Tuesday, January 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహరీశ్‌రావుకు సిట్‌ నోటీసులు

హరీశ్‌రావుకు సిట్‌ నోటీసులు

- Advertisement -

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు
నేడు విచారణకు హాజరు కావాలన్న అధికారులు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ డిప్యూటీ లీడర్‌ హరీశ్‌రావుకు సిట్‌ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఇప్పటి వరకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుతో పాటు మరికొందరు అధికారులు, బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను విచారించిన సిట్‌ అధికారులు తాజా నోటీసుతో తమ అస్త్రాలను బీఆర్‌ఎస్‌ అగ్రనేతలపై ఎక్కుపెట్టినట్టయ్యింది. గతంలో ఈ కేసుకు సంబంధించి ఐ ఛానెల్‌ సీఈఓ శ్రవణ్‌రావును విచారించిన సమయంలో వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకొని హరీశ్‌రావును విచారించడానికి సిట్‌ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సిట్‌కు నాయకత్వ వహిస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌ వి.సి సజ్జనార్‌ నేతృత్వంలోని అధికారుల బృందం హరీశ్‌రావును నేరుగా విచారించనున్నట్టు తెలిసింది. కాగా పంజాగుట్ట పోలీస్‌లో నమోదైన ఫోన్‌ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవలనే హరీశ్‌రావుకు ఊరటనిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే సిట్‌ దర్యాప్తు జరుపుతున్న ఫోన్‌ట్యాపింగ్‌ విషయంలో మాత్రం అధికారులు హరీశ్‌రావు పాత్రకు సంబంధించి విచారణలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుతో పాటు మరికొందరు అధికారులను విచారించిన సమయంలో ఫోన్‌ట్యాపింగ్‌కు ప్రేరణనిచ్చిన అప్పటి బీఆర్‌ఎస్‌ అగ్రనాయకులు ఎవరు అనే విషయమై దర్యాప్తు అధికారులు ఆరా కూడా తీశారు.

ప్రస్తుతం హరీశ్‌రావును విచారణకు పిలిచిన అధికారులు.. అవసరమైతే శ్రవణ్‌రావు, ప్రభాకర్‌రావులను కూడా పిలిచి హరీశ్‌రావుతో కలిపి విచారించే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు సైతం ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్‌ ఇచ్చినంత మాత్రానా అవసరమైతే పిలిచి, ఆయనను విచారించవచ్చు అని సిట్‌కు సూచించిన విషయం కూడా తెలిసిందే. సిట్‌ ఇచ్చిన తాజా నోటీసు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో కలకలం రేపింది. కాగా నోటీసు ఇచ్చినంత మాత్రానా వెంటనే హరీశ్‌రావు విచారణకు వెళ్లారా? లేక తనకు ఏదైనా అధికారిక కార్యక్రమం ఉందని తెలిపి విచారణను వాయిదా వేయాలని కోరతారా? లేక సిట్‌ ఇచ్చిన నోటీసును న్యాయస్థానంలో సవాలు చేస్తారా? అనే అనుమానాలు కూడా మరోవైపు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మంగళవారం ఉదయం హరీశ్‌రావు తీసుకునే నిర్ణయాన్ని బట్టి సిట్‌ అధికారుల తదుపరి చర్యలుంటాయని తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -