భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటి రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టే నేటి సీతారామ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే జలాలు భద్రాద్రి వాసులకు, వ్యవసాయదారులకు అందకుండా తరలిపోతు న్నాయనే రైతాంగం పడే ఆవేదనలో అర్థం ఉంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు, రిజర్వాయర్ లేదు అయినా రాష్ట్ర మంత్రివర్యులు గోదావరికి గండి కొట్టి ప్రధాన కెనాల్‌లోకి నీళ్లు విడుదల చేసి పంపు హౌస్‌ల ద్వారా ఏన్కూర్‌లో ఉన్న ఎన్‌ఎస్పీ కెనాల్‌లో కలిపారు. ప్రాజెక్టు పూర్తయినట్లు, నీళ్లు వ్యవసాయ భూములకు ఇస్తున్నట్లు స్వయాన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి వీకే రామవరం పంప్ హౌస్‌నుండి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని, ప్రజానీకాన్ని భ్రమలకు ఉసిగొలిపిన విషయం ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నది.
ములకలపల్లి మండలం, వికెరామవరం, పూసుగూడెం మధ్యలో మాదారం వద్ద కెనాల్‌పై నిర్మించిన బ్రిడ్జి ఒక పిల్లరు కూలిపోయి దాదాపు ఏడాది గడిచింది. దీన్ని అధికారులు పట్టించుకోకుండానే ట్రయల్‌రన్‌్ కోసం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ప్రధాన కాలువ ద్వారా నిరంతరాయంగా తొమ్మిది వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవాహంలో ఉంటాయి. కానీ ట్రయల్ రన్‌్‌లో 400 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేస్తేనే పిల్లర్ కూలిపోయింది. కూలిన పిల్లర్ దగ్గరలోనే కెనాల్‌కు రెండు వైపులా నిర్మించిన రక్షణ గోడలు నెర్రెలు బారి పగుళ్లు వస్తున్నాయి. ఎక్కడికి అక్కడ పెచ్చులూడి కెనాల్‌లో పడుతున్నాయి. ఇవన్నీ గమనించకుండా ప్రభుత్వం, అధికారులు తమ పని తాము చేసుకుపోతూ తప్పుడు సమాచారమిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేకుండానే ప్రభుత్వం ప్రచార జోరును సాగిస్తున్నది. మరో కాళేశ్వరంలా సీతారామ ప్రాజెక్టు నిరంతర సమస్యలతో ‘నీట’ మునుగుతున్నది. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు తప్ప బాధ్యులెవరో తేల్చడం లేదు. ఇప్పటికే ఆ పిల్లర్ పున:నిర్మాణం చేయలేదు. సీతారామ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తూ, భద్రాద్రి జిల్లా వ్యవసాయ భూములకు చుక్కనీరు రాదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే జిల్లాలో నీటిని నిల్వ చేయడం కోసం ప్రతిపాదించిన రిజర్వాయర్లు రీడిజైన్‌లో ఎత్తివేశారు. రోల్లపాడు, రిజర్వాయర్ పది టీిఎంసీలు, కిన్నెరసాని, తుమ్మల చెరువు, టేకులచెరువు, సింగభూపాలెం, మూకమామిడి గుండ్లవాగు వంటి పెద్ద చెరువులకు నీళ్లు రాకుండా జిల్లా రైతాం గానికి సాగు, తాగునీరు రావడం అసాధ్యం. ఈ ప్రాజెక్టు పొడవునా ఎక్కడా కూడా ఇంటర్నల్ (పిల్ల కాలువలు) తీయ లేదు, నిధులు కేటాయించలేదు. భూసేకరణ జరగలేదు? రైతాంగంతో చర్చలు జరపలేదు? టెండర్లు పిలవలేదు? ఇక వ్యవసాయ భూములకు నీళ్లెలా వస్తాయి? అందుకే భద్రాద్రి రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
2003లో సీపీఐ(ఎం) నేత, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో సాగిన మహాప్రస్థానం పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. నినాదం ”దుమ్ముగూడెం నీళ్లు పాలేరులో కలుపుదాం.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేద్దాం” కొనసాగింపుగా వెయ్యి మందితో 2012లో మహారైతు పాదయాత్ర కూడా నిర్వహించారు. ఫలితంగా సీతారామ ప్రాజెక్టుకు పాలకులు పునాదిరాయి వేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అశ్వాపురం మండలంలో గోదావరి నదిపై సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా అశ్వాపురం, మణుగూరు మండలాల్లో 54కి.మీ దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో 57 కి.మీ పొడవున నదితీరం వెంట కరకట్ట నిర్మాణం చేపట్టారు. సుమారు 15శాతం పనులు పూర్తయిన తర్వాత జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జిటి) అభ్యంతరంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కరకట్టల నిర్మాణం ఆగిపోయింది. నదీతీరంతో పాటు ప్రాజెక్టు పరిధిలో గోదావరిలో కలిసే వాగుల తీరాల వెంట కరకట్టలు నిర్మించాల్సి ఉంది. బ్యారేజీ వద్ద 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పవర్ హౌస్ నిర్మాణం చేపట్టాలి. దీని పనులు ఇంకా మొదలు కాలేదు. సీతమ్మసాగర్ పూర్తయితే సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 67 టీఎంసీల నీటిని భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల భూము లకు నీరందించవచ్చు. వరదల సమయంలో నీటిని నియంత్రించి, దిగువ ప్రాంతాల్లో ఉధతిని తగ్గించవచ్చు. భద్రాచలం రామాలయానికి సమీపంలో ఉండటంవల్ల పర్యాటక ఆకర్షణగా నిలవనుంది. నీటినిల్వ సామర్థ్యం పెరగటం వల్ల భూగర్భ జలాలు పెరిగి పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుంది. బ్యారేజీ కుడివైపు నిర్మించే జల విద్యుత్ కేంద్రం పునరుత్పాదక ఇంధనంగా పనిచేస్తుంది.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఎస్‌ఎల్‌ఐఎస్) గుర్తింపు పొందింది. తొమ్మిదేళ్ల క్రితం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. గోదావరి నుంచి 67 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది సంకల్పం. అయితే డిజైన్లు, డిపిఆర్‌ను మార్చి, ప్రజలను ఏమార్చి ప్రాజెక్టు లక్ష్యానికి విరుద్ధంగా నీటిని తరలించుకుపోతున్న తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పి) ఎడమ కాల ద్వారా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో దాదాపు మూడు లక్షల ఎకరాలకు, సూర్యాపేట నుండి పాలేరు వరకు ఒకటో జోన్‌లో యాభైవేల ఎకరాలు, పాలేరు నుంచి కల్లూరు వరకు జోన్ రెండులో 2.50 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందుతుంది. ఇదంతా కష్ణాబేసిన్ పరిధిలోకి వస్తుంది. సాగర్ నీరుతో ప్రస్తుతం జిల్లాలో డెబ్బయి శాతం భూములు సస్యశ్యామలంగా మారాయి. కానీ చెంతనే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి బేసిన్‌లో ఉండటంతో సాగర్ నీరందే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమగ్ర అభివద్ధికై సాగిన పాదయాత్ర ఒత్తిడి ఫలితంగా అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం గోదావరి జలాలపై దష్టి పెట్టింది. సాగర్ నీరందించడానికి దుమ్ముగూడెం వద్ద రాజీవ్ సాగర్, రుద్రంకోట వద్ద ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించాలని అప్పుడు లక్ష్యం. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడగా అదే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీలోని పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలో కలిసిపోయాయి. ఇందిరాసాగర్ తలపెట్టిన ప్రాంతం విలీన మండలాల్లో ఉండటంతో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను కలిపి కొత్త ప్రాజెక్టుగా డిజైన్ చేసి ”సీతారామ ఎత్తిపోతల పథకంగా” కేసీఆర్ ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చింది. దీనిద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించడం. మరో సుమారు నాలుగు లక్షల ఎకరాలను స్థిరీకరించడం లక్ష్యంగా పెట్టు కున్నారు. అంచనా వ్యయం వేల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజైన్లు, రీడిజైన్లు జరిగిపోయాయి.
