– జమ్మూకాశ్మీర్‌లో బ్లాక్ డే.. పదిహేను నిమిషాలు లైట్లు బంద్
– రాష్ట్రహోదా ఇవ్వాల్సిందే : మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా
– ‘హమారీ రియాసత్, హమారా హఖ్’ పేరుతో నిరసనల హోరు
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను రద్దు చేసి ఆరేండ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆగస్టు 5ను (మంగళవారం) జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు బ్లాక్ డేగా పాటించాయి. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ , సీపీఐ(ఎం) సహా పలు పార్టీలూ ఉన్నాయి. బ్లాక్ డే సందర్భంగా మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 15 నిమిషాల పాటు కాశ్మీర్ వ్యాప్తంగా లైట్లను బంద్ చేసి ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దును ముక్త కంఠంతో వ్యతిరేకించాలని మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పిలుపునిచ్చారు. 2019 ఆగస్టు 4న ఆ రెండు ఆర్టికల్స్‌ను కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు రద్దు చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. దీనివల్ల కాశ్మీరీల వాణి, హక్కులు మూగబోయా యన్నారు. కాశ్మీరీల రాజ్యాంగ హక్కులను తమను సంప్రదించకుండానే రద్దు చేశారని మెహబూబా ముఫ్తీ ధ్వజమెత్తారు. కేంద్రం వల్ల తమకు చాలా అన్యాయం జరిగిందన్నారు. ఇందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా లైట్లు బంద్ చేసి, చీకటి, మౌనంలతో కూడిన సందేశాన్ని పంపుతామని వెల్లడించారు. కాశ్మీరీల జీవితాల్లో అవే మిగిలాయని ఆవేదన వెలిబుచ్చారు.
జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్రహౌదా ఇవ్వాల్సిందే : ఫారూక్ అబ్దుల్లా
జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హౌదాను మళ్లీ ఎప్పుడిస్తారని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తప్పకుండా తమకు రాష్ట్రహౌదా ఇవ్వాల్సిందేనని, మరోదారి లేదని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని రాజ్‌భవన్‌లో కేంద్ర ప్రభుత్వం తరఫున వైస్రారు కూర్చొని ఉన్నారని, కాశ్మీరులో ప్రభుత్వమున్నా వైస్రాయే అన్నీ తానై నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ పాలనా పద్ధతిలో మార్పు జరగాల్సిన సమయం వచ్చిందని, ఇదొక ప్రజాస్వామిక దేశమని అన్నారు. గత ఆరేండ్లలో జమ్మూకాశ్మీర్ కోసం ఏం చేసిందో చెప్పాలని కేంద్ర సర్కారును ఫారూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న కుల్గాం ఎన్‌కౌంటర్‌పై ఆయన స్పందిస్తూ, మనం అనుసరిస్తున్న మార్గం ఆందోళన కలిగిస్తోందని, దేశ భవిష్యత్తు ఏమవుతుందో అనిపిస్తోందన్నారు. పొరుగుదేశాలతో మనం ఇదే విధంగా వ్యవహరిస్తే శాంతియుత వాతావరణం ఏర్పడదని ఫారుక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. రాత్రికిరాత్రే పొరుగు దేశాలతో శాంతికి బాటలు పడతాయనే అపోహలో ఉండటం మూర్ఖత్వమేనని, భారత్‌కు పొరుగున చైనా, పాక్ లాంటి బలమైన దేశాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. యుద్ధం అనేది మార్గం కానే కాదని, చివరకు కలం, చర్చలతోనే మార్గాన్ని వెతకాల్సి ఉంటుందని తెలిపారు. యుద్ధం వల్ల దేశానికి నష్టమే జరుగుతుందని చెప్పారు.
లాక్కున్న హక్కులన్నీ తిరిగి ఇచ్చేదాకా బ్లాక్ డే : నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ
ఆర్టికల్ 370 రద్దును తాము ఎప్పటికీ అంగీకరించేది లేదని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధికార ప్రతినిధి తన్వీర్ సాధిక్ చెప్పారు. జమ్మూకాశ్మీర్ నుంచి లాక్కున్న హక్కులన్నీ తిరిగి ఇచ్చే దాకా ఏటా ఆగస్టు 5న బ్లాక్ డేను నిర్వహిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుతంగా ధర్నాలు : కాంగ్రెస్
చారిత్రక జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా మార్చడాన్ని తాము అస్సలు అంగీకరించబోమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. త్వరగా జమ్మూకాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హౌదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ, శాంతియుతంగా మంగళవారం జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు తెలిపామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీడియా కోఆర్డినేటర్ నీరజ్ గుప్తా తెలిపారు. ‘హమారీ రియాసత్, హమారా హఖ్’ పేరుతో కాశ్మీర్‌లో తాము నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ నిరసనలు నిర్వహించినట్టు చెప్పారు.
జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కుల్ని కేంద్రం కాలరాసింది : సీపీఐ(ఎం) ఎమ్మెల్యే తరిగామి
ఆరేండ్ల కిందట ఆర్డికల్..370 పేరుతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కుల్ని కాలరాసిందని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా బుల్‌డోజర్ రాజకీయాలకు మోడీ ప్రభుత్వం తెరలేపిందన్నారు. కేంద్రం కుట్రలతో జమ్మూ, లద్దాక్‌లను విడదీసిందని, ఈ చర్యకు ఇక్కడి ప్రజలు పూర్తి వ్యతిరేకమని అన్నారు. నాడు..నేడూ విభజన రాజకీ యాలతో లబ్ది పొందాలనుకుంటే..జనం తిరగ బడతారని తెలిపారు. ఇప్పటికీ జమ్మూను ముక్కలు చేయాలని బీజేపీ పాలకులు ఎత్తులు వేస్తున్నారని, అలాంటి దుష్ట రాజకీయాలకు జనం చరమగీతం పాడతా రని స్పష్టం చేశారు. విధ్వంసం, ప్రజా గొంతులను అణగదొక్కే చర్య లతో.. జమ్మూ ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారను కుంటే పొరపాటేనని స్పష్టం చేశారు.
ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు ఆరేండ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES