్లోనే గ్రూపులో ఉన్న వాళ్లందరికీ ఫేవరెట్‌ అయిపోయాడు చైతన్య. వెన్నెల వాళ్ళు చేసే ప్రతి
ప్రోగ్రాంలో చైతన్యనే మెయిన్‌ లీడ్‌, కానీ అతని పక్కన మాత్రం రమ్య ఫిమేల్‌ లీడ్‌గా చేసేది. అందుకే రమ్య ఎప్పుడైతే చైతన్య పక్కన చేస్తుందో అప్పటి నుండి తనని ఒక విలన్‌లా చూసేది వెన్నెల. మాట్లాడటానికి వచ్చిన చిరాకు పడేది.
”పాపం దాన్ని ఎందుకే తిట్టుకుంటున్నావు. నీకు అంత ఇష్టం ఉంటే వెళ్లి మాట్లాడొచ్చుగా” అని అన్నది దీపిక.
ఆలోచనలో పడ్డది వెన్నెల. అందరిలానే చైతన్యతో మాట్లాడటమే కానీ ఎప్పుడూ సరిగ్గా మాట్లాడింది లేదు. అసలు నేనేంటో అతనికి కొంచెం కూడా తెలియదు. నా క్యారెక్టర్‌ ఏంటో తనకు తెలియాలంటే ముందు నేను మాట్లాడాలిగా! లేదంటే, అందరిలాగే తను కూడా నా రూపమే చూసి ఏదో ఒక నిర్ణయానికి వచ్చేస్తాడా? అని ఆలోచిస్తుంది వెన్నెల.
”నువ్వు ఇంకా ఆలోచించుకుంటూ ఉంటే తను నీ మొఖం కూడా చూడడు నీ ఇష్టం” అని అన్నది దీపిక.
”’నన్ను ఎవరు చూడకున్నా పర్లేదు” అని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది వెన్నెల.
”నేను అలా అనలేదే” అని దీపిక చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయింది. తన కోపం ఎంతోసేపు ఉండదు అని తెలుసు దీపికకి. ఇంతకుముందు కూడా ఎప్పుడైనా గొడవ అయినా తర్వాత ఇద్దరు మొఖం చూడగానే వెంటనే నవ్వుకునేవాళ్ళు. అందుకే మరుసటిరోజు ఉదయమే వెన్నెల వాళ్ళ ఇంటికి వెళ్ళింది దీపిక
”తొందరగా రావే టైం అవుతుంది” అని బయటి నుంచి అరుస్తుంది. వెన్నెల బయటికి వచ్చింది. సారీ అని దీపిక చెప్పేలోపే ‘సారీ’ అని చెప్పింది వెన్నెల. ఇద్దరు కలిసి డాన్స్‌ క్లాస్‌కి బయలుదేరారు.
”నువ్వు అన్నదే కరెక్టే, రాత్రి మొత్తం ఆలోచించిన. చైతన్యతో మాట్లాడటానికి నాకు హెల్ప్‌ చేస్తావా” అని అడిగింది వెన్నెల.
”అది నువ్వు అడగాలా… నా హెల్ప్‌ లేకుండా నువ్వు ఏమైనా చేసినవానే”
”V్‌ా్మ. లేటు అవుతుంది పదా” అని అన్నది వెన్నెల.
ఇద్దరు కలిసి డాన్స్‌ క్లాస్‌ లోపలికి వెళ్లారు. అందరు ఒకే దగ్గర రౌండుగా నిల్చొని ఏమో చూస్తున్నారు. దీపిక గబ గబా అక్కడికి వెళ్ళింది.
”చైతన్య బొమ్మలు కూడా గిస్తాడంటనే. తను వేసిన బొమ్మల్ని అందరికి చూపిస్తున్నాడు” అని వెన్నెలకి చెప్పింది. వెంటనే వెన్నెల కూడా అక్కడికి వెళ్ళింది. ఒకరి తరువాత ఒకరు ఆ పుస్తకాన్ని తీసుకొని చూస్తున్నారు. సరిగ్గా వెన్నెల చేతికి రాగానే వాళ్ళ గురువుగారు వచ్చారు. ”వెన్నెల.. క్లాస్‌ అయిపోయాక ఇస్తా” అని వెన్నెల చేతుల్లో నుంచి పుస్తకాన్ని తీసుకున్నాడు చైతన్య.
”పుస్తకానికే ఇంత ఓవర్‌ చేయాలానే. చేతుల్లో నుంచి తీసుకోవాలా, నా దగ్గరికి రాగానే ఏమైంది” అని కోపంగా దీపికకి చెబుతుంది.
‘అసలే ఇది మొదటిసారి ధైర్యం చేసి వెళ్తే హర్ట్‌ చేసిండు. ఇప్పుడు ఇది ఎంత ఫీల్‌ అవుతదో’ అని మనసులో అనుకుంటుంది దీపిక. క్లాస్‌ అయిపోగానే వెంటనే వెళ్ళిపోయాడు చైతన్య. వెన్నెలకి చాలా బాధ అనిపించింది.
”అతను నన్ను కనీసం అందరిలాగా కూడా చూడట్లేదే” అని బాధపడుతుంది.
”నువ్వు ఎక్కువ ఆలోచించకు. మరిచిపోయాడేమోనే, ఆ మాత్రం దానికే ఫీల్‌ అవ్వాలా” అన్నది దీపిక.
తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు. ఇన్ని రోజులుగా చైతన్య ఎప్పుడూ సరిగ్గా నా వైపు చూసిందే లేదు. అలాంటిది తన ఆలోచనల్లో నేను ఉండాలని ఆశపడటం కరెక్టేనా! అని దిగులుగా ఉంది.
అసలు మొదటిసారి చూసినప్పటి నుంచే నేనంటే ఇష్టం లేదేమో. నచ్చలేదు కాబట్టే నాతో మాట్లాడడానికి ఆసక్తి చూపించట్లేదేమో అని ఒకటే ఆలోచనలు. అప్పుడే వాళ్ల డాన్స్‌ గ్రూపులో ఒక మెసేజ్‌ వచ్చింది. ‘మరొక మూడు రోజుల్లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఒక పెద్ద ప్రోగ్రామ్‌ ఉంది. మనం కూడా వెళ్తున్నాం, అందరూ బాగా ప్రాక్టీస్‌ చేయండి’ అని.
ఉదయం క్లాస్‌కి వెళ్లగానే అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. రమ్య మాత్రం రాలేదు. ”ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల నేను రాలేకపోతున్నాను”’ అని గురువుగారికి ఫోన్‌ చేసి చెప్పింది. తను లేకపోతే ఇంకెవరు ఫిమేల్‌ లీడ్‌ చేస్తే బాగుంటుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. తనకు చేయాలని ఉన్నా వెన్నెల మౌనంగా కూర్చుంది.
మిగతావాళ్లు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుతున్నారు. ఈలోపే ”గురువుగారు వెన్నెల…” అని తనని చూపించాడు చైతన్య.
ఆ మాట వినగానే ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న నిశీథి అంతా తొలిగిపోయినట్టు అనిపించింది వెన్నెలకి. అసలు చైతన్య నా పేరు చెప్పడం ఏంటి? అంటే నన్ను ముందు నుంచి గమనిస్తున్నాడా అని సందేహంలో పడ్డది. కొద్దిసేపటి తర్వాత వెన్నెల దగ్గరకి వచ్చాడు చైతన్య. ”సారీ నిన్ను అడగకుండా నీ పేరు చెప్పినందుకు. నిన్న గురువుగారు నాతో చెప్పినప్పటి నుంచే నువ్వైతే పర్ఫెక్ట్‌ అనిపించింది. వచ్చినప్పటి నుండి నేను కూడా గమనిస్తున్నా నువ్వు చాలా బాగా డాన్స్‌ చేస్తున్నావు. మనం ఇద్దరం పెయిర్‌గా చేస్తే బాగుంటుంది అని అలా చెప్పాను” అన్నాడు.
ఎవరితో అయితే తను ఇన్నిరోజుల నుంచి ఒక్క మాటైనా మాట్లాడాలి అని అనుకుందో అతనే వచ్చి తన గురించి ఇంత మంచిగా మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటది. ఇంకా మాటలేం వస్తాయి.
”సారీనా.. మేమే థాంక్స్‌ చెప్పాలి నీకు. తనే అడగాలా వద్దా అని ఆలోచిస్తుంది” అన్నది దీపిక.
మెల్లిగా కొంచెం ధైర్యాన్ని పోగుచేసుకొని ”థాంక్యూ” అని చెప్పింది వెన్నెల. తర్వాత చైతన్య కొద్దిగా అటు వెళ్ళగానే వెంటనే దీపిక వైపు చూసింది. తన కన్నులు, మొఖం ఒక సిరివెన్నెలలాగా మెరుస్తున్నాయి.
”మేడం.. వెన్నెలగారు మురిసిపోయింది చాలు కొంచెం భూమి మీదకి రండి” అన్నది దీపిక.
”అతనేంటే సడెన్గా ఇలా మారిపోయాడు. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా నా గురించి ఎప్పుడూ అలా మాట్లాడలేదు కదనే” అని అన్నది వెన్నెల.