2016లో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగా 2018 వచ్చేసరికి సీన్ మారిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం, మహ బూబాబాద్ జిల్లాలకు గోదావరి జలాలను అందించే ఫేస్ 1 డిజైన్ పక్కకు పోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి-కష్ణా జలాల అనుసంధానం అనే పేరుతో మొదటి ప్రాధాన్యతగా ఏన్కూర్ రాజీవ్ లింకు కెనాల్‌పై దష్టి పెట్టి ఆగ మేఘాలపై పూర్తి చేశారు. నీటిని ఏన్కూరు లింకు కెనాల్‌కు తరలించి, వైరా రిజర్వాయర్‌ను నింపేందుకు, అలాగే పాలేరు రిజర్వాయర్‌ను నింపేందుకు ప్రణాళిక రూపొందించి భూసేకరణ పూర్తి చేశారు. కానీ నిర్వాసితులకు ఒక్క పైసా నష్టపరిహారం చెల్లించలేదు. ఈ రెండు రిజర్వాయర్లు కష్ణ బేసిన్ పరిధిలో ఉంటాయి. ఏన్కూరు లింక్ కెనాల్‌తో వైరా ఆయకట్టు, పాలేరు ఆయకట్టు, స్థిరీకరణ మార్గం ఏర్పడింది. ఇవి పూర్తయితే సంపూర్ణంగా సాగర్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. తద్వారా సాగర్ నుంచి కష్ణా జలాలు విడుదల కాకున్నా సీతారామ ద్వారా గోదావరి జలాలను తరలించి పంటలను సాగుచేసుకోవచ్చు. కానీ సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా ఆంధ్రా ప్రాంతానికి నీటిని తరలించే కుట్ర జరుగుతున్నది.
సీతారామ ప్రాజెక్టులో దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను తరలించడానికి అశ్వాపురం మండలంలో అనేకచోట్ల వరుసగా పంపు హౌస్‌లను ఏర్పాటు చేశారు. కొన్ని మండలాల ద్వారా తవ్విన మెయిన్ కెనాల్ సింగరేణి మండలంలో చీమలపాడు వద్ద ప్రతిపాదిత రోళ్లపాడు చెరువు వైపు మళ్లాలి. రోళ్లపాడును బాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ప్రతిపాదించారు. ఇక్కడి నుంచి పలు పంపుహౌజ్‌ల ద్వారా భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలలోని సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. రీడిజైన్ వల్ల భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా బీడు భూములకు చుక్కనీరందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. రోళ్లపాడు వైపు అటవీ శాఖ భూములు, గుట్టలు, కొండలు ఉన్నాయని, పనులు జాప్యమవుతాయనే సాకుతో కాలువ తవ్వకం, పంపుహౌస్‌ల నిర్మాణ పనులాపారు.
దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 106 కి||మీ పొడవైన మెయిన్ కెనాల్ ద్వారా ప్రవహించే ఏన్కూర్ లింకు కెనాల్‌లో కలుస్తాయి. మెయిన్ కాలువ కోసం ప్రభుత్వం వేలాది ఎకరాలను రైతుల నుంచి సేకరించి తమ భూములగుండా గోదావరి జలాలను తరలిస్తూ తమకు చుక్క నీరివ్వకపోవడం ఏం న్యాయ మని భద్రాద్రి జిల్లా రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఖర్చుచేసిన రూ.పదకొండు వేల కోట్లతో ఎవరికి మేలు జరిగిందని వారు నిలదీస్తున్నారు.
భద్రాద్రి జిల్లా వ్యవసాయ భూములు తెలంగాణలో భాగం కాదా? అని అడుగుతున్నారు. భద్రాద్రి జిల్లాలో ప్రవహిస్తున్న సీతారామ కెనాల్‌కు అనుబంధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మిస్తే ఆ ప్రాంతంలో వేలాది ఎక రాలు సస్యశ్యామలమవుతాయి. కానీ వాటిని పట్టించుకోకుండా జిల్లాకు చెందిన మంత్రులు ఎవరి ప్రయోజనాల కోసం డిజైన్లు పదేపదే మారుస్తున్నారనేది ప్రశ్నగా మిగిలింది. జిల్లాకు ప్రయోజనం లేకుండా మంత్రులు ఎంత వెంపర్లాడినా ఉపయోగం లేదు. దీన్ని ప్రజలు గ్రహించారు.ఇక ఆలోచించాల్సింది పాలకులే.
మచ్చా వెంకటేశ్వర్లు
9490098192
భద్రాద్రి జిల్లా వాసులకు దక్కని ‘సీతారామ’ జలాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES