పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం
నవతెలంగాణ – పరకాల
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలకు, అధికార మదానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ధర్మారెడ్డి విమర్శించారు.
తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్‌పై కక్ష సాధింపులకు దిగుతోందని ఆయన ఆరోపించారు. “పాలన చేతకాక, ప్రతిపక్ష గొంతు నొక్కడమే ఈ ప్రభుత్వ అజెండాగా మారింది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన కేసీఆర్‌ను ఇటువంటి నోటీసులతో భయపెట్టాలనుకోవడం కాంగ్రెస్ భ్రమ అని చల్లా స్పష్టం చేశారు. కేసీఆర్ నిజాయితీపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది.రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు, విచారణలతో వేధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు.
కేసీఆర్‌ను తాకడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఇలాంటి కుతంత్రాలను సహించబోరని, ప్రభుత్వ వేధింపులపై గట్టి ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.