”మరి ఇప్పటికైనా అర్ధమయిందా, నిన్ను నువ్వే నెగటివ్‌లా అనుకుంటావు. నీ ఇన్‌సెక్యూరిటీతో నువ్వే చిన్న విషయాలని కూడా పెద్దవిగా ఉహించుకుంటావు. ఇప్పటి వరకు ఏదైతే నీ నెగటివ్‌ అని అనుకుంటున్నావో, అది నచ్చేకదా తను నిన్ను గమనిస్తున్నానన్నాడు. స్టేజ్‌ ముందు నేను ఉంటే చూడటానికి బాగుండదు అని నువ్వు అనుకున్నావు. కానీ తను మాత్రం, నిన్ను అడగకుండానే ‘నువ్వుంటే బాగుంటుంది’ అని అనుకున్నాడు. అందరితో చాలా ఫ్రీగా మాట్లాడే తను, నీతో మాట్లాడాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాడో గమనించావా? ఈ మాత్రం అర్థం చేసుకోలేమా? అందుకే, ఇప్పటికైనా నువ్వు నీ నెగటివ్‌ అనే విండో మూసేస్తే బాగుంటుందే” అని అన్నది దీపికఅదే రోజు రాత్రి. ఉదయం చైతన్య, దీపిక చెప్పిన మాటలు విన్న తరువాత చాలా కాలం నుంచి మోస్తున్న బరువుని దించేసినట్టు ఉంది వెన్నెలకి. తనలాగే చాలామంది ఈ సెల్ఫ్‌ డౌట్స్‌ పెట్టుకుని ముందుగా వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్‌ చేయడం మరిచిపోతున్నారు అని అనుకుంది.
ఆ తర్వాత రెండు రోజులు మాత్రం వెన్నెలకి ఎంతో ప్రత్యేకం, చైతన్యతో కలిసి ప్రాక్టీస్‌ చేయడం, తనతో ఇంకా దగ్గరగా ప్రయాణం చేయడం, అంతా కొత్తగా ఉంది వెన్నెలకి. మరుసటిరోజే హైదరాబాద్లో ప్రోగ్రాం. అందరూ రవీంద్రభారతికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో ప్రోగ్రాం మొదలవుతుంది. కొంచెం కంగారుగా ఉంది వెన్నెలకి. తను ఇంతకు ముందు చాలానే ప్రోగ్రాంలు చేసింది. కానీ ఈ సారి మాత్రం రెండడుగుల ముందుకు వేసి ప్రదర్శించాలి. ‘రెండు అడుగులే కదా!’ అని అనిపించొచ్చు. కానీ వెన్నెలలా తమని తాము తగ్గించుకొనే వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయం. అందరి దష్టి తన మీదే ఉండబోతుంది. అందుకే కొద్దిగా భయంపడుతూనే స్టేజ్‌ మీదకి వెళ్ళింది. తల ఎత్తి అందరివైపు చూడట్లేదు. కొద్దిసేపటికి సంగీతం మొదలవ్వగానే అన్నీ మరిచిపోయి డాన్స్‌ చేయడం మొదలుపెట్టింది. పెర్ఫార్మన్స్‌ ముగిసేసరికి, ఆడిటోరియం అంతా చప్పట్లతో నిండిపోయింది. లోపల ఎంతో మురిసిపోయింది వెన్నెల. ఎలాంటి సందేహం లేకుండా తాను తానుగా ధైర్యంగా అందరి ముందు నిలబడ్డానని ఎంతో సంతప్తిగా ఉంది వెన్నెలకి.
ప్రోగ్రాం అయిపోగానే అందరు రూంలోకి వెళ్లి డ్రెస్‌ చేంజ్‌ చేసుకొని కూర్చున్నారు. దీపిక దగ్గరకి వెళ్లి ఏమి మాట్లాడకుండా గట్టిగా హాగ్‌ చేసుకుంది వెన్నెల. తనకి తెలుసు తను వేసే ప్రతి అడుగులో దీపిక తనకి తోడుగా ఉందని. ”హే… వదలవే, దీనికే ఇంత చేస్తే ఇంక నేను చెప్పే విషయం తెలిస్తే నన్ను చంపేస్తావేమో” అని అన్నది దీపిక.
”ఏ విషయమే” అడిగింది వెన్నెల ఆశ్చర్యంగా.
”ఇన్నిరోజులుగా చైతన్య నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో నీకు ఇంకా డౌటే కదా. దానికి సమాధానం నా దగ్గర ఉంది” అన్నది దీపిక.
”అవునా! ఏంటో చెప్పవే త్వరగా” ఉత్సాహంగా అడిగింది వెన్నెల.
”ఒకరోజు చైతన్య తన డ్రాయింగ్‌ బుక్‌ నీకు ఇవ్వలేదు అని కోప్పడ్డావు గుర్తుందా?”
”హా.. గుర్తుంది”
”అది ఇప్పుడు నా దగ్గరే ఉంది. అందులో ఓ డ్రాయింగ్‌ ఉంది. అది కానీ నువ్వు చూసావనుకో నన్ను కాదు, వెళ్లి నీకు కావాల్సిన వాళ్ళని పట్టుకుంటావ్‌” అని అన్నది దీపిక నవ్వుతూ.
”అవునా… ప్లీజ్‌ తొందరగా ఇవ్వవే” అని బ్రతిమిలాడింది వెన్నెల.
కొద్దిసేపు ఆటపట్టించి చివరకు బుక్‌ ఇచ్చింది దీపిక. అందులోని చివరిపేజీలో కూచిపూడి డ్రెస్‌ వేసుకున్న తన చిత్రాన్ని చూసింది. పేజీ చివరన ”మై లవ్‌” అని రాసి ఉంది.
కొద్దిసేపటి క్రితం ఆడిటోరియంలో చప్పట్ల రూపంలో అందరూ చూపిన ప్రేమను తనలో నింపుకున్న వెన్నెల, ఆ చిత్రాన్ని చూడగానే ప్రేమతో గుండె నిండిపోయింది. ఆ ప్రేమంతా కన్నీళ్ల రూపంలో బయటికి వస్తున్నాయి.
”ఏంటే ఏడుస్తున్నవా… పిచ్చిదానా నువ్వు ఎప్పుడూ చెబుతుండే దానివిగానే… ‘నన్ను ఎవ్వరూ ప్రేమించారేమో’ అని. కానీ చైతన్య చూడు! నిన్ను దూరం నుంచే ఇంత ప్రేమించాడు. ఇప్పుడు ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, ఆ ప్రేమ మరింత పెరిగే ఉంటుంది”
కొద్దిసేపటికి కుదుటపడింది వెన్నెల. అందరూ తిరిగి వాళ్ళ ఊరికి వచ్చేసారు. బస్‌ దిగి చైతన్య వెళ్ళేటప్పుడు ”చైతన్య” అని పిలిచి తన డ్రాయింగ్‌ బుక్‌ ఇచ్చింది వెన్నెల.
ఆమె చేతిలో నుంచి బుక్‌ తీసుకున్న చైతన్య కంగారుపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత, ”ఈ బుక్‌ ఎందుకు తీసుకున్నావు? ఇందులో ఏమైనా చూశావా” అని అడిగాడు.
”నాకు కావాల్సింది మాత్రం కనిపించింది” అన్నది వెన్నెల.
కంగారుగా తన వైపు చూశాడు. వెన్నెల నవ్వుతూ ఉంది. వెంటనే బుక్‌ ఓపెన్‌ చేసి చివరి పేజీ చేసాడు. తను రాసిన ‘మై లవ్‌’ కింద ‘అందరిలా కాకుండ నన్ను కొత్తగా చూసినందుకు, అర్థం చేసుకున్నందుకు… ‘థ్యాంక్యూ మై లవ్‌’ అని రాసి ఉంది.
అలానే చూస్తూ ఉండిపోయాడు చైతన్య, మొఖం మీద చిరునవ్వు. అది చూసి వెన్నెల కూడా నవ్వుకుంటుంది. మెల్లగా వెన్నెల వైపు తల ఎత్తి చూసాడు. చైతన్య ఏమైనా చెప్తాడేమో అని ఎదురుచూస్తుంది వెన్నెల. ఒక్క అడుగు ముందుకు వేసి వెన్నెలకి దగ్గరగా వెళ్ళాడు. మాటల కన్నా కూడా ఆ మూమెంట్‌ని ఎంజారు చేస్తున్నారు ఇద్దరు. కొద్దిసేపు తర్వాత ”ఇలా మాట్లాడుతుంటే కొంచెం సినిమాటిక్‌లా అనిపిస్తుంది. నేను మొదట ఇక్కడికి వచ్చినప్పటి నుంచే నువ్వంటే ఇష్టం. ఎప్పుడైతే నీతో మాట్లాడటం మొదలుపెట్టానో అప్పుడు ఇంకా నీ మీద ఇష్టం పెరిగింది. అందుకే నువ్వు చూడాలనే దీపికకి ఆ బుక్‌ ఇచ్చి పంపించాను” అని అన్నాడు చైతన్య.
కోపంగా ఇద్దరి వైపు చూసింది వెన్నెల. ”అంటే మీ ఇద్దరు కలిసి నేనే ఓపెన్‌ అయ్యేలా చేసారా” అని అన్నది.
”లేదంటే.. నీతో పెట్టుకుంటే ఇంకా ఎన్నిరోజులైనా ఈ విషయం అసలు ముందుకు వెళ్లేదానే” అని అన్నది దీపిక.
ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటున్నారు.
అలా వెన్నెల కోరుకున్నట్టే తన జీవితంలో కూడా ఒక ప్రేమకథ మొదలైంది.
– రమేష్‌ మాండ్ర, 8555929026

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad