Saturday, January 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫోన్‌ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

- Advertisement -

మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, లింగయ్యలకు నోటీసులు
ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి, ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు కుమారుడికి కూడా..
విచారణకు రావాలంటూ సీఎం సోదరుడు కొండల్‌రెడ్డికి సైతం జారీ
నేడు విచారించే అవకాశం

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో దూకుడు పెంచిన సిట్‌ అధికారులు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి సోదరుడు కొండల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్‌రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు కుమారుడు సందీప్‌లకు కూడా తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సిట్‌ అధికారులు నోటీసులు పంపారు. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును విచారించాక రెండు రోజులు విరామం తీసుకున్న సిట్‌ అధికారులు.. ఈ కేసులో రాజకీయ కోణం నుంచి కూడా విచారణను ప్రారంభించినట్టు తెలిసింది. ఒకరోజు ముందు ఎమ్మెల్సీ నవీన్‌రావును విచారించిన అధికారులు తాజాగా జైపాల్‌యాదవ్‌, చిరుమర్తి లింగయ్యలను విచారించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఉన్న అధికారులతో వీరిద్దరికి ఉన్న సంబంధాలపై సిట్‌ అధికారులు క్షుణ్ణంగా ఆరా తీయనున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో బాధితుడైన ముఖ్యమంత్రి సోదరుడు కొండల్‌రెడ్డి నుంచి కూడా మరింత సమాచారాన్ని తీసుకునే అవకాశమున్నదని సమాచారం. కొండల్‌రెడ్డి వద్ద ఈ వ్యవహారానికి సంబంధించి పలు కీలకాంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. ఇక నవీన్‌రావు తండ్రి కొండల్‌రావు, ఎమ్మెల్యే కృష్ణారావు కుమారుడు సందీప్‌ల నుంచి కూడా జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంపై తమకు అవసరమైన సమాచారాన్ని తీసుకోవడానికి అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేసుకొని ఉన్నారని సమాచారం. నిజానికి వీరిద్దరు కూడా బుధవారమే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, కారణాంతరాల వల్ల తాము గురువారం వస్తామని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -