Saturday, March 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఘనంగా సీతారాముల కళ్యాణం

ఘనంగా సీతారాముల కళ్యాణం

- Advertisement -

పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు
రూ.351 కోట్లతో ఆలయ తొలిదశ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన
హాజరైన మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల, సురేఖ, శ్రీహరి
భద్రగిరికి పోటెత్తిన భక్తులు..కిక్కిరిసిన మిథిలా స్టేడియం
నేడు శ్రీరామ పట్టాభిషేకం..హాజరుకానున్న గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / భద్రాచలం
భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి, గీత దంపతులు తానీషా కాలం నాటి ఆనవాయితీని కొనసాగిస్తూ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను కళ్యాణ క్రతువు నిమిత్తం సమర్పించారు. దీనికి ముందు సీఎం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం రూ.586 కోట్లతో చేపట్టే ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా రూ.351 కోట్లతో పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, దనసరి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గోదావరి పుష్కరాల నాటికి తొలి దశ పనులను పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా ప్రకటించారు.

మిథిలా స్టేడియం కళ్యాణ శోభితం
భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతారామస్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలలు, వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల తర్వాత శంకు, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతారామ, లక్ష్మణ సమేతంగా ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి కల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింప చేశారు. భక్త రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చల హారం రామయ్యకు అలంకరించారు. లక్ష్మణుడికి రామమాడ ధరింపజేశారు.

చైత్రశుద్ధ నవమి అభిజిత్‌ లగ ముహూర్తం రాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచారు. అనంతరం శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహించి, ఆ తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోశారు. సీతారాములకు తాత్కాలిక నివేదన ఇచ్చి, బ్రహ్మముడి వేసి మంగళహారతి అందించారు. తర్వాత సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచలం వీధుల్లో ఊరేగించి ఆలయంలోనికి తీసుకెళ్లారు. శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. దీనికి రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లా హాజరుకానున్నారు.

ఆలయ పునరుద్ధరణ కానుక..
ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించటం ఆనవాయితీ. ఈసారి వీటితో పాటుగా రూ.351 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టడంపై అర్చక స్వాములు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ‘1950-58 మధ్యకాలంలో తొలిసారి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. 1954లో పునరుద్ధరణ సంఘం ఏర్పాటైంది. 1968లో పునరుద్ధరణకు సంబంధించిన ఆవిష్కరణలు చేశారు.

తిరిగి మళ్లీ ఇప్పుడు రూ.586 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి సకల శుభాలు కలగాలి’ అని అర్చకులు ప్రకటించారు. ఈ నిధులతో టెంపుల్‌ కాంప్లెక్స్‌ విస్తరణ, అదనపు పుష్కరఘాట్లు వంటివి ఏర్పాటు చేస్తారు. కాగా, రూ.351 కోట్లతో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ విస్తరణ తొలిదశ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. దీనిలో భాగంగా రూ.75 కోట్లతో గోదావరి ఘాట్‌ అభివృద్ధి, రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ.96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి పనులు నిర్వహిస్తారు.

అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు
సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతోపాటు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం మిథిలా స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించారు. వేసవి కావడంతో కల్యాణ వేదిక దగ్గర పందిళ్ల కిందట మిస్ట్‌ ఫాగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. పట్టణంలో ప్రధాన రహదారి నుంచి ఆలయ ప్రాంగణం వరకు చలువ పందిళ్లు వేశారు. తోరణాలు, విద్యుత్‌ వెలుగులతో రామాలయ పరిసరాలను అలంకరించారు. భారీగా వచ్చిన భక్తులు శ్రీ సీతారామ చంద్రస్వామి దర్శనం కోసం బారులు తీరారు. భక్తుల కోసం అన్న ప్రసాదం, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, ఎస్పీ రోహిత్‌ రాజ్‌, ఐడీడీఏ పీఓ బి. రాహుల్‌ నేతృత్వంలో సుమారు 4000 మందికిపైగా సిబ్బంది భక్తులకు ఆసౌకర్యం కలగకుండా చూసుకున్నారు.

వీరిలో 2వేల మంది పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌, సీఎం సలహాదారు, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఎండోమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజా అయ్యర్‌, ఎండోమెంట్‌ కమిషనర్‌ హన్మంతరావు, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్‌, సబ్‌ కలెక్టర్‌ మణాల్‌ శ్రేష్ఠ, మంత్రి పొంగులేటి సతీమణి మాధురి, భట్టి సతీమణి నందిని, ముఖ్యమంత్రి కూతురు, అల్లుడు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గోదావరి పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తి : దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
గోదావరి పుష్కరాల నాటికి ఆలయ తొలి దశ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శ్రీ సీతారాముని కళ్యాణ మహోత్సవం అనంతరం మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి ప్రాముఖ్యత ఉందని, దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వారి కళ్యాణాన్ని వీక్షిస్తారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో సంవత్సరం మంత్రిగా తాను ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం, స్థానిక మంత్రుల సహకారంతో స్థానికంగా భూ సేకరణ చేశామన్నారు. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో మొదటి విడత పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి మొదటి విడత పునరుద్ధరణ పనులు పూర్తి చేసి.. కృష్ణా పుష్కరాల నాటికి మిగిలిన రెండు విడతల పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -